క్లౌడ్‌ సేవలతోనే.. అందరికీ కంప్యూటింగ్‌

*సేవగా సాఫ్ట్‌వేర్‌, మౌలిక సదుపాయాలు
*వ్యయాలు గణనీయంగా తగ్గుతాయ్‌
*మొగ్గు చూపుతున్న కంపెనీలు

సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలు ఏదైనా ఉత్పత్తిని అభివృద్ధి చేసేటప్పుడు ముందుగా మొబైల్‌ కోసం రూపొందిస్తున్నాయి. క్లౌడ్‌ సేవలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. తర్వాతే డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర కంప్యూటింగ్‌ పరికరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ధోరణి రానున్న కాలంలో మరింత పెరగనుంది. అందుకే 'మొబైల్‌-ఫస్ట్, 'క్లౌడ్‌-ఫస్ట్' వ్యూహంతో మైక్రోసాఫ్ట్‌ ఇండియా అడుగులు ముందుకు వేయనుంది. రానున్న కాలంలో మరిన్ని విభాగాలకు క్లౌడ్‌ సేవలను అందించనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఛైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక్‌ చెబుతున్నారు. క్లౌడ్‌ సేవలతో కంపెనీలు, చిన్న సంస్థల వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని వివరిస్తున్నారు. దేశంలో క్లౌడ్‌ సేవల ఆవశ్యకత, వృద్ధి, కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలు మొదలైన అంశాలపై 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..
భారత్‌లో క్లౌడ్‌ సేవల ఆవశ్యకత, వృద్ధి భవిష్యత్తులో ఎలా ఉంటాయి?
క్లౌడ్‌ సేవలు కంప్యూటింగ్‌ వ్యయాలను తగ్గిస్తాయి. కంప్యూటింగ్‌ను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువస్తాయి. విద్య వంటి రంగాల్లో ఇప్పటి వరకూ టెక్నాలజీని వినియోగించడం పెద్ద సవాలు. ప్రతి పాఠశాల లేదా క్లస్టర్‌కు సొంత డేటా కేంద్రం, సర్వర్‌ వంటివి ఉండాలి. వీటిని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. చిన్న సంస్థలనే తీసుకుంటే వ్యయం ఒక్కటి కాదు. సాఫ్ట్‌వేర్‌ మార్పులు, డేటా కేంద్రం నిర్వహణ వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఇందుకు తగిన సిబ్బంది ఉండరు. వీటిని సమకూర్చుకోవడానికే కాక, కొనసాగించడానికి నిరంతరం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. క్లౌడ్‌ సేవల్లో కంపెనీలకు ఇటువంటి ఇబ్బందులు ఎదురు కావు. హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌, డేటా నిల్వ, సాఫ్ట్‌వేర్‌లపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు. క్లౌడ్‌ సేవల్లో మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లను ఒక సేవగానే పొందుతారు. మీరు వినియోగించు కున్నదానికే చెల్లిస్తారు.
క్లౌడ్‌ సేవల వినియోగించుకోవడం వల్ల కంపెనీలు, సంస్థలకు వ్యయాలు ఏమేరకు తగ్గుతాయి?
క్లౌడ్‌ సేవల వల్ల సాఫ్ట్‌వేర్‌, మౌలిక సదుపాయాలపై కంపెనీల వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. అయిదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా సేవలను పొందడం వల్ల 50-60 శాతం వరకూ వ్యయాలు తగ్గుతాయి. కొత్త సేవలు, అప్లికేషన్లను సంస్థలు వెంటనే అందిపుచ్చుకుని వినియోగించుకుంటాయి. ఈ కారణం చేతనే అనేక కంపెనీలు క్లౌడ్‌ సేవలను పొందడానికి మొగ్గు చూపుతున్నాయి.
క్లౌడ్‌ సేవలపై మైక్రోసాఫ్ట్‌ వ్యూహం ఏమిటి?
పాఠశాలలు, విద్యా సంస్థలకు క్లౌడ్‌ సేవలందించడానికి, బోధన, అభ్యాసనను డిజిటల్‌ చేయడానికి 'ఎడ్యు-క్లౌడ్‌' సేవలను ప్రారంభించాం. మరిన్ని రంగాలకు క్లౌడ్‌ సేవలను అందించాలన్నది మా వ్యూహం. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు సేవలందించడానికి అపార అవకాశాలు ఉన్నాయి. క్లౌడ్‌ సేవలను విస్తరించే లక్ష్యంతోనే దేశంలో మూడు భారీ (హైపర్‌ స్కేల్‌) డేటా కేంద్రాలను ఏర్పాటు చేశాం. దేశంలోని ఐటీ పరిశ్రమలో పబ్లిక్‌ క్లౌడ్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఒక శాతం మాత్రమే ఉంది. దేశంలోని సంస్థలు, కంపెనీలు ఐటీపై 4,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.
భారత్‌లో భవిష్యత్‌ ప్రణాళికలు..?
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల్లో మేం ముందున్నాం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా కాక సమగ్ర ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) కంపెనీగా నిలవాలన్నదే మా లక్ష్యం. ఈ దిశగా పయనిస్తున్నాం. దేశంలో ప్రతి వ్యక్తి, సంస్థ కార్యకలాపాల్లో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం. మా సేవలు, సాఫ్ట్‌వేర్‌ వ్యక్తులు, సంస్థల ఉత్పాదకతను పెంచుతాయి. పని చేసే వారి ఉత్పాదకత 10 శాతం పెరిగితే జీడీపీ 1.5 శాతం పెరుగుతుంది. 'డిజిటల్‌ ఇండియా'ను సాకారం చేయడంలో సహకరిస్తాం.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావును కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టే ఉద్దేశం ఉందా?
హైదరాబాద్‌లో మేం బాగానే పెట్టుబడులు పెట్టాం. ఇది కొనసాగుతుంది. అందరికీ భద్రత, వై-ఫై వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇ-పాలన సేవలను ఏకీకృతం చేయడానికి, కొత్త కంపెనీల అభివృద్ధికి సాయం కోరుతోంది. వీటన్నింటిలో సహకరించడానికి మేం సుముఖత వ్యక్తం చేశాం.
భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే యోచన ఉందా?
ప్రస్తుతానికి లేదు.
మైక్రోసాఫ్ట్‌ 'వైట్‌-ఫై' బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ప్రతిపాదనలు ఎంత వరకు వచ్చాయి?
టెలివిజన్‌ ప్రసారాల్లో చానెళ్లకు మధ్య వినియోగించని రేడియో తరంగాలను (స్పెక్ట్రమ్‌) వినియోగించి మేం అభివృద్ధి చేసిన 'వైట్‌-ఫై' టెక్నాలజీతో మారుమూల, గ్రామాణ ప్రాంతాల వారికి ఇంటర్నెట్‌ సదుపాయాలను కల్పించాలని ప్రతిపాదించాం. ఖాళీగా ఉన్న స్పెక్ట్రమ్‌ను వినియోగించడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాం. దాని కోసం ఎదురు చేస్తున్నాం. లభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో పైలట్‌ ప్రాజెక్టులను చేపడతాం. మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైట్‌-ఫై ద్వారా డిజిటల్‌ సదుపాయాలను కల్పించాలని భావిస్తున్నాం. ఈ టెక్నాలజీతో ఒక్క రౌటర్‌తో 10 కిలోమీటర్ల వరకూ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందుతాయి. ఇతర దేశాల్లో ఇప్పటికే దీన్ని వినియోగిస్తున్నారు.

Posted on 09 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning