మంగళగిరిలో డేటా కేంద్రం

* రూ.600 కోట్ల పెట్టుబడులు
* 300 మందికి ఉద్యోగాలు ఐదేళ్లలో నిర్మాణం పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: మంగళగిరిలో నాలుగో శ్రేణి డేటా కేంద్రాన్ని(టైర్‌ 4 డేటా సెంటర్‌) ఏర్పాటుచేసేందుకు పై డేటా సెంటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఐదేళ్లలో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థకు మంగళగిరిలోని ఏపీఐఐసీ లేఅవుట్‌లో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డేటా కేంద్రం ఏర్పాటుచేయనున్న ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టడంతోపాటు 5 వేల ర్యాక్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పింది. సాంకేతిక నైపుణ్యం గల 300 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, తాగునీరు, విద్యుత్తు, రోడ్డు మార్గం తదితర సౌకర్యాలు కావాలని కోరింది. ఈ ప్రతిపాదన పరిశీలించిన ఏపీ సర్కారు ఫిబ్రవరి 2న జరిగిన మంత్రిమండలి సమావేశంలో సంస్థకు 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది.
ఇచ్చిన స్థలాన్ని ఐటీ, ఐటీఈఎస్‌ కార్యక్రమాలకే వినియోగించాలని, మంగళగిరి లేఅవుట్‌లో కేటాయించిన 10 ఎకరాల స్థలానికి 33 ఏళ్లపాటు ఏటా ఎకరాకు కోటి చొప్పున లీజు చెల్లించాలని షరతు విధించింది. మంచి పనితీరు కనబరిస్తే, నిబంధనలన్నీ పాటిస్తే మరో 33 ఏళ్ల కాలానికి లీజును పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది. భూమి అప్పగించిన ఆరునెలల్లో నిర్మాణం ప్రారంభించి తొలివిడతను 15 నెలల్లో పూర్తిచేసి, ఆ తరువాత మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని మంత్రిమండలి స్పష్టం చేసింది. లేకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కేటాయింపు రద్దుచేస్తామని హెచ్చరించింది. ఆ సంస్థ ఇచ్చిన హామీ మేరకు నిర్మిత స్థలం, పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కల్పించాలని తెలిపింది. ఒప్పందంలోని నిబంధనలు పాటించకున్నా, గడువులోగా నిర్మాణం ప్రారంభించకున్నా కేటాయింపులు రద్దుచేస్తామని, ఈ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించేందుకు వీలు లేకుండా నిబంధనను చేర్చనున్నట్లు ఐటీశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో పాటు, కృష్ణానది నుంచి పైపులైను ద్వారా నిరంతర తాగునీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే మెగాప్రాజెక్టు కింద అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది.

Posted on 23 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning