బోధనా వృత్తికి ఇంజినీర్లు సై

* బీఈడీలో ప్రవేశానికి అనుమతి
* 2015-16 విద్యాసంవత్సరం నుంచి అమలు
* మూడు వేల మందికిపైగా ఇంజినీరింగ్‌ అభ్యర్థుల దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు ఉపాధి వేటలో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. బోధనా వృత్తిలోకి వచ్చేందుకూ వారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు సాధారణ డిగ్రీల వారికే బీఈడీ చేసేందుకు అనుమతి ఉండగా, తాజాగా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు కూడ అనుమతించారు. దీంతో వారు బీఈడీ చదివేందుకు ముందుకు వస్తున్నారు. త్వరలో జరిగే ఎడ్‌సెట్‌కు మూడు వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది వరకు ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి బ్యాచులర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)లో ప్రవేశానికి అవకాశం లేదు. సాధారణ డిగ్రీలు చేసేవారికే ఉండేది. బీఈడీలో ప్రవేశానికి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్‌ సెట్‌(ఎడ్‌సెట్‌) నిర్వహిస్తోంది. ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం సబ్జెక్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు. జూన్‌ 6వ తేదీన జరిగే ప్రవేశ పరీక్షకు 63 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. అత్యధికంగా సాంఘిక శాస్త్రానికి 29,893 దరఖాస్తులు అందాయి. జీవ శాస్త్రానికి 15,268, ఆంగ్లానికి 862 దరఖాస్తులు వచ్చాయి. భౌతికశాస్త్రం, గణితానికి కలిపి 12 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్‌లో ఆ రెండు సబ్జెక్టులు చదివి ఉంటారు కాబట్టి ఆ రెండు సబ్జెక్టులకు అనుమతి ఇచ్చారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా మూడు వేల మందికిపైగా ఇంజినీరింగ్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉంటారని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ప్రసాద్‌ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల వైపే చూపు: ప్రస్తుతం ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు బోధనా వృత్తిపై ఆసక్తి ఉంటే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. మొదటిసారి బీఈడీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా డీఎస్సీ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయులు కావొచ్చని ఆసక్తితో ముందుకు వస్తున్నారు. ఇంజినీరింగ్‌లో సైతం అవకాశాలు తక్కువగా ఉండటం, కళాశాలల్లో అధ్యాపకులుగా చేసినా తక్కువ వేతనం ఇస్తుండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల వైపు వారు దృష్టి సారిస్తున్నారు.

Posted on 18 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning