నడవడికే నగిషీ...

* నాలుగేళ్ల ఇంజినీరింగ్‌లో అదే ముఖ్యం
* వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి బీజమిదే
* భద్రం అంటున్న నిపుణులు, సీనియర్లు, అధ్యాపకులు

ఈనాడు - హైదరాబాద్‌: వారం వారం పరీక్షలు.. టన్నుల కొద్దీ ప్రశ్నలు.. ఒప్పుల కుప్పల ఓఎంఆర్‌ షీట్లు.. మెటీరియల్స్‌.. స్టడీ అవర్స్‌.. క్షణం వీడకుండా చదువుతూనే ఉండండనే పోరు.. అనుక్షణం మదిలో మెదిలే జేఈఈ ప్రశ్నల హోరు..
ఇన్నాళ్లూ తల్లిదండ్రుల చాటు బిడ్డల్లా, పుస్తక పురుగుల్లా, చదువుల పంజరంలో పక్షుల్లా గడిపినవారు కాస్తా... నాలుగేళ్ళ ఇంజినీరింగ్‌లోకి అడుగుపెట్టగానే సీతాకొక చిలకల్లా, స్వేచ్ఛాగీతంలా మారిపోతారు. కొంగొత్త స్నేహితులు, కాలేజీ బస్సుల్లో ప్రయాణాలు... దారిపొడవునా చెవుల్లో పువ్వులు (ఇయర్‌ఫోన్స్‌) ఎటుచూసినా కళకళ! ఈ కొత్త బంగారు లోకాన్ని నిజంగా బంగారం చేసుకునేవాళ్ళు కొందరైతే, కంగారు పడి కంగాళి చేసుకునేవాళ్ళు మరికొందరు! జీవితంలో అత్యంత కీలకమైన ఈ నాలుగేళ్ళనెలా గడపాలో, ఇంజినీరింగునెలా చదవాలో, కెరీర్‌నెలా తీర్చిదిద్దుకోవాలో కాలేజీల్లో సందడి చేస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నిపుణులు, సీనియర్లు చెబుతున్న సలహాలు, సూచనలు..
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు అత్యంత కీలకమైన ఈ నాలుగేళ్ళనెలా గడపాలి... ఎలా చదవాలి... కెరీర్‌నెలా తీర్చిదిద్దుకోవాలి... అనే అంశాలపై నిపుణులు, సీనియర్లు చెబుతున్న సలహాలు, సూచనలివి.
చదువు పరంగా
1. తొలి ఏడాదే కదాని...
ఇంజినీరింగ్‌ తొలి సంవత్సరంలో విద్యార్థులు కాస్త అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఇంటర్‌లో రుద్దుడు నుంచి బయటపడ్డామనే స్వేచ్ఛ కొంత, ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అన్న ధీమా మరికొంత ఈ అలసత్వానికి కారణమవుతాయి. ఇంటర్‌ విద్యకు, ఇంజినీరింగ్‌ చదువుకు తేడా ఉంటుంది. అక్కడంతా జేఈఈ, ఎంసెట్‌పై దృష్టి కేంద్రీకరించి ఆబ్జెక్టివ్‌ తరహా జవాబులకు అలవాటు పడతారు. ఇంజినీరింగ్‌ అంటే రాతేరాత! ప్రాజెక్టు పేపర్లు రాయాల్సి ఉంటుంది. విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి తొలి సంవత్సరాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎంచుకున్న అంశాల్లో ప్రాథమిక విషయాలపై పట్టు సాధించాలి. తొలి సంవత్సరం కోర్‌ సబ్జెక్ట్స్‌ లేవుగదాని తేలిగ్గా తీసుకొని ఇబ్బందులు పడతారు కొందరు. బేసిక్స్‌ బాగుంటే తర్వాత నాలుగేళ్ళలో నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టడం సులభమవుతుంది. - డాక్టర్‌ చెన్నకేశవరావు, సీబీఐటీ ప్రధానాచార్యులు
2. బ్యాక్‌'లాగి'తే అంతే
బడులకెళ్ళే పిల్లలు పుస్తకాల బరువు మోస్తే... ఇంజినీరింగ్‌లో సగం మంది విద్యార్థులు మోసే భారం బ్యాక్‌ల్యాగ్‌లు! మొదటి ఏడాది సబ్జెక్ట్‌లు ఇంటర్‌లో చదివినవాటిలా సులభంగా కనిపించి మోసం చేస్తాయి. ఈ మాత్రం చదవలేమా అనే దీమాతో దెబ్బతింటారు. దాదాపు సగం మంది తొలి సంవత్సరంలోనే బ్యాక్‌లాగ్‌లను వెంటేసుకొని రెండో సంవత్సరంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత వాటిని వదిలించుకోవటానికి అష్టకష్టాలు పడుతుంటారు. రెండో సంవత్సరానికి రాగానే మరింత పని పెరుగుతుంది. అసలైన సబ్జెక్ట్‌లను చదవాల్సి ఉంటుంది. సీజీపీఏ గ్రేడింగ్‌ తగ్గినా ఫర్వాలేదుగాని, బ్యాక్‌లాగ్‌లను మాత్రం ఉంచుకోవద్దు. ఉంటే.. పైచదువుల ప్రవేశాల్లో, విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది.
3. బాహుబలి కండి
బాహుబలి సినిమాలో... ముందే యుద్ధవ్యూహం సిద్ధమైనా, మైదానంలోకి దిగాక కథనాయకుడు తన సొంత ఆలోచనలను జోడించి, సృజనాత్మకంగా వాటిని మార్చినట్లే చేయాల్సి ఉంటుంది ఇంజినీరింగ్‌ చదువులో కూడా! ఇంటర్‌లో మాదిరిగా కాలేజీ ఇచ్చే మెటీరియల్స్‌ను ప్రాక్టీస్‌ చేయటం, బట్టీ కొట్టడం ఇక్కడుండదు. ప్రొఫెసర్లు అన్నీ చెప్పరు. అధ్యాపకుడికంటే విద్యార్థి పాత్రే కీలకం. విద్యార్థులు విషయపరిజ్ఞానం, విశ్లేషణశక్తిని పెంచుకోవాలి. తాము ఎంచుకున్న విభాగపు రంగంలో ఏం జరుగుతుందో, పరిణామాలు ఎలా ఉంటున్నాయో పరిశీలిస్తూ ఉండాలి. - ఆచార్య రమణారావు, జేఎన్‌టీయూహెచ్‌
4. అరచేతిలో గురువు
చేతిలో స్మార్ట్‌ఫోన్‌, చెవిలో ఇయర్‌ఫోన్‌ లేని విద్యార్థులుండరు. చదువుకూ వాటిని ఉపయోగించుకోవచ్చు. నిజానికదే సగం గురువు కూడా! కేంద్ర మావన వనరులశాఖ, జేఎన్‌టీయూలు తమ వెబ్‌సైట్లలో వేలాది ఇంజినీరింగ్‌ పాఠాలను ఆన్‌లైన్లో ఉంచాయి. ఫోన్లు, కంప్యూటర్‌, ట్యాబ్లెట్ల ద్వారా వీటిని చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు)ను వినియోగించుకొని హార్వర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పాఠాలనూ ఉచితంగా వినొచ్చు.
5. కవరేజ్‌ ఏరియాలో ఉండండి
ఇంజినీరింగ్‌ అనేది జట్టుగా చేసే కార్యక్రమం. చదువులోనూ అది ప్రతి ఫలిస్తుంది. అందుకే కాలేజీలో, బయటా మంచి బృందాన్ని (నెట్‌వర్క్‌) ఏర్పాటు చేసుకోవాలి. క్లాస్‌మెట్స్‌, సీనియర్లు, పూర్వవిద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర కాలేజీల్లోని బృందాలు... ఇలా సాధ్యమైనంతగా సంబంధాలుండాలి. పూర్వవిద్యార్థుల బృందాలు మార్గదర్శనంలో, ప్లేస్‌మెంట్ల విషయాల్లో బాగా ఉపయోగపడతాయి. సబ్జెక్ట్‌లపై జరిగే సెమినార్లు, సదస్సులకు హాజరవటం, వాటిలో పాల్గొనటం ఎంతో కీలకం.
వ్యక్తిగతంగా
1. దారి ఏదన్నది
ఇంజినీరింగ్‌ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో మొదటి సంవత్సరంలోనే స్పష్టత ఉండాలి. పైచదువులా? ప్లేస్‌మెంటా? మేనేజ్‌మెంట్‌ కోర్సులా? ఏదోకటి తేల్చుకొని అందుకు తగ్గట్లు నాలుగేళ్ళ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పైచదువులకు విదేశాలకు వెళ్లాలనుకునేవారు జీఆర్‌ఈ, జీమాట్‌, టోఫెల్‌ల గురించి ముందునుంచే అవగాహన పెంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ గేట్‌ స్కోర్‌ ప్రధానమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సంవత్సరం నుంచే గేట్‌ గురించి తెలుసుకోవాలి. గేట్‌, క్యాట్‌ (మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌లకు)లను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. నాలుగేళ్ళ ఈ కాలాన్ని నాలుగు రోడ్ల కూడలిలా మలచుకోవద్దు. నాలుగో ఏడు పూర్తయ్యేసరికి నడవాల్సిన తోవలో ఉండాలి.
2. ప్రతి ఒక్కరికీ నైపుణ్యం
పట్టణాలు, పల్లెటూర్లు.. నేపథ్యం ఏదైనా ప్రతి విద్యార్థిలోనూ నైపుణ్యాలపరంగా కొన్ని లోపాలుంటాయి. వాటిని సరిదిద్దుకోవటానికి ఈ నాలుగేళ్ళకాలం ఎంతో ఎక్కువ. ముఖ్యంగా ఆంగ్లంలో భాషణం, నాయకత్వ లక్షణాలు, పదిమందితో కలసి పనిచేయటం, జీవన నైపుణ్యాల మెరుగుదలకు కాలేజీల్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ అలాంటిది లేకుంటే బయటి సంస్థల్లో శిక్షణ తీసుకోవచ్చు. లేదంటే కాలేజీలోనే వీటిని ప్రవేశపెట్టమని అడగొచ్చు. ప్రతి కాలేజీలో ఇప్పుడు ఆంగ్ల ల్యాబ్‌ ఉంటోంది. వాటిని ఉపయోగించుకోవాలి. వివిధ కళాశాలల్లో జరిగే ఫెస్ట్‌లు, పోటీల్లో పాల్గొనాలి.
జారుడుబండలివీ..
1. తప్పుడు స్నేహాలు
అంతకు ముందెన్నడూ లేనంత స్వేచ్ఛ లభించే ఈ సమయంలో లాగేసే వూబులూ, కిందపడేసే జారుడు బండలూ ఉంటాయి. పెద్దపిల్లలయ్యారనే ఉద్దేశంతో తల్లిదండ్రులూ స్వేచ్ఛనిస్తారు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, వైఫై.. సినిమాలు, షికార్లు, పార్టీలు, పబ్‌లు (పట్టణాల్లో) సెలబ్రేషన్లు! ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎదుర్కొనే వూబుల్లో ఇవి ప్రధానమైనవి. ఇవన్నీ ఉండొద్దని కాదుగానీ, పరిధి ఏంటన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. చాలామంది చెడు స్నేహాలతో నష్టపోతున్నారు. అందరితో కలిసుంటూనే సొంత వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి. నలుగురు చేసినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. మన మనసుకు నచ్చని పని ఎంత సన్నిహితులు చేసినా మనం చేయకూడదు. ''హౌ టు సే నో'' అనేది తెలుసుకోవాలి. స్నేహితుల ఎంపికలో జాగ్రత్త!
2. యమ డేంజర్‌
ఇంజినీరింగ్‌కు వచ్చారని చాలామంది తల్లిదండ్రులు బైక్‌లు కొనిస్తారు. వాటిని జాగ్రత్తగా నడపాలి. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతింటున్నది ఎక్కువమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులే!
నామ్‌కేవాస్తే ప్రాజెక్టులొద్దు
తరగతి గదిలో చదువుకే పరిమితం కావొద్దు. సబ్జెక్ట్‌ ఒక్కటే చదివితే సరిపోదు. బయట ఉద్యోగాలకు, మనం చదువుకున్నదానికీ చాలాసార్లు సంబంధం ఉండదు. కాబట్టి ప్రాక్టికల్‌గా ఉండాలి. నామ్‌కేవాస్తే అన్నట్టు కాకుండా, మంచి ప్రాజెక్టులను నిజాయితీగా చేపట్టాలి. అవి జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. రెండో సంవత్సరం నుంచి సెలవుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదోక ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ప్రయత్నించాలి. నాలుగేళ్ళ తర్వాత అనుకున్నవాటిలో ప్లేస్‌మెంట్‌ రాకపోయినా.. చిన్న సంస్థలో చేరి, పెద్దవాటి కోసం ప్రయత్నించాలి. భవిష్యత్‌ అంతా స్టార్టప్స్‌ కంపెనీలదే. - జి.అమర్‌, పూర్వ విద్యార్థి
Posted on 09 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning