హైదరాబాద్‌కు సిపెట్‌ ఉన్నత విద్యాకేంద్రం

* ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులు
* తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తే ఈ విద్యాసంవత్సరంలోనే ప్రారంభం

ఈనాడు - హైదరాబాద్‌: హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఉన్నతవిద్యా కేంద్రం మంజూరైంది. జాతీయ ప్లాస్టిక్‌ ఇంజినీరింగు పరిజ్ఞాన సంస్థ (సిపెట్‌) ఆధ్వర్యంలో ఉన్నత అధ్యయన కేంద్రాన్ని (హైలెవల్‌ లెర్నింగ్‌ సెంటర్‌- హెచ్‌ఎల్‌సీ) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలో అత్యధిక డిమాండ్‌ గల కోర్సుల్లో ఒకటిగా ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌కు పేరుంది. బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులను కొత్త కేంద్రంలో నిర్వహించే వీలుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఈ విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు అహ్మదాబాద్‌(గుజరాత్‌), భువనేశ్వర్‌(ఒడిశా), చెన్నై(తమిళనాడు), లఖ్‌నవ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌), కొచ్చి (కేరళ)లలో హెచ్‌ఎల్‌సీలు నడుస్తున్నాయి. వీటిలోని బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉంది. హైదరాబాద్‌లో సిపెట్‌ ప్రాంగణం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఇక్కడ హెచ్‌ఎల్‌సీ ఏర్పాటు కాలేదు. హెచ్‌ఎల్‌సీ కోసం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖను ఇటీవల రాష్ట్రం అభ్యర్థించింది. ఆ శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ స్పందించి తెలంగాణకు హెచ్‌ఎల్‌సీని మంజూరు చేశారు. ఈ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ ఇంజినీరింగులో బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులలో 300 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ప్లాస్టిక్‌ రంగంలో నిపుణులకు భారీగా డిమాండ్‌ ఉంది. ఈ కోర్సులు పూర్తిచేయకముందే విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సిపెట్‌ ఉంది. దాని ఆధ్వర్యంలో హెచ్‌ఎల్‌సీ నడపడానికి అన్ని రకాల అనుకూలతలున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులను భరించాలి. భూమి, ఇతర మౌలిక వసతులు, పరికరాల కొనుగోలు బాధ్యత రాష్ట్రానిదే. ఈ ప్రాజెక్టుకు రూ. వంద కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 50 కోట్లు భరించాలి. కేంద్రం మంజూరు చేసిన సిపెట్‌ హెచ్‌ఎల్‌సీ తెలంగాణకు వరం లాంటిందని.. విద్యార్థులతో పాటు పారిశ్రామిక రంగానికి ఉపయోగపడుతుందని తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టిఫ్‌) అధ్యక్షుడు కె. సుధీర్‌రెడ్డి జూన్ 21న 'ఈనాడు'కు చెప్పారు.

http://cipet.gov.in/


Posted on 22 - 06 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning