'సీఎస్‌ఈ'నే రారాజు

* ఆ వెంటే ఐటీ
* ఈసీఈ, ఈఈఈలకు తగ్గిన ఆదరణ
* ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌లదీ అదే పరిస్థితి

ఈనాడు - హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఆదరణలో రారాజుగా వెలుగొందుతున్న కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ)కే ఈ ఏడాది కూడా తెలంగాణ విద్యార్థులు పట్టంగట్టారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఎంపికలో అన్ని బ్రాంచిల కంటే సీఎస్‌ఈకే అగ్రతాంబూలం దక్కింది. తర్వాతిస్థానాన్ని సీఎస్‌కు సోదర బ్రాంచిలాంటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సంపాదించుకుంది. తుదిదశ సీట్ల కేటాయింపు తర్వాత అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే.. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌లాంటి సంప్రదాయ కోర్సులు పూర్తిగా వెనకబడిపోయాయి. ఆ వివరాలు..
* రాష్ట్రంలో అన్ని బ్రాంచిల కంటే కూడా అత్యధికంగా సీట్లు (21143) అందుబాటులో ఉన్న ఈసీఈలో 65.77 శాతం సీట్లే నిండాయి. 7237 సీట్లు మిగిలిపోయాయి.
* మంచి కాలేజీల్లో సీఎస్‌ఈలో సీట్లు నిండగానే విద్యార్థులు తర్వాతి ప్రాధాన్యంగా ఐటీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఐటీలోనూ సీట్ల భర్తీ బాగానే (89.18%) జరిగింది. ఈసీఈ తర్వాత ఎక్కువ సీట్లున్న (20962) సీఎస్‌ఈలో 80.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అయినా... 4025 సీట్లు మిగలటం గమనార్హం.
* ఈఈఈలోనైతే 51.4 శాతం సీట్లు, సివిల్‌లో 64.52%; మెకానికల్‌లో 61.37 శాతం సీట్లు నిండాయి.
* సగటుస్థాయి కళాశాలల్లో సీఎస్‌ఈలో సీట్లు నిండగా... సగటుస్థాయికంటేమెరుగైన కాలేజీల్లో కూడా సంప్రదాయ కోర్సుల సీట్లు మాత్రం నిండకపోవటం గమనార్హం.
''ఇక్కడే ఉండి చదువు కాగానే ఉద్యోగం కావాలనుకునేవారితో పాటు విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ చేయాలనునేవారికి కూడా సీఎస్‌ఈలో అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ బ్రాంచికి ఇంత ఆదరణ కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీబూమ్‌ ఇంకా ఉండటం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, హైదరాబాద్‌ ఇప్పటికే ఐటీ హబ్‌గా మారటం; నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో ఐటీఐఆర్‌లాంటి ప్రాజెక్టు రాబోతోందన్న అంచనాలు కూడా ఈ కోర్సును ఎంచుకోవటానికి కారణంగా కనిపిస్తున్నాయి'' అని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యులు రమణారావు విశ్లేషించారు. ''అయితే కోర్సు తీసుకోగానే సరిపోదు. మంచి నైపుణ్యం సంపాదించాలి. ఎందుకంటే మిగిలిన బ్రాంచిల వారు కూడా సీఎస్‌, ఐటీలతో పోటీపడతారు'' అని ఆయన అన్నారు.


Posted on 19 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning