ఫీజు చెల్లిస్తే చాలదు తండ్రీ..!

* కళాశాలకి వెళ్లి తమ పిల్లల గురించి తెలుసుకోవాలి
* ఇంజినీరింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు నిపుణుల సూచన

''ఇంటర్‌ వరకు విద్య ఒక ఎత్త్తెతే... ఆ తర్వాత చదువు అందుకు పూర్తి భిన్నం. డిగ్రీకి వచ్చారంటే ఇక విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛే. మంచి కళాశాలలో సీటొచ్చింది... ఫీజు చెల్లించాం... ఇక అంతా ఉజ్వల భవిష్యత్తే... అనుకుంటే తల్లిదండ్రులు పొరపాటు పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో చేరిన నాలుగేళ్లూ అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు''.
ఈనాడు, హైదరాబాద్‌: 40వేలకు పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యార్థులు ఏటా ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరే వారూ వేల సంఖ్యలో ఉంటున్నారు. సగం మంది నగరంలో స్థిరపడిన వారుకాగా మిగతా వారు ఇతర జిల్లాల నుంచి కేవలం విద్య కోసం వచ్చిన వారే. తమ పిల్లలు ఇంజినీరింగ్‌ లాంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారన్న ఆనందం చివరి దాకా మిగలాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యావేత్తలు, కెరీర్‌ కౌన్సెలింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే తమ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంటర్‌ వరకు గురుకుల కళాశాలల్లో ఉండి అధిక శాతం చదువుకుంటారు. ప్రతి నిమిషం అధ్యాపకుల పర్యవేక్షణ మధ్య గడిచిపోతుంది. బయటకు ఎప్పుడో ఒకసారి తప్ప పంపరు. ఇంజినీరింగ్‌ లాంటి కోర్సుల్లో చేరిన తర్వాత ఇంటర్‌కు పూర్తి భిన్నమైన పరిస్థితి. కళాశాలలో ఎవరి పర్యవేక్షణా ఉండదు. చివరకు 75శాతం హాజరు లేకపోతే మాత్రం పరీక్ష రాయనివ్వరు. అప్పటి వరకు నీవు కళాశాలకు వస్తున్నావా? రావాట్లేదా? పాఠాలు వింటున్నావా?లేదా అని కొద్ది కళాశాలల్లో తప్ప అడగరు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి? చదువు విజయవంతంగా పూర్తి చేసి ప్రాంగణ నియామకాల్లోనూ ఉద్యోగాలను సొంతం చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
సాధారణ ఫోన్‌ చాలు
కళాశాలకు వెళ్లి చదువుకునే వాళ్లకు సమాచారం మార్పిడికి సాధారణ ఫోన్‌ చాలు. కొందరు తల్లిదండ్రులు ఇంజినీరింగ్‌లో చేరగానే విలువైన స్మార్ట్‌ ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వాస్తవానికి చదువుకునే వారికి అవి అవసరం లేదు. ఇప్పుడు ఫోన్లు అధికంగా యాప్స్‌ డౌన్‌లోడ్‌, పాటలు, వీడియోలకే వినియోగిస్తున్నారు. కారణం మాత్రం తమ ప్రాజెక్టు వర్క్‌ కోసమని చెబుతున్నారు. అంతకు అవసరమైతే కళాశాలలో లేదా ఇంటికి వచ్చినప్పుడు అంతర్జాలాన్ని వినియోగించుకోవచ్చని చెప్పాలి.
ఆర్నెల్లకోసారి ప్రిన్సిపల్‌తో మాట్లాడండి
ఇంజినీరింగ్‌ లాంటి కోర్సుల్లో చేరినా తర్వాత కూడా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కొంత శ్రద్ధ పెట్టాలి. పిల్లలు కళాశాలకు వెళ్లినా తరగతులకు వెళ్లాలనేం లేదు. వెళ్లినా ఆసక్తిగా చదువుకుంటున్నారా అని చెప్పలేం. అందుకే కనీసం ఆరు నెలలకు ఒకసారి వీలు చూసుకొని కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌, అధ్యాపకులతో మాట్లాడాలి. పిల్లల స్నేహితులను కలవాలి. అప్పుడు స్నేహితులు ఎవరు, ఎలాంటి వారో తెలుస్తుంది. పిల్లలు మనస్తాపం చెందకుండా వీలున్నప్పుడు లేదా అటుగా వచ్చినప్పుడు కళాశాలకు వస్తానని ముందుగానే చెప్పాలి.
అధికంగా డబ్బులు ఇవ్వొద్దు
పిల్లలకు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తున్నారు. దీనివల్ల కొందరు తాను ఓ గ్రూపు విద్యార్థులను వెంటేసుకొని వారికి పార్టీలు ఇస్తూ ఓ లీడర్‌గా భావించుకుంటున్నారు. అవసరమైన మేరకే డబ్బులు ఇవ్వాలి. అడిగినంత ఇవ్వకుంటే బాధపడతారనుకుంటే భవిష్యత్తులో కుటుంబంలో అందరూ బాధపడాల్సి ఉంటుంది. కొందరు విద్యార్థులు తక్కువైన హాజరును సరిచేసుకోవడానికి కూడా కళాశాలల్లో సిబ్బందికి డబ్బులు ఇస్తున్న సంఘటనలు ఉన్నాయి.
ఇళ్లలోనే పార్టీలు
చాలా మంది విద్యార్థులు పుట్టిన రోజని, ఇతర కారణాలు చెబుతూ బయట బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారు. దీనివల్ల పలుమార్లు మద్యం తాగి గొడవలు అయిన సందర్భాలూ ఎన్నో జరిగాయి. అందుకు భిన్నంగా మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకుంటే ఇంటికి పిలిచి ఇచ్చుకోవచ్చు. దానివల్ల తమ పిల్లల మిత్రులు కూడా ఎలాంటి వారో తెలుస్తుంది. మరీ బంధించేలా...స్వేచ్ఛను హరించేలా ఉంటుందనుకుంటే బయట పార్టీకి అయితే రాత్రి 9-10 గంటలలోపు పూర్తిచేసుకొని ఇంటికి వచ్చేలా ఉండాలి. ముఖ్యంగా బాలికల తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
పూర్తిగా వదిలేయవద్దు
- డాక్టర్‌ వంగీపురం రవికుమార్‌, మైండ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు
పిల్లలు పెద్ద వారయ్యారు...ఇంజినీరింగ్‌కు వచ్చారు. ఇక వారికి అంతా తెలుసు అని పూర్తిగా వదిలేయటం మంచిది కాదు. స్వేచ్ఛ లభించిన తర్వాత కొందరి మనస్తత్వం పూర్తిగా మారిపోవచ్చు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడుతూ...కళాశాలల్లో పరిస్థితులను, అధ్యాపకులు, మిత్రుల గురించి తెలుసుకోవాలి. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు. ర్యాగింగ్‌, స్మార్ట్‌ఫోన్లు, సీనియర్ల వేధింపులు తదితర ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నేను పలు కళాశాలలకు వెళ్లి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి ఎన్నింటినో గమనించారు. కొందరు విద్యార్థులు అంతర్గత మార్కులు తక్కువ వేస్తున్నారని అధ్యాపకులనే కొడుతున్నారు. ఇక బాలికలు తమ పట్ల స్మార్ట్‌ఫోన్లు శత్రువులుగా మారుతున్నాయని, వాటిని చాలా మంది దుర్వినియోగం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. కళాశాలల తరగతి గదుల్లో ఫోన్లు పనిచేయకుండా జామర్లు పెట్టాల్సిన అవసరం ఉంది.
Posted on 18 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning