కంప్యూటర్‌ ప్రాధాన్యం తగ్గలేదు!

* నైపుణ్యాలు పెంచుకునే సాధనం
* చిన్న పట్టణాల నుంచి గిరాకీ
* డెల్‌ అధ్యయనం

ఈనాడు - హైదరాబాద్‌: అంతర్జాల వీక్షణకు స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల వినియోగం పెరుగుతున్నా.. పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ)కు ప్రాధాన్యం తగ్గడం లేదు. కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రం పీసీనే వినియోగిస్తున్నందున, వీటి అమ్మకాలకు ఇబ్బంది లేదని డెల్‌ పేర్కొంది. చిన్న పట్టణాల నుంచి వీటికి గిరాకీ పెరగనుందని పర్సనల్‌ కంప్యూటర్లపై చేసిన అధ్యయనంలో వెల్లడించింది. యువత, నిపుణులు తమ నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంచుకోవడానికి కంప్యూటర్‌ ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. సమాచారం (కంటెంట్‌) రూపొందించడానికి పీసీలను అధికంగా వినియోగిస్తున్నారు. విద్యార్థులు, యువత, యువ ఉద్యోగులతో పాటు పెద్దలు కూడా పీసీ వాడకానికి మొగ్గు చూపుతున్నారు. ప్రజలు రోజు వారీ జీవితంలో టెక్నాలజీ ఆవశ్యతను, ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. సాంకేతికత వినియోగంలో కంప్యూటర్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ ఉద్యోగ జీవితాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దుకోవడానికి కంప్యూటర్‌ను వినియోగించుకోవాలను కుంటున్నారని డెల్‌ ఇండియా ఉపాధ్యక్షుడు పి.కృష్ణకుమార్‌ తెలిపారు. మొత్తం 40 ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించినట్లు, ఒక్కో చోట వివిధ వర్గాలకు చెందిన 150 మంది పాల్గొన్నట్లు చెప్పారు.
* ఉత్తరాదిలో అధ్యయనంలో పాల్గొన్న యువతలో 75 శాతం మంది రోజుకు 5 గంటలకు పైగా పీసీలను వినియోగిస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది పని చేయడం ఇందుకు ఒక కారణం. 83 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్‌ కొనుగోలు సమయంలో సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. పర్సనల్‌ కంప్యూటర్ల కొనుగోలులో యువత బ్రాండ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. తల్లిదండ్రుల్లో 38 శాతం మంది, తమ పిల్లలు కంప్యూటర్‌ను తమకు పరిచయం చేయడం సౌకర్యవంతంగానే ఉందని పేర్కొన్నారు. ఎంతో సంక్లిష్టమైన పనులను కంప్యూటర్‌ సులభతరం చేసిందని వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం వ్యాపార నిర్వహణ సాధనం మాత్రమే కాదని పేర్కొన్నారు.
* దక్షిణాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గౌరవిస్తున్నా, కంప్యూటర్‌ కొనుగోలు చేయడానికి కొంత మంది ఇష్టపడటం లేదు. దక్షిణాదిలో 15-20 మధ్య వయసు ఉన్న విద్యార్థుల్లో 15 శాతం మందికే కంప్యూటర్‌ అందుబాటులో ఉంది. సంగీతం, సినిమాల కోసం 64 శాతం మంది యువత పీసీని ఆశ్రయిస్తున్నారు.
* తూర్పు ప్రాంతంలో 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే తమ పాఠశాల పని కోసం రోజూ పీసీని వినియోగిస్తున్నారు. 78 శాతం మంది యువత పీసీ ద్వారా వినూత్న విషయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
* పశ్చిమ ప్రాంతంలో 79% విద్యార్థులకు 15 సంవత్సరాల లోపే కంప్యూటర్‌ పరిచయం అవుతోంది. 48 శాతం మంది విద్యార్థులు తమ రోజు వారి పాఠశాల పని కోసం పీసీపై ఆధారపడుతున్నారు. 54 శాతం మంది విద్యార్థులు రోజుకు 5 గంటలకు పైగా పీసీని వినియోగిస్తున్నారు.


Posted on 16 - 06 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning