విజ్ఞాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్!

* ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యంగా అడుగులు
* నాలెడ్జి మిషన్‌తో ఉన్నత విద్యాశాఖ మమేకం

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను 'నాలెడ్జి మిషన్‌'గా మార్చేందుకు మానవ వనరుల అభివృద్ధిశాఖ తన ప్రయత్నాలను తీవ్రతరం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన లక్ష్యాల్ని అనుసరించి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత విద్యాశాఖ దశలవారీగా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో చర్చలు జరుపుతూ తీసుకోవాల్సిన చర్యల్ని వేగవంతం చేస్తోంది. విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర విజ్ఞాన కార్యనిర్వాహక బృందం (స్టేట్ నాలెడ్జి ఎగ్జిక్యూటివ్ గ్రూపు) ఏర్పాటు జరిగింది. రాష్ట్ర విజ్ఞాన సలహా బోర్డు (స్టేట్ నాలెడ్జి అడ్వయిజరీ బోర్డు) ఏర్పాటూ జరిగింది. ఎంట్రీపాయింట్ ప్రాజెక్టుల కోసం ఉపకులపతులతో గ్రూపు కమిటీలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇతర దేశాల్లోని ఉత్తమ సంప్రదాయాల్ని అనుసరించడం, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల్ని కల్పించడం వంటి చర్యలపైనా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చలు జరుపుతున్నారు. ఏపీ నాలెడ్జి మిషన్‌కు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సుమితాడావ్ర సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఏపీ కళాశాల విద్యా శాఖ, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ఇతర అధికారులు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపకులపతులు ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారు.
దశలవారీగా ఏపీ ఉన్నత విద్యలో రానున్న కీలక మార్పుల్లో ప్రధానమైనవి..
* అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై, 4జి సేవలు, ఇతర సాంకేతిక సౌకర్యాల్ని కల్పించడం ద్వారా ఆకర్షణీయ ప్రాంగణాల ఏర్పాటు.
* ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో మూక్స్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులు చేసిన వారికి క్రెడిట్స్ ఇస్తారు.
* ఏడు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, 30 ఆకర్షణీయ ప్రాంగణాలు, 100 ఆకర్షణీయ తరగతిగదులు, 500 స్టార్ట్అప్‌లను అభివృద్ధిచేయాలన్నది సంకల్పం.
* కనీసం ఒక్కో పాఠ్యాంశంలోనైనా ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు జరపాలి. శాస్త్ర పరిశోథనలు, గ్యాప్ సంవత్సరం, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లు మొదలైన వాటికి క్రెడిట్స్‌ను కేటాంచాలని ప్రతిపాదించారు.
* ఇంజినీరింగ్ కోర్సులకు అప్రెంటీస్ షిప్ తప్పనిసరిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటుచేసి, ఆధార్ సంఖ్యతో అనుసంధానం.
* భావవ్యక్తీకరణ నైపుణ్యాలు తప్పనిసరి. ఛాయిస్ బేస్డ్ సిస్టమ్ అమలుకు అధిక ప్రాధాన్యం.
* విశ్వవిద్యాలయాల్లో అతిథి ప్రసంగాలు ఉండాలి. విజిటింగ్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలి.
* నైతిక విలువలు, నీతి సూత్రాలపై పాఠ్యాంశాల్ని ప్రవేశపెట్టాలి.
* విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో స్నాతకోత్సవాలను భారీఎత్తున నిర్వహించాలి
* విద్యాసంస్థల ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు సంస్థ (అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీ) ఏర్పాటు.
* ఉన్నత విద్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావుల్ని నాలెడ్జి మిషన్‌లో సభ్యులుగా నియమించాలి.
ఇవి కాకుండా 12 రకాల ఎంట్రీ పాయింట్ ప్రాజెక్టుల్ని (ఈపీపీ) ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు విశ్వవిద్యాలయాలకు అప్పగించారు.
అవి..
* కరిక్యులమ్ ఆధునికీకరణ - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
* పరిశమ్రలతో ఒప్పందాలు - బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
* ఆకర్షణీయ ప్రాంగణాలు - ఆంధ్రా విశ్వవిద్యాలయం (విశాఖ)
* మూక్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ - జేఎన్‌టీయూ కాకినాడ
* సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ - జేఎన్‌టీయూ అనంతపురం
* ఆన్‌లైన్ పరీక్షలు - ఆంధ్రా విశ్వవిద్యాలయం
* గ్యాప్ సంవత్సరం - అన్ని విశ్వవిద్యాలయాలు
* అప్రెంటీస్‌షిప్ - ఆర్జీయూకేటీ
* రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్రెడిట్స్ - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం
* ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ కోర్సులు - ఆంధ్రా విశ్వవిద్యాలయం
* ఇంక్యుబేషన్ సెంటర్స్ - ఎస్వీయూ, తిరుపతి
* భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్‌స్కిల్స్)- ఎస్వీయూ, తిరుపతి
Posted on 01 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning