మెరుగైన భవితకు ముఖద్వారం

అఖిలభారత స్థాయిలో జరిగే 'గేట్‌' ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశపరీక్ష సిలబస్‌లో ఈ సంవత్సరం కొన్ని మార్పులు జరిగాయి. వాటిని ఆకళింపు చేసుకోవాలి; తగిన విధంగా సంసిద్ధమవాలి. మేటి స్కోరుకు బాట వేసుకోవాలి!
ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష- గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌). ఐఐటీలతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌- బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు ఉపయోగపడుతుంది.
ఈ పరీక్ష స్కోరును మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల్లో కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వంటి పరిశోధన సంస్థలూ ఈ స్కోరును గుర్తిస్తున్నాయి. గ్రూప్‌-ఎ స్థాయి పోస్టులు అయిన సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎఫ్‌ఓ (టెలి), సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఆర్‌ఓ (క్రిప్టో), ఎస్‌ఆర్‌ఓ (ఎస్‌అండ్‌టీ) నియామకాలకు కూడా ఈ స్కోరును ఆధారంగా తీసుకుంటున్నారు. గేట్‌తో మనదేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకారవేతనం కూడా లభిస్తుంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల గేట్‌కు ప్రాముఖ్యం పెరిగింది.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరపున ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ పరీక్ష రాయాలనుకునే ప్రతి ఇంజినీరింగ్‌ సైన్స్‌ విద్యార్థీ ప్రణాళికాబద్ధంగా శ్రమించాల్సిందే. ఈసారి గేట్‌ను ఐఐఎస్‌సీ బెంగళూరు నిర్వహిస్తోంది. 23 బ్రాంచీల అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీల్లోని ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్లోని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (జీఓఏపీఎస్‌) ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి నమోదు చేసుకోవాలి. వెబ్‌సైట్‌ చిరునామా - http://appsgate.iisc.ernet.in
* అభ్యర్థులు ముందుగా సరైన ఈ-మెయిల్‌ అడ్రస్‌, మొబైల్‌ నంబరు, జీఓఏపీఎస్‌ పాస్‌వర్డ్‌ ఇచ్చి నమోదు చేసుకోవాలి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ ద్వారా ఒక అభ్యర్థి మాత్రమే నమోదు చేసుకోవడానికి వీలుంటుంది. గేట్‌ ఆఫీసు నుంచి తదుపరి సమాచారం అంతా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఈ-మెయిల్‌కు పంపుతారు.
* దరఖాస్తు చేసుకునేటపుడు ఎటువంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
* అభ్యర్థులు తమ ఫొటోగ్రాఫ్‌, సంతకం, సంబంధిత సర్టిఫికెట్లను (పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో) దరఖాస్తుతోపాటు తప్పకుండా పంపాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, సర్టిఫికెట్లను ఐఐటీ/ఐఐఎస్‌సీ జోనల్‌ గేట్‌ ఆఫీసులకు పంపాల్సిన అవసరం లేదు.
* గేట్‌-2016 దరఖాస్తు ఫారాలు సంబంధిత వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తాయి. బయట ఎక్కడా అమ్మరు.
* అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డును జోనల్‌ గేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పోస్ట్‌ ద్వారా అడ్మిట్‌కార్డును పంపరు.
* పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* గేట్‌- 2016 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు గేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (జీఓఏపీఎస్‌)లో లభిస్తాయి.
పరీక్ష రుసుము: స్త్రీలు/ ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీలకు రూ.750, పురుషులకు (జనరల్‌, ఓబీసీ) రూ.1500. పరీక్ష రుసుమును నెట్‌ బ్యాంకింగ్‌/ డెబిట్‌ కార్డు/ ఈ-చలానా ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునేముందు విద్యార్హతలను తప్పనిసరిగా చూసుకోవాలి. గత ఏడాది మాదిరిగానే ఈసారి నిర్వహించబోయే గేట్‌కు కూడా ఆఖరి సంవత్సరం ఇంజినీరింగ్‌ చదివే, ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులు అర్హులు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదివేవారు అనర్హులు.
వర్చువల్‌ కీ బోర్డు: ఆన్‌లైన్‌ పరీక్షవిధానంలో కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ గుర్తించాలి. న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీ బోర్డును ఉపయోగించి రాయాలి.
న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు దగ్గర్లోని స్థాయిలో ఇవ్వవచ్చు. ఉదాహరణకు: సరైన సమాధానం 18.44 అనుకుందాం. 18.43 నుంచి 18.45 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు.
న్యూమరికల్‌ ప్రశ్నల ప్రాధాన్యం:
గేట్‌-2016 ప్రశ్నపత్రాల ప్రకారం వివిధ బ్రాంచిల్లో న్యూమరికల్‌ ప్రశ్నల వెయిటేజీ:
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 45/100
కంప్యూటర్‌ సైన్స్‌: 35/100
మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 44/100
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 39/100
సివిల్‌ ఇంజినీరింగ్‌: 48/100
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌: 56/100
ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌: 39/100
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్షవ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌):
ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధిత (వెర్బల్‌ ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వవచ్చు.
విభాగం- 2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): 2
ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి.
* 1 నుంచి 25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
* 26 నుంచి 55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
* గత సంవత్సరం ప్రశ్నపత్రంలో కామన్‌ డేటా బేస్‌డ్‌ ప్రశ్నలు, లింక్డ్‌ ప్రశ్నలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఈవిధమైన ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు.
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33% రుణాత్మక మార్కులున్నాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్‌ మార్కులుంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
ప్రశ్నల సరళి
* పరీక్ష పత్రంలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యముండాలో ఐఐటీల కోర్‌ కమిటీ నిర్ణయిస్తుంది. గత పరీక్షపత్రాల సరళి ప్రకారం..
* ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచిల్లో..
35% ప్రశ్నలు: కామన్‌ సబ్జెక్టుల్లో ఉంటాయి.
ఉదా: డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రోప్రాసెసర్స్‌, నెట్‌వర్క్‌ థియరీ, కంట్రోట్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌, ట్రాన్స్‌ఫారమ్‌ థియరీ.
35% ప్రశ్నలు: సంబంధిత కోర్‌ సబ్జెక్టుల్లో..
ఎ) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పవర్‌ సిస్టమ్స్‌, మెషీన్స్‌, మెజర్‌మెంట్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌.
బి) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: ఎలక్ట్రో మాగ్నటిక్‌ థియరీ, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌
సి) ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: సెన్సార్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్‌, ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
గణితం:
* 10 నుంచి 15% ప్రశ్నలు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి.
* ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ఎలక్ట్రికల్‌ పేపర్‌లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
* ప్రతి పేపర్‌లో పదికి మించిన సబ్జెక్టులు, కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలనేది ఐఐటీలకు సవాలుగా మారింది. కాబట్టి ఐఐటీ ప్రొఫెసర్లు రెండు, మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలను సంధిస్తున్నారు. ప్రతి పేపర్‌లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు.
Posted on 17 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning