బీటెక్‌ విద్యార్థులు.. హైటెక్‌ శిక్షణ

* కరీంనగర్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌
* 30న కొండగట్టులో అభ్యర్థుల ఎంపిక
* విజయవంతమైతే ఇతర జిల్లాల్లో అమలు

కరీంనగర్‌ (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ-ఇందిరాక్రాంతి పథం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోనే జిల్లాను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి కార్యాచరణ చేపట్టింది.. బీటెక్‌ విద్యనభ్యసించి ఉద్యోగం లేక నిరీక్షిస్తున్న వారికి కార్పొరేట్‌ కంపెనీల్లో ఉపాధి కల్పించేందుకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 18 ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా ఏటా వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు పొందనివారికి మార్గదర్శిగా నిలవడంతో పాటు విద్యార్థిలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు శిక్షణనివ్వనుంది. తొలుత 2012-13, 2013-14 సంవత్సరాల్లో బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. వారిలో ప్రతిభ గల 50 మందిని ఎంపిక చేసి జూన్‌లో శిక్షణ కార్యక్రమం చేపడుతారు.
* ఎంపిక విధానమిదీ..
2012-13, 2013-14 సంవత్సరాలలో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. మే 29న నిర్వహించనున్న రాత పరీక్షలను రాయాలి. ఇప్పటికే ఆయా కళాశాలల విద్యార్థులకు సమాచారాన్ని అందించారు. రాత పరీక్ష ద్వారా ప్రతి కళాశాల నుంచి 40మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులతో మే 30న కొండగట్టులోని జేఎన్‌టీయు కళాశాలలో సదస్సు ఏర్పాటు చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఎంపికైన వారందరిలో నుంచి 50 మందిని ఎంపిక చేసి జూన్‌ మొదటివారం నుంచి 3 నెలల పాటు అక్కడే శిక్షణ నివ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతిని కల్పించనున్నారు. అనంతరం క్యాంపస్‌ ఇంటర్వూల ద్వారా ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.
* ఇతర జిల్లాల్లో చదివిన వారికీ అవకాశం - జేడీఏం కుమారస్వామి
జిల్లాకు చెందిన విద్యార్థులు ఇతర జిల్లాల్లో చదివినా అవకాశం కల్పించాం. వారు నేరుగా మే 30న జరగనున్న సదస్సుకు హాజరై రాత పరీక్ష రాయవచ్చు. ఇతర రాష్ట్రాల్లో చదివినా సరే.. ఆయా సంవత్సరాల్లో ఇంజినీరింగ్‌ పట్టభద్రులైన నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇంజినీరింగ్‌ విద్యా నైపుణ్యాన్ని పెంపొందించి ఉన్నత ఉద్యోగావకాశాలు అందించడానికి పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జిల్లాలో తొలిసారిగా ఫినిషింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు. రాజీవ్‌ ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌ మిషన్‌ ద్వారా దీనిని ఏర్పాటు చేయగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- ఇందిరా క్రాంతి పథం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. స్కూల్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన విద్యార్థులను ఎంపిక చేసి 3నెలల ఉచిత శిక్షణనివ్వనున్నారు. ఉద్యోగ అవకాశాలు పొందడానికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌, జావా, సీ లాంగ్వేజ్‌, ఒరాకిల్‌, హెచ్‌టీఎంఎల్‌, స్క్రిప్ట్‌, ఎక్స్‌ఎమ్‌ఎల్‌, కోర్‌ జావా, అడ్వాన్స్‌డ్‌ జావా, డాట్‌నెట్‌, స్ప్రింగ్‌ ఎంవీసీ, 3-టైర్‌ఆర్క్‌ తదితర కోర్సుల్లో శిక్షణనివ్వనున్నారు.


Posted on 29 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning