3.25 లక్షల కొలువులొస్తాయ్‌

* 13,598 పరిశ్రమల ఏర్పాటు
* 2020 నాటికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు
* లక్ష్యంగా నిర్ణయించిన సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక రంగంలో దాదాపు 3.25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ లక్ష్యాలను సిద్ధం చేసింది. స్టార్టప్‌లతో పాటు కొత్తగా చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల ఏర్పాటుతో రెండంకెల అభివృద్ధి సాధించాలని భావిస్తోంది. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక మిషన్‌ ప్రకటించిన సర్కారు యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది.
పారిశ్రామిక అభివృద్ధి కోసం 2020 నాటికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని తద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని నిర్ణయించింది. ఏపీ రెండెంకెల వృద్ధి సాధించేందుకు 2029 నాటికి రూ.4.5 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమని, ఈ లక్ష్యంలో ముందుగా రూ.2 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలకు జాతీయ రహదారులు, పోర్టులు, రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానం అనుకూలంగా ఉన్నాయి. అసంఘటిత రంగంలోని నమోదు కాని యూనిట్లను ప్రత్యేక మేళాలు నిర్వహించి వాటిని ప్రభుత్వం వద్ద నమోదు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక వృద్ధి కోసం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, అనుమతులు, పోత్సాహకాలన్నీ ఆన్‌లైన్లో మంజూరు చేయడంతో పాటు పారిశ్రామిక విధానం మేరకు అర్హులైన వారికి రూ.1200 కోట్లతో ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొంది.
ఇవీ లక్ష్యాలు..
వచ్చే రెండేళ్లలో పరిశ్రమల ద్వారా 3.25 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా ఆశించిన లక్ష్యాన్ని సాధించవచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక టర్నోవర్‌ 4 శాతం పెరగనుంది. మార్కెట్‌ పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే రూ.కోటి పెట్టుబడులకు 5 మందికి ఉపాధి లభిస్తోంది.
* 2017 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13,598 పరిశ్రమలు, స్టార్ట్‌అప్‌లు స్థాపించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి. వచ్చే ఏడాదిలోనే కనీసం 10,319 కంపెనీలు రావాలి.
* రెండేళ్లలో రూ.65వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి. తద్వారా రూ.1.06 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించవచ్చు.
* గత ఏడాది పారిశ్రామిక రంగంలో 38,700 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత ఏడాది ఈలక్ష్యం 50వేలకు పెరగాలి.
* 2017లో అత్యధిక పెట్టుబడులు, పరిశ్రమలతో కనీసం 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలి.
* 2020 నాటికి రూ.2లక్షల కోట్లతో కనీసం పది లక్షల మందికి ఉపాధి.

Posted on 04 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning