గంటల ఏకాగ్రత నాది!

నెక్కంటి యామిని.. చదువుల్లో గజ ఈతరాలు. అవును.. ఒక్క ఉదుటన సప్తసముద్రాల్లాంటి ఏడు ఐఐఎంలలో సీటు సాధించేసింది. 'క్యాట్‌' రాసి ఒక్క ఐఐఎంలో సీటు పొందడానికే ఆపసోపాలు పడేవారి మధ్య ఇంత అవకాశం తనకెలా వచ్చిందీ... చదువుల్లో తన ప్రతిభా నైపుణ్యాలకి పదును పెట్టిన పట్టుదల ఎలాంటిదీ... అవన్నీ తన మాటల్లోనే..
బాల్యం నుంచి నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన అధ్యాపక వృత్తిలో ఉన్నారు. నాకు వ్యక్తిత్వం నేర్పారు, ధైర్యాన్ని నూరిపోశారు. చదువులపరంగా ఏ అడ్డంకి వచ్చినా ఎలా ముందుకు నడవాలో నేర్పారు. అందుకు తగ్గ స్వేచ్ఛా కల్పించారు. నేను ఇన్ని సాధిస్తున్నానంటే... అవన్నీ ఆయన కలలేనని చెప్పాలి. మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా అచంట. నాన్న ఉద్యోగంలో భాగంగా కడపకు వచ్చేశారు. అక్కడే మధుసూదన్‌ పాఠశాల, శాంతినికేతన్‌, శ్రీకృష్ణారెడ్డి చైతన్య పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. పదో తరగతేమో ఒంగోలులోని నిర్మల ఉన్నత పాఠశాలలో చేరాను. 96 శాతం మార్కులతో ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులొచ్చాయి. ఏఐఈఈఈలో 1125, ఎంసెట్‌లో 30వ ర్యాంకు సాధించా. భువనేశ్వర్‌ ఐఐటీ (90 శాతం)లో బీటెక్‌ పూర్తి చేశా. అప్పుడే ప్రాంగణ ఎంపికలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ముంబైలో టాటా పవర్‌ సంస్థలో లీడరు ఇంజినీరుగా ఉంటున్నా!
పరీక్ష ఏదైనా సరే...
... నేను నెలరోజుల ముందునుంచే సిద్ధమవుతాను. రోజుకి ఏడు గంటలకు తగ్గకుండా చదవగలుగుతాను. చిన్నప్పటి నుంచే అంత ఏకాగ్రత అలవాటైపోయింది. అలా ఒకచోట కూర్చుని నిలకడగా చదవగలిగే క్రమశిక్షణే నా విజయసూత్రం. ఇదే 'క్యాట్‌'లో 98.5 శాతం మార్కులు సాధించేలా చేసిందన్నది నా విశ్వాసం. ఈ స్థాయి మార్కులు రావడం వల్లే నేను కోజికోడ్‌, ఇండోర్‌, తిరుచ్చి, ఉదయపూర్‌, రాయపూర్‌, కాశీపూర్‌, రాంచి ఐఐఎం కేంద్రాల్లో మేనేజిమెంట్‌ విద్య చదివేందుకు అర్హత సాధించాను.
సీఈవో కావాలని...
ఇక చదువుకి సంబంధించిన మెటీరియల్‌ విషయానికొస్తే అరుణ్‌శర్మ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - క్యాట్‌, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్స్‌ వంటి పుస్తకాలు నాలో నైపుణ్యాన్ని పెంచాయి. ఆంగ్ల భాషపై సంభాషణ మెలకువలు చెప్పే వీడియోలు ఎక్కువగా చూశాను. ఆంగ్ల పత్రికలూ, పుస్తకాలూ చదవడం తప్పనిసరి చేసుకున్నాను. ఐఐఎంలో ప్రావీణ్యం సాధించి బహుళజాతి సంస్థకు 'సీఈవో' కావాలనేది నా ఆశయం.

Posted on 26 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning