అరచేతిలో 'పాఠ్యాంశం'..!

* ఉచితంగా ఈ-లెర్నింగ్‌
* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తీపి కబురు
* జేఎన్‌టీయూలో అవగాహన ఒప్పందం

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పాఠ్యాంశం అరచేతిలో ఒదిగిపోనుంది. సాంకేతిక, సమాచార రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా యువతకు ఆధునిక పరిజ్ఞానం సొంతం చేసే దిశగా జేఎన్‌టీయూ మరో అడుగు ముందుకు వేస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశం అంతా అంతర్జాలంలో ఉంచబోతోంది. ఇది విద్యార్థులకు తీపి కబురే. అంతర్జాలంను సైతం ఉచితంగా ప్రభుత్వమే ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. విద్యార్థులకు అంతర్జాలం ద్వారా పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకొచ్చే విధానంపై మే 25న జేఎన్‌టీయూ, మొబైల్‌ ట్యూటర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (ఎమ్‌ట్యూటర్‌) అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి.
గ్రామీణ యువతకు ఉపయుక్తం
గతంలో ఉన్న ఈ-లెర్నింగ్‌ విధానానికి, జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అందించే విధానం పూర్తిగా భిన్నం. ఇప్పటికే వీడియో పాఠాలు, ఎన్‌పీటీఎల్‌ కోర్సులు, ఐఐటీ ఆచార్యుల పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. తాజా ఒప్పందంతో పాఠ్యపుస్తకమే అరచేతిలో ఉంటుంది. ఇంజినీరింగ్‌లోని అన్ని బ్రాంచిల్లో ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాలన్నీ ఆన్‌లైన్లో దర్శనం ఇస్తాయి. ఆంగ్లంతో పాటు తెలుగులో అనువాదం ఉంటుంది. ఇంజినీరింగ్‌లో చేరనున్న గ్రామీణ ప్రాంతాల తెలుగు మీడియం విద్యార్థులకు ఇది బాగా ఉపయుక్తం అవుతుందన్నది విశ్వవిద్యాలయ యోచన. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరగానే.. అంతా ఆంగ్లమాధ్యమం కన్పించగానే ఒకింత భయపడి ప్రథమ సంవత్సరంలో ఎక్కువగా తప్పుతున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 115 కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్‌లో 45వేల సీట్లు ఉండగా.. మన జిల్లాలోని 19 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 8 వేల సీట్లు ఉన్నాయి.
ఒక్క క్లిక్‌తో ప్రత్యక్షం
చెన్నైలోని ఎమ్‌ట్యూటర్‌ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌కు పాఠ్యాంశాలు అనుసంధానం చేస్తారు. ముందుగా జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచిల విద్యార్థుల పాఠ్యపుస్తకాలను తీసుకొని వాటిని ఐఐటీ, ఎన్‌ఐటీ ఆచార్యులతో మరింత విశ్లేషణాత్మకంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. పాఠ్యాంశాన్ని ఆంగ్లం, తెలుగులో జేఎన్‌టీయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇందుకు వర్సిటీగానీ, విద్యార్థి గానీ ఏవిధమైన సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. అంతర్జాలం ఉంటే చాలు.. పాఠ్యాంశాలు చేతిలో ఉన్నట్లే. వెనుకబడిన ప్రాంతం కావడంతో ఈ విద్యాలయాన్ని ఆ సంస్థ ప్రయోగాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా పలు ప్రైవేటు కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేరు. అంతో ఇంతో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మంచి కళాశాలల్లో సీట్లు వస్తాయి. ఇక పూర్తిగా వెనుకబడ్డ విద్యార్థులకు ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు లేని కళాశాలల్లోనే సీట్లు లభిస్తాయి. అక్కడ బోధనా విధానం సైతం అంతంత మాత్రమే. ఈ-లెర్నింగ్‌ పాఠ్యాంశంతో విద్యార్థులకు అర్థంక కాని అంశాలను తెలుగులోనే చదువుకొని అందుకు అనుగుణంగా ఆంగ్లంలో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క క్లిక్‌తో స్మార్ట్‌ ఫోన్లలోనూ, ట్యాబ్‌లెట్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా చూడవచ్చు. కావాల్సిన పాఠ్యాంశం చదువుకోవచ్చు. ఏదైనా అవసరం అనుకుంటే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
పేరు మరింత ఇనుమడింపు: ఆచార్య కృష్ణయ్య, రిజిస్ట్రార్‌
జేఎన్‌టీయూ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పాఠ్యాంశాలు ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా చూడొచ్చు. ఇలాంటి సరికొత్త నిర్ణయాలతో జేఎన్‌టీయూ పేరు మరింత ఇనుమడిస్తుంది. విశ్వవిద్యాలయం నుంచి ఖర్చు లేకుండా ప్రథమ సంవత్సర విద్యార్థులందరికీ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయి. ముందుగా ప్రథమ, ఆ తర్వాత ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరంలోకి వెళ్లే సరికి పాఠ్యాంశాలు ఆన్‌లైన్లో పొందుపరుస్తారు. పాఠ్యాంశం అర్థం కాకుంటే.. ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


Posted on 25 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning