ఆలోచనుంటే చాలు..

* దగ్గరుండి కొత్త కంపెనీ పెట్టిస్తారు
* మార్గదర్శకత్వం ఇస్తారు
* నిధులు అందేలా చేస్తారు
* రోజుకో పారిశ్రామికవేత్తను అందిస్తున్న కేరళ 'స్టార్టప్‌ విలేజ్‌'

ఈనాడు వాణిజ్య విభాగం: ఆలోచన ఉంటుంది. ఆచరణకు అవసరమైన మార్గదర్శకత్వం కానీ.. నగదు కానీ ఉండదు. మరి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలా తయారవుతారు. ఈ ఆలోచనతోనే మూడేళ్ల కిందట కేరళలో స్టార్టప్‌ విలేజ్‌ ప్రారంభమైంది. దేశంలోనే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటైన తొలి స్టార్టప్‌ విలేజ్‌ ఇదే. ఇపుడు రోజుకో ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ఇది తయారుచేస్తోంది. ఈ విజయగాథ మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తోంది. ఆ కథేంటో చూద్దామా..
ఇలా ఏర్పాటైంది..
కేరళలోని కొచ్చిలో ఏప్రిల్‌ 15, 2012లో ఈ ఇంటర్నెట్‌-మొబైల్‌ ఇంక్యుబేటర్‌ ఏర్పాటైంది. దీన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, కేంద్ర ప్రభుత్వం, టెక్నోపార్క్‌, మొబ్‌మీ వైర్‌లెస్‌లు సంయుక్తంగా స్థాపించాయి. కేవలం మూడేళ్లలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ స్టార్టప్‌ విలేజ్‌ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అంతర్జాతీయ నేతలు, పెట్టుబడుదారులు దీనిని సందర్శించడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ఇతర ఇంక్యుబేటర్లలా కాదు
సాధారణ ఇంక్యుబేటర్లకు భిన్నంగా ఇక్కడ స్టార్టప్‌లకు కావలసిన అన్ని ప్రాథమిక సేవలూ అందుతాయి. మెంటార్‌షిప్‌తో సహా. ఇంతకీ ఈ స్టార్టప్‌ విలేజ్‌కి చీఫ్‌ మెంటారు(ప్రధాన రూపశిల్పి) ఎవరో తెలుసా ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌. బ్లాక్‌బెర్రీ, ఆర్‌ఐఎమ్‌, ఐబీఎమ్‌ వంటి బహుళ జాతి కంపెనీల సహకారం లభిస్తోందంటే ఈయన వల్లే. కాగా, వచ్చే అయిదేళ్లలో 1000 స్టార్టప్‌లు ఏర్పాటు చేసే దిశగా ఈ విలేజ్‌ దూసుకెళుతోంది.
25 ఏళ్లకే సీఈఓ: స్టార్టప్‌ విలేజ్‌లో యాప్స్‌దే హవా. దాదాపు 300 అప్లికేషన్లు ఇక్కడ అభివృద్ధి చేసినవే. ఇవి రెండేళ్లలో తయారైనవే. వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. రైఫీ టెక్నాలజీస్‌ అనే స్టార్టప్‌ అయితే 2012లో ఏర్పాటైంది. ఇపుడు ఆ కంపెనీ తయారు చేసిన ఆరోగ్య, జీవనశైలి అప్లికేషన్లతో నెలకు రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక ఈ కంపెనీ సీఈఓ, 25 ఏళ్ల టోనీ జార్జ్‌ యాప్స్‌ తయారైన అయిదు నెలలలోపే రూ.20 లక్షలు పొందారు. స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటైన తొలి రోజు నుంచే యాప్‌ల అభివృద్ధిపై వర్కషాపులు నిర్వహించడం; హాకథాన్‌లను ఏర్పాటు చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. 1000 మంది విద్యార్థి స్థాయి డెవలపర్లను తయారు చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారిక్కడ. ఇక ఇక్కడ ఏర్పాటైన ఆర్‌హెచ్‌ఎల్‌ విజన్‌ కేవలం 22 నెలల్లోనూ రూ.60 కోట్ల మార్కెట్‌ విలువను తాకడం పట్ల స్టార్టప్‌ సీఈఓ ప్రణవ్‌ కుమార్‌ సురేశ్‌ ఆనందం వ్యక్తం చేస్తుంటారు. మైండ్‌హెలిక్స్‌, సెక్టార్‌ క్యూబ్‌, ఆర్‌హెచ్‌ఎల్‌ విజన్‌లు మూడూ కలిసి వాటి ఏర్పాటుకు సమీకరించింది రూ.2.5 కోట్లు మాత్రమే.
విశాఖలో కేంద్రం
స్టార్టప్‌ విలేజ్‌ సాధిస్తున్న విజయాలను చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్టార్టప్‌ విలేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో వచ్చే అయిదేళ్లలో 1000 స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. ఆ దిశగా గతేడాది డిసెంబరులో విశాఖలో కేంద్రం ఏర్పాటైంది. పాఠశాల విద్యార్థులకోసం రాస్‌బెర్రీ పై పథకం; ఇంజినీరింగ్‌ కళాశాలల్లో స్టార్టప్‌ బూట్‌ క్యాంపులు ఏర్పాటు చేసి బలమైన పునాదిని వేయనున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక స్టార్టప్‌ విలేజ్‌ను తీసుకొచ్చిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కాగా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లు కూడా ఈ తరహా విలేజ్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.
2889 ఉద్యోగాలొచ్చాయ్‌
2014 చివరకు మొత్తం 533 స్టార్టప్‌లు(కొత్త కంపెనీలు) ఏర్పాటు కాగా.. అందులో 116 క్యాంపస్‌ స్టార్టప్‌లు. మొత్తం కొత్త కంపెనీల ద్వారా 2889 ఉద్యోగాలొచ్చాయి. 37 స్టార్టప్‌లు ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, సీడ్‌ ఫండ్‌ల నుంచి రూ.27 కోట్ల దాకా సమీకరించాయి. 161 స్టార్టప్‌లయితే స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి నిధులను పొందాయి. విద్యార్థులు ఏర్పాటు చేసిన 293 స్టార్టప్‌లలో 116 చురుగ్గా ఉన్నాయి. 149 స్తబ్దుగా ఉండగా.. 28 కార్యకలాపాలు నిలిపివేశాయి.
        - స్టార్టప్‌ విలేజ్‌ ఛైర్మన్‌ సంజయ్‌ విజయకుమార్‌Posted on 31 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning