పరిశ్రమలు, విద్యాసంస్థల అనుసంధానం

* సీఎస్‌ ఛైర్మన్‌గా ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌
* సభ్యులుగా పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులు, నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం జులై 30న ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ దీనికి ఛైర్మన్‌. ఉన్నతాధికారులు, పారిశ్రామికసంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇందులో సభ్యులుగా ఉంటారు. భారీ ఉపాధి లక్ష్యంతో తెలంగాణ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పరిశ్రమలకు మానవవనరులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో వృత్తివిద్యాసంస్థలున్నా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడంలేదని, పట్టభద్రులైన వారి ఉద్యోగితస్థాయి గొప్పగా లేదని ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ప్రకటించింది. సీఐఐ, ఫిక్కి, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య(ఎఫ్‌టాప్సి), వి.రాజన్న(టీసీఎస్‌), ఎ.వేంకటేశ్వర్‌(మేనేజ్‌మెంట్‌ సలహాదారు), వెంకట్రామన్‌ (మహీంద్రా అండ్‌ మహీంద్రా). గంగాధర్‌ కోదండరామ్‌ (మైక్రో సాఫ్ట్‌), రమేష్‌ లోకనాథన్‌(హైసియా), జయప్రకాష్‌రావు (ఉన్నతవిద్యామండలి మాజీ చైర్మన్‌), రామేశ్వర్‌రావు (జేఎన్‌టీయూ మాజీ ఉపకులపతి), డీఎన్‌రెడ్డి (జేఎన్‌టీయూ మాజీ కులపతి), బీఎల్‌ దీక్షితులు (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ఛైర్మన్‌), పి..నర్సింహారెడ్డి (స్నిస్ట్‌), సాంకేతిక విద్యాకమిషనర్‌లను సభ్యులుగా నియమించింది. పరిశ్రమల కమిషనర్‌ ఈ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా ఉంటారు. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యాలు
* విద్యాసంస్థల పనితీరును పరిశీలిస్తుంది, అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకి తెచ్చి నైపుణ్య శిక్షణ అందిస్తుంది.
* అన్ని వృత్తి విద్యాకళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలను పారిశ్రామిక సమూహాలకు, పరిశ్రమలకు అనుసంధానిస్తుంది.
* వృత్తి విద్యాకోర్సుల్లో కొత్త పాఠ్యప్రణాళిక. వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు, అభ్యాసాలకు చోటుకల్పించే అంశాల పరిశీలన.
* అభ్యాస పాఠశాల, అంతర్గత శిక్షణ (ఇంటర్న్‌షిప్‌) కార్యక్రమాల అమలు.
* పారిశ్రామిక అవసరాలపై విద్యాసంస్థల్లో అవగాహనకు నిపుణులతో పాఠాలు.
* ఐటీ, తయారీసంస్థల ప్రతినిధులతో విద్యార్థుల ముఖాముఖి.
Posted on 31 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning