భవిష్యత్తులో భారీగా ఉద్యోగావకాశాలు!

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమలు
ఈనాడు - హైదరాబాద్‌: సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటోంది. సమీప భవిష్యత్తులో ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే రీతిలో ఈ రంగం విస్తరించనుంది. సెల్‌ఫోన్ల తయారీ కార్యకలాపాల ఆధారంగా ఈ రెండు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ విస్తరించేందుకు అవకాశం ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రైవేటు రంగంలో ప్రస్తుతం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఔషధ పరిశ్రమలే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
* నిర్మాణ రంగం, ఇంజనీరింగ్‌, కొన్ని ప్రాసెస్‌ పరిశ్రమలు ఉన్నప్పటికీ ఆయా రంగాల్లో నిపుణులకు లభించే ఉద్యోగాల సంఖ్య తక్కువ. ఉన్నత విద్య అభ్యసించిన వారికి ఉద్యోగాల కల్పన పరంగా చూస్తే ఐటీ రంగానిదే అగ్రస్థానం. దేశంలో అయిదో అతిపెద్ద ఐటీ నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో దాదాపు 2.5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి.
* ఔషధ రంగం లక్ష మంది వరకు (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పిస్తోంది. విశాఖపట్నంలో వేల సంఖ్యలోనే ఐటీ ఉద్యోగాలు ఉన్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఔషధ పరిశ్రమ విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించి యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. మళ్లీ ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ దోహద పడుతుందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ విప్లవాన్ని సెల్‌ఫోన్‌ తయారీ కార్యకలాపాలు ముందుకు తీసుకువెళ్తాయని భావిస్తున్నారు.
దేశీయ సెల్‌ఫోన్‌ సంస్థలైన సెల్‌కాన్‌, కార్బన్‌, మైక్రోమ్యాక్స్‌కు తోడు ఈ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న తైవాన్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ తమ తయారీ కార్యకలాపాల కోసం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వైపు చూస్తూ ఉండటం ఈ ఆశాభావానికి పునాది. ఇప్పుడిప్పుడే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల వైపు చూస్తున్న సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు అనుకున్నట్లుగా విస్తరించిన పక్షంలో భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టమవుతోంది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసిన వారికి అధికంగా ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఫాక్స్‌కాన్‌ ఒక్కటే వచ్చే మూడు, నాలుగేళ్లలో 5,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. హైదరాబాద్‌ వద్ద మేడ్చల్‌లో యూనిట్‌ ప్రారంభించిన సెల్‌కాన్‌ తొలిదశలో 500 ఉద్యోగాలు కల్పించనుంది. భవిష్యత్తులో చేపట్టే విస్తరణతో ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని సెల్‌కాన్‌ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ వేళ్లూనుకున్న పక్షంలో విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఏర్పాటవుతాయని, తద్వారా ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.
ఏపీలో ఫాక్స్‌కాన్‌
యాపిల్‌, నోకియా, సోనీ తదితర అంతర్జాతీయ బ్రాండ్లకు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తయారు చేసే తైవాన్‌ సంస్థ అయిన ఫాక్స్‌కాన్‌ ఇటీవల మనదేశంలో తయారీ కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెండు మూడు చోట్ల తయారీ, పరిశోధనా కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో తయారీ కేంద్రం నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న భవనంలో స్వల్పస్థాయిలో తయారీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. చెన్నైలో నోకియా ప్లాంటును నిర్వహించిన అనుభవం ఉన్నందున, నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న శ్రీసిటీని తన తయారీ కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఫాక్స్‌కాన్‌ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు రోజుల వ్యవధిలోనే ప్రారంభించేందుకు వీలైన తరహాలో సదుపాయాలు అందించినట్లుగా (ప్లగ్‌-ఇన్‌-ప్లే), ఫాక్స్‌కాన్‌కు సదుపాయాలు కల్పించేందుకు శ్రీసిటీ ఎస్‌ఈజడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిసింది. దీనికి 25 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు, 2.5 లక్షల చదరపు అడుగుల భవనాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికిప్పుడు తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఫాక్స్‌కాన్‌కు వీలుకలుగుతోంది. ఇప్పటికే తాత్కాలిక భవనంలో ప్రారంభమైన ఈ సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో బహుముఖంగా విస్తరిస్తాయని అంటున్నారు. తాము అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమైన మాట నిజమేనని శ్రీసిటీ ఎస్‌ఈజడ్‌ ప్రతినిధి ఒకరు 'ఈనాడు'కు తెలిపారు. ఫాక్స్‌కాన్‌ ఆధారంగా భవిష్యత్తులో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో నిమగ్నమైన ఇతర కంపెనీలు ఇక్కడకు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు వివరించారు. మరోపక్క అనంతపురం- హిందూపురం మధ్య గల ప్రదేశంలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బెంగుళూరుకు దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత తదితర సానుకూలతలు అక్కడ ఉన్నాయి. జపాన్‌, కొరియా, సింగపూర్‌ కంపెనీలను ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరినట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో సెల్‌కాన్‌, కార్బన్‌
అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడి దేశీయ విపణిలో విస్తరించిన సెల్‌ఫోన్‌ బ్రాండ్లు కార్బన్‌, సెల్‌కాన్‌. ఇప్పటివరకు సెల్‌ఫోన్లు, విడిభాగాలు చైనా నుంచి దిగుమతి చేసుకొని, సొంత బ్రాండ్‌పై దేశీయంగా ఇవి విక్రయిస్తున్నాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుకున్న ఈ సంస్థలు, ఇప్పుడు దేశీయంగా తయారీ కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి సారించాయి. హైదరాబాద్‌ సమీపంలో సెల్‌ఫోన్‌ తయారీ కార్యకలాపాలు చేపట్టబోతున్నాయి. సెల్‌కాన్‌ ఇప్పటికే మేడ్చల్‌ వద్ద సెల్‌ఫోన్ల అసెంబ్లింగ్‌ (విడిభాగాలు దిగుమతి చేసుకుని, ఫోన్‌ బిగింపు) యూనిట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దక్షిణాదిలో ప్రారంభమైన దేశీయబ్రాండ్‌ మొదటి సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం నెలకు 2 లక్షల ఫోన్లు తయారు చేస్తుండగా, 3 నెలల్లో 5 లక్షలకు పెంచుతామని సంస్థ తెలిపింది. కార్బన్‌ మొబైల్స్‌ కూడా తమ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కార్బన్‌ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌ సంస్థ కూడా హైదరాబాద్‌ వచ్చి తెలంగాణా ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులు సాగించి, హైదరాబాద్‌ వద్ద సెల్‌ఫోన్ల తయారీ చేపట్టేందుకు సానుకూలంగా స్పందించింది. సెల్‌ఫోన్‌ కంపెనీలను హైదరాబాద్‌ తీసుకు వచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గట్టి ప్రయత్నాలు చేశారు. శ్యామ్‌సంగ్‌ కంపెనీ సైతం ఇక్కడ యూనిట్‌ నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నారు. అధికారులతో కలిసి ఆయనే వెళ్లి శ్యామ్‌సంగ్‌ కంపెనీ ప్రతినిధులను కలిసి, హైదరాబాద్‌లో తయారీ కార్యకలాపాలు చేపట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించి వచ్చారు.
Posted on 18 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning