మీ ప్రత్యేకత చాటండి !

 • ''వచ్చే సంవత్సరంలో 16000 మంది దాకా ఇంజినీర్లను తీసుకుంటాం. విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. నా కన్నా మెరుగ్గా తయారవ్వాలని మీరంతా లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్వసన్నద్ధంగా ఉన్న వారిని అదృష్టం వరిస్తుంది.''
         - ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి వ్యాఖ్య
  దాదాపు అన్ని సంస్థలూ ఉద్యోగుల ఎంపికలో ఇన్ఫోసిస్‌ ధోరణిని అనుసరిస్తున్నాయి.

  దేశ వ్యాప్తంగా నిపుణులైన ఉద్యోగులకు గిరాకీ ఉన్నా సరిపడా నైపుణ్యం.. సృజనాత్మకత.. కొత్త తరహా ఆలోచనలు కలిగిన వారు లేరు. దీంతో లక్షలాదిగా ఉన్నత విద్యావంతులున్నా అందరికీ తగిన కొలువులు.. 'అందని ద్రాక్ష' అవుతున్నాయి. అందువల్ల మంచి ఉద్యోగం సాధించాలన్నా.. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగంలో రాణించాలన్నా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించగలగాలి. తగిన విద్యార్హత ఉండొచ్చు. మంచి మార్కులూ తెచ్చుకొని ఉండొచ్చు. కానీ.. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, సంస్థకు అవసరమైన ప్రతిభ లేకుంటే మాత్రం ఉద్యోగం సాధించడం కష్టమే. ఎందుకంటే ప్రతి విషయంలోనూ చాలా ఎక్కువ పోటీ ఉండటంతో.. సంస్థలు అత్యంత ప్రతిభావంతులను, సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఎక్కువ ప్రాధాన్యంఇస్తున్నాయి. మరోవైపు తగిన అర్హతలు.. అనుభవం లేకున్నా పోటీ దారుని ఓడించగలిగే.. గొప్ప ఫలితాలు సాధించే ఆలోచనలు ఉంటే చాలు. అవి రిక్రూటర్లను ఆకట్టుకొని ఉద్యోగాన్ని తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల మూస ధోరణిలో వెళ్లే వారికి కాకుండా కొత్తగా ఆలోచించే వారికి వెంటనే కొలువు లభిస్తుంది.
         కొంత మంది తమకు వచ్చి ఆలోచనలు ఆచరణయోగ్యం కాదేమోనని భావిస్తుంటారు. లేకుంటే మంచివి కావేమో అనుకుంటార. కాని నిర్మాణాత్మకంగా ఆలోచిస్తే దాదాపు ప్రతి ఆలోచనా మంచిదే అవుతుంది. అయితే వాటిని సకాలంలో ఎవరికి చెప్పాలో వారికి తెలియజేయాలి. మీ ఆలోచనలు అమలు చేసేటపుడు ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలపైనా సరైన అంచనా ఉండాలి. సృజనాత్మకత అనేది ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పటి నుంచే ప్రదర్శించాలి. రెజ్యూమెను సాదాసీదాగా కాకుండా సృజనాత్మకంగా రూపొందించాలి. ఇందుకోసం మీరు గతంలో చేసిన ప్రాజెక్ట్‌లు, సాధించిన అంశాలు, మీకు వచ్చిన ఆలోచనలతో ఒక బ్లాగ్‌ను రూపొందించి సంబంధిత లింక్‌ను రెజ్యూమెలో పొందుపరచాలి. దీని వల్ల ఒక క్లిక్‌తో రిక్రూటర్‌కు మీ నైపుణ్యం ఏంటో తెలియజేయొచ్చు. అన్ని అంశాలనూ రెజ్యూమెలో పొందుపరచలేం కనుక ఇలా కొత్తగా ప్రయత్నించొచ్చు.
  కొత్తదనం కావాలి!
         ఇక ఇంటర్‌వ్యూ, రాతపరీక్ష, శిక్షణ కాలంలోనూ ఇతరులను అనుసరించకుండా మీ ప్రత్యేకత చాటాలి. కొత్తగా వచ్చారు కనుక తప్పకుండా సంస్థ మీ నుంచి కొత్తదనం కోరుకుంటుంది. మీ ఆలోచనలు కొత్తగా ఉండాలని భావిస్తుంది. ఇలా కొత్తదనం లేనపుడు మిమ్మల్ని తీసుకోవడం వల్ల సంస్థకు కలిగే అదనపు ప్రయోజనం ఉండదు. అందువల్ల తుది ఎంపికలో మీకు ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.
  అవగాహన ముఖ్యం
         సృజనాత్మకంగా రాణించాలంటే ఆయా రంగాల్లో ప్రస్తుతం ఉన్న పోకడలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇందుకోసం ఆయా రంగాల్లో రాణిస్తున్న వారితో నెట్‌వర్కింగ్‌ అవసరమవుతుంది. ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌, గూగుల్‌ ప్లస్‌, బ్లాగ్‌లను స్నేహం కోసమే కాకుండా నెట్‌వర్కింగ్‌ సాధించేందుకూ వినియోగించుకోవాలి. పలు రకాలుగా ఆయా రంగాల ప్రస్తుత పరిస్థితిపై అవగాహన సాధిస్తేనే కొత్తగా ఆలోచించగలుగుతాం. లేకుంటే మీకు కొత్తగా అనిపించిన ఆలోచనలు అప్పటికే పాతవై ఉండొచ్చు.
         విద్యార్థులు కేవలం మార్కులు కోసమే కాకుండా తాము ఎంచుకున్న రంగంలో కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించాలి. దీనికి సంబంధించి పలు ప్రాజెక్ట్‌లు చేసి వాటిని కళాశాలలో.. ఆన్‌లైన్‌లో.. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ప్రదర్శించొచ్చు. మీ ప్రాజెక్ట్‌ గొప్పగా ఉంటే తప్పకుండా అది రిక్రూటర్లను ఆకర్షిస్తుంది. దీంతో చదువు పూర్తికాక ముందే ఆశించిన కొలువు ఖరారవుతుంది.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning