ఇంజినీరింగ్‌లో ఏవి ముఖ్యం?

ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నవారికి కౌన్సెలింగ్‌ ముగిసి తరగతుల ఘట్టం ప్రారంభం అవుతోంది. ఈ నాలుగేళ్ళ వృత్తివిద్యను సఫలం చేసుకోవటానికి దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలేమిటి?
ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కానీ వీరికి పరిశ్రమలు ఆశిస్తున్న స్థాయిలో నాణ్యమైన విద్య లభించడం లేదనేది అందరికీ తెలిసిందే. ఒక అధ్యయనం ప్రకారం కోర్సు పూర్తిచేసుకున్నవారిలో 20% మంది విద్యార్థులు మాత్రమే ప్లేస్‌మెంట్లు సాధించడానికి అర్హులవుతున్నారు. ఈ శాతాన్ని బాగా పెంచితేనే ఇంజినీరింగ్‌ విద్యకు సార్థకత లభిస్తుంది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌, శిక్షణ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి బాధ్యత ఇది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ముఖ్య సూచనలను ఆచరణలో పెట్టాల్సివుంటుంది.
ఇంజినీరింగ్‌లో సుమారు 80% మంది విద్యార్థులు ఉద్యోగార్హత నైపుణ్యాలను నేర్చుకోకుండానే కళాశాలలను విడిచిపెడుతున్నారు. ఇంజినీర్లకు సాంకేతిక నైపుణ్యాలు అత్యంత ప్రధానం. సాంకేతికత ప్రాథమిక వేదిక. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాలుగు సంవత్సరాల కాలాన్ని గడపడం వల్ల విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాల్లో 10కి 10 మార్కులు సాధించాలని సంస్థలు ఆశిస్తాయి. మెరుగైన సాంకేతిక నైపుణ్యాలతోపాటు వారికి జీవన, వ్యవహారాధారిత, ఆంగ్ల నైపుణ్యాలు ఉండాలని కూడా భావిస్తాయి.
తప్పనిసరిగా, ఉత్సాహంగా...
పరిశ్రమలు విద్యార్థుల నుంచి ఉద్యోగార్హతలనూ, సాఫ్ట్‌ స్కిల్స్‌లో ప్రావీణ్యాన్నీ ఆశిస్తాయి. తమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులుండాలని ఆశిస్తాయి. ఏదేమైనా ఈ నైపుణ్యాలు బీటెక్‌ స్థాయి సిలబస్‌లో భాగంగా ఉండవు. ఒకవేళ కరికులమ్‌లో ఇవి భాగమైనపుడు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ లభిస్తుంది.
ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ శిక్షణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా, ఉత్సాహంగా పాల్గొనాలి. విద్యార్థి తన ప్రతిభను మెరుగ్గా ప్రదర్శించడంలో భాష, శరీర కదలికలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి వాటి ప్రాథమికాంశాలపై శ్రద్ధ పెట్టాలి.
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాలుగు సంవత్సరాల కాలాన్ని గడిపే విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు నూరుశాతం ఉండాలని నియామక సంస్థలు ఆశిస్తాయి. వీటితోపాటు వారికి జీవన, వ్యవహారాధారిత, ఆంగ్ల నైపుణ్యాలు ఉండాలని కూడా భావిస్తాయి.
కనీసం 65 శాతం
పరిశ్రమ- విద్యాసంస్థల మధ్య సత్సంబంధాలుంటే నేర్చుకున్న అంశాలపై విద్యార్థుల అవగాహన స్థాయి సమగ్రమవుతుంది. ఇంజినీరింగ్‌ కోర్సులో మొదటి మూడు సంవత్సరాలు ఇంగ్లిష్‌ను తప్పనిసరి చేయాలనే వాదనలున్నాయి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే చాలామందికి భాష విషయంలో సరైన అవగాహన ఉండదు. దానికితోడు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎంతగావున్నా, భాష పట్ల భయాన్ని పెంపొందించుకుంటుంటారు.ఈ లోపం తొలగించుకోవటం చాలా అవసరం.
ఇంజినీరింగ్‌లో ప్రతి సంవత్సరం 65% కిపైగా మార్కులు చాలా ముఖ్యమని విద్యార్థులు గ్రహించాలి. తద్వారా వారు పెద్ద సంస్థల్లో ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలకు అర్హత సాధిస్తారు. అంతేకాకుండా పది, ఇంటర్మీడియట్‌ల్లో ప్రథమశ్రేణి మార్కులు మంచి సంస్థల్లో ఉద్యోగసాధనకు ఎంత ముఖ్యమో తమ జూనియర్లకు తెలియజెప్పాలి. కనీసం రెండు నెలలకోసారి విద్యార్థులు సాంకేతిక అవగాహన కార్యక్రమాలు, చర్చలు, బృందచర్చల్లో పాల్గొంటూ ఉండాలి.
Posted on 10 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning