అనుభవాల కొలువులు

* ఉద్యోగంలో చేరకముందే పరిపూర్ణ అవగాహన
* పెయిడ్‌ ఇంటర్న్‌షిప్స్‌కు నగరంలో పెరుగుతున్న ఆదరణ
* రూ.2 వేలనుంచి రూ.6వేల రుసుం

ఈనాడు, హైదరాబాద్‌: అసలే ఇది పోటీ ప్రపంచం.. ఉద్యోగాలు వందల్లో ఉంటే.. అభ్యర్థులు లక్షల్లో ఉంటున్నారు... ఇలాంటి తరుణంలో ఉద్యోగ వేటలో విజయం సాధించాలంటే అంత తేలికైన విషయం కాదు. అదనపు అర్హతలు ఉన్న వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటుండటంతో... భాగ్యనగర యువత ఈ దిశగా నయా పంథాలో పయనిస్తోంది. వివిధ సంస్థలకు డబ్బు చెల్లించి ఉద్యోగానుభవం కోసం 'పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌' చేస్తూ.. కలల కొలువును దక్కించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
గతంతో పోల్చుకుంటే ఏటా కళాశాలల నుంచి వచ్చే పట్టభద్రులు పెరిగారు. ఉద్యోగాల సంఖ్య అందుకు అనుగుణంగా పెరగడం లేదు. అందుకే నిరుద్యోగుల సంఖ్య ఏటికేడాది ఎగబాకుతోంది. కేవలం ఇంజినీరింగో.. ఎంబీఏ పట్టా ఉంటేనో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. అదనపు అర్హతలున్న అభ్యర్థులను చేర్చుకునేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అందునా ఉద్యోగానుభవం ఉంటే మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభించే ముందే ఉద్యోగానుభవం కోసం ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకొంటున్నారు.
* నిర్లక్ష్యం ఉండదు..!
పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌నకు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ శుభపరిణామమే అంటున్నారు కొంతమంది నిపుణులు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.. కాబట్టి.. వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయడం అనైతికమేమీ కాదంటున్నారు. మరికొందరు ఇదంతా సంస్థల జిమ్మిక్కు అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నందు వల్ల అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించరు. పూర్తి స్థాయిలో పనిపై దృష్టి సారిస్తారు. అనుభవం ఉన్న నిపుణుల మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది.. రాటుదేలేందుకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొంది.. ముఖాముఖిలో సులువుగా గట్టెక్కవచ్చు. బృందంలో ఎలా పనిచేయాలో ముందుగానే తెలుసుకునే వీలు లభిస్తుంది. చదివిన సబ్జెక్ట్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయి.
* ఎంపిక విషయంలో జాగ్రత్త..!
పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌కు అవకాశమున్న సంస్థల గురించి తెలుసుకునేందుకు యువత ఎక్కువగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు. 'ఇందుకోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గతంతో పోలిస్తే బాగా పెరిగిందన్నది వాస్తవం. మాకు రోజూ చాలా కాల్స్‌ వస్తున్నాయి. ఎంత మొత్తమైనా చెల్లించటానికి వెనుకడుగు వేయడం లేదు' అంటున్నారు నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రాజేష్‌ శర్మ. సంస్థను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చేరే ముందు వివరాలను పూర్తిగా పరిశీలించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
* డబ్బు చెల్లించి పని నేర్చుకోవటమే...
అనుభవం గడించడం కోసం విద్యార్థులు, ఔత్సాహికులు కొంతకాలం రోజులో కొన్ని గంటలు ఓ సంస్థలో పనిచేయడమే 'ఇంటర్న్‌షిప్‌'. ఇది అందరికే తెలిసిందే. ఇప్పుడు అభ్యర్థులే ఆయా సంస్థలకు డబ్బు చెల్లించి చేరుతున్నందున 'పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌'గా వ్యవహరిస్తున్నారు. మెడిసిన్‌, ఆర్కిటెక్చర్‌, లా, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, ఫైనాన్స్‌, టెక్నాలజీ, అడ్వర్టెజింగ్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ తదితర రంగాల్లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థలు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి. నగరంలో వీటి సంఖ్య యాభైకి పైగానే ఉంటుందన్నది నిపుణుల అంచనా. ప్రభుత్వ రంగ సంస్థలు రెండు వారాల నుంచి 45 రోజులు.. ప్రయివేట్‌ కంపెనీలు నెల నుంచి ఆరు నెలల వరకు శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకు కాల వ్యవధిని బట్టి రూ.2వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్‌ను అందిస్తున్నారు. సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు సాధించేలా సంస్థలు అభ్యర్థులు తీర్చిదిద్దుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పరిశ్రమల అవసరాలకు సరిపోయేలా అభ్యర్థులను తయారు చేస్తున్నాయన్న మాట. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ఎలా వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది.. బృంద సభ్యుడిగా పాత్ర ఏమిటి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తుండడంతో ఎక్కువ మంది యువత ఇటువైపు దృష్టి సారిస్తున్నారు.
* మొదటిప్రయత్నంలోనే.. - ఆర్‌.సతీష్‌ రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
నగర శివారులోని సీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌(సీఎస్‌ఈ) చదివా. అనంతరం.. హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రూ.మూడు వేలు వెచ్చించి రెండు నెలల పాటు 'ఇంటర్న్‌షిప్‌' చేశా. అక్కడ ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. సబ్జెక్ట్‌పై పట్టు సాధించా. దరఖాస్తు చేసిన మొదటి ఉద్యోగానికే ఎంపికయ్యా. ప్రస్తు తం చెన్నైలోని కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌(సీటీఎస్‌)లో పనిచేస్తున్నా.
Posted on 09 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning