నేర్చుకుందామా నైపుణ్యాలు?

యువతలో ఉద్యోగార్హత నైపుణ్యాలు తగినంతగా ఉండకపోవటం దేశవ్యాప్తంగా పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలను గమనించటం, వాటిని సద్వినియోగం చేసుకోవటం ఉద్యోగార్థుల కర్తవ్యం!
వివిధ రంగాల్లోని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవటం వల్ల 70- 90% మంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మిగిలిపోతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం... ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో 17 శాతం మందికి మాత్రమే కొలువులు లభిస్తున్నాయి. అంతే కాదు; ఎంబీఏ పట్టభద్రులు 10%, సాధారణ డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్లు 5-6 శాతం, పోస్టుగ్రాడ్యుయేట్లు 7% మాత్రమే ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా (లెవెల్‌-1 నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ - NSQF) ఉద్యోగంలో సర్దుకుపోతున్నారు. లెవెల్‌ 7- 10 NSQFకు 2% మాత్రమే వెళ్లగలుగుతున్నారు.
అందుకే... యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడం అనేది ఎంతో ప్రాధాన్యమున్న విషయం. దీనికోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖ 2009లో జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ)ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పరచింది. నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్‌, ఆయా సంస్థల్లో ఉద్యోగం కల్పించటం దీని ప్రధాన విధులు.
వివిధ రంగాల్లో అభ్యర్థులకు శిక్షణ కోసం... ఎన్‌సీడీసీ 21 సెక్టార్‌ కౌన్సిళ్ళను గుర్తించింది. వాటిలో సెక్యూరిటీ, రిటైలర్స్‌, ఐటీ/ ఐటీసీఎస్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, రబ్బర్‌, హెల్త్‌కేర్‌, జెమ్స్‌, జ్యువెల్లరీ, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చర్‌, టెలికాం, ప్లంబింగ్‌, లెదర్‌, ఫుడ్‌, లాజిస్టిక్స్‌, కన్‌స్ట్రక్షన్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఐరన్‌ అండ్‌ స్టీల్‌, మైనింగ్‌, పవర్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, అపెరల్‌, గృహోపకరణాలు, హాండీక్రాఫ్ట్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, టెక్స్‌టైల్‌ మొదలైన రంగాలున్నాయి.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా ఏపీ స్కిల్‌ మిషన్‌ ఏర్పాటయింది. దీనికి అనుబంధంగా రాష్ట్రాల్లోని పరిశ్రమలతో ఎంఓయూ ఏర్పరచుకుని కళాశాలల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తుంది. కళాశాలలు నేరుగా ఎన్‌ఎస్‌డీసీలోని వివిధ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్ళను సంప్రదిస్తే ఆసక్తి ఉన్న విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తారు. ఆ కాలంలో స్త్టెపెండ్‌, సర్టిఫికెట్‌ ఇస్తారు. విద్యార్థికి నచ్చితే ఆ పరిశ్రమలోనే ఉద్యోగం కల్పిస్తారు.
STAR: స్టాండర్డ్‌ ట్రెయినింగ్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రివార్డ్‌ స్కీమ్‌
ఎన్‌ఎస్‌డీసీ- స్టార్‌ పథకం త్వరలో రాబోతోంది. దీనిలో ఎన్‌సీడీసీ వారు ఇచ్చిన చరవాణి సంఖ్య 088000 55555కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా రిజిస్టర్‌ కావొచ్చు.
మిస్‌డ్‌కాల్‌ తర్వాత ఎస్‌ఎస్‌డీసీ నుంచి కాల్‌ వస్తుంది. కొన్ని ప్రశ్నలడిగి అభ్యర్థికి నచ్చిన నైపుణ్యరంగంలో నమోదు చేసుకుంటారు.
లాభాలేమిటి?
ఒకసారి ఎన్‌రోల్‌ (నమోదు) అయిన తర్వాత ఆ పరిశ్రమ/ రంగంలో అభ్యర్థికి శిక్షణనిస్తారు. ఆ కోర్సును అభ్యర్థి విజయవంతంగా పూర్తిచేస్తే ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్‌ వస్తుంది. మీ అర్హత, పొందిన కాలాన్ని బట్టి ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌-1 నుంచి ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌-4 వరకు సర్టిఫికెట్‌ పొందే అవకాశముంది.
కేంద్రప్రభుత్వం దీనిని మరింత పటిష్ఠపరుస్తూ జులై 15న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రధానమంత్రి కౌశల్‌ వికాస యోజన (పీఎంకేవీవై) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1500 కోట్లు కేటాయించింది. దీనిలో 24 లక్షల మంది యువతకు శిక్షణ కల్పిస్తుంది.
ఈ పథకాల్లో ప్రస్తుతం చదువుతున్నవారూ, విద్య పూర్తిచేసుకున్నవారూ కూడా నమోదు కావచ్చు.
ఎన్‌ఎస్‌డీసీ- స్టార్‌
ఒక్కో విద్యార్థికి రూ.10,000 వరకు ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్‌ పొందితే ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌ 1, 2 అయితే రూ.10,000, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌ 3, 4 అయితే రూ.15,000 వరకు నేరుగా పొందగలరు. నేరుగా కేంద్రప్రభుత్వమే వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది.
ఈ సర్టిఫికెట్‌ ఉన్నవారికి భారతదేశంలోనే కాక విదేశాల్లోనూ అనేక ఉద్యోగావకాశాలున్నాయి. ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫైడ్‌ విద్యార్థులు వేలమంది విదేశాల్లో ఉద్యోగులుగా ఇప్పటికే ఉన్నారు.
ఎన్‌ఎస్‌డీసీ ప్రధాన విధులు
* నైపుణ్య స్థాయుల్ని అంతర్జాతీయ స్థాయికి సరిపోయే విధంగా అభివృద్ధి చేయడానికి పరిశ్రమల్ని భాగస్వాములను చేయడం.
* ఆర్థిక సాయం, శిక్షణలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం కల్పించడం.
* అసంఘటిత, సంప్రదాయ కార్మికశక్తికి ప్రాధాన్యం, మార్కెట్‌ విలువ కల్పించడం.
నేరుగా ఇలా నమోదవొచ్చు!
దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలకూ, కళాశాలలకూ ఎన్‌ఎస్‌డీసీతో ఎంఓయూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏ విశ్వవిద్యాలయం కానీ, కళాశాల కానీ ఎన్‌ఎస్‌డీసీతో ఎంఓయూ కలిగిలేవు. అయితే.. విద్యార్థులే నేరుగా నమోదు చేసుకోవచ్చు.
www.nsdcindia.org వెబ్‌సైట్‌లో About Us- Organisation Profile-లోకి వెళ్ళాలి.
Our affiliates కింద కనపడే Find a training centre ను క్లిక్‌ చేయాలి.
ఈ కింది విధంగా డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది.
* By Sector * By location * Both
వీటిలో ఒకదాన్ని క్లిక్‌ చేయాలి.
స్టేట్‌ -
ఏపీ/ తెలంగాణ క్లిక్‌ చేయాలి.
డిస్ట్రిక్ట్‌ -
ఏ జిల్లావారైతే దాని మీద క్లిక్‌ చేయాలి.
సెక్టార్‌ -
దీనిలో * అగ్రికల్చర్‌ * ఇండస్ట్రీ * ఆటోమొబైల్స్‌ * ఫార్మాస్యూటికల్స్‌ వగైరా వస్తాయి. ఆసక్తి ఉన్నదానిపై క్లిక్‌ చేయాలి.
కోర్సు -
వాటికి సంబంధించిన కోర్సులు వస్తాయి. ఆసక్తి ఉన్న కోర్సుపై క్లిక్‌ చేయాలి.
ఈ విధంగా మీకు నచ్చిన కోర్సులో రిజిస్టర్‌ కావచ్చు. ఎన్‌సీడీసీ కింద దేశవ్యాప్తంగా 3026 శిక్షణ కేంద్రాలున్నాయి.
Posted on 20 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning