ఇంగ్లిషు రాని ఇంజినీర్లు!

* ఉద్యోగ సాధనలో వెనుకబాటు అందుకే
* ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో.. 51 శాతం మంది ఆంగ్లంపై పట్టులేని వారే
* ఆ భాష మాట్లాడలేని వారు 97 శాతం మంది దేశవ్యాప్త సర్వేలో వెల్లడి
* సాధన చేస్తే 'విన్‌'గ్లిష్‌ సాధ్యమే: నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌ మీకు తెలుసా... ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో 51 శాతం మందికి 'ఆంగ్లం'పై పట్టు లేకపోవడం వల్లే కొలువులు దక్కడం లేదు. వ్యాకరణం పరంగా 61 శాతం మంది స్థాయి.. ఏడో తరగతి విద్యార్థుల తర్వాతే. 97 శాతం మంది కనీసం ఇంగ్లిష్‌ మాట్లాడ లేకపోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయిన చేదు నిజాలు ఇవి. ఇప్పటికైనా మేల్కోకపోతే కెరీర్‌ పరంగా యువతకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నగరానికి చెందిన అభ్యర్థులు సాధారణంగా ఆంగ్లం విషయంలో చేసే తప్పులు.. వాటిని ఎలా పరిహరించుకోవాలనే అంశంపై ప్రత్యేక కథనం.
ఎందుకిలా...
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఏటా దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది పట్టాలతో కళాశాలల బయటకు వస్తున్నారు. ఈ సంఖ్య నగరంలో 30 నుంచి 40వేలు ఉంటుంది. మన దగ్గర ఇంజినీరింగ్‌ అర్హత పరీక్ష(ఎంసెట్‌)లో ఆంగ్లంపై ప్రశ్నలు ఉండవు. అలాగే మొదటి ఏడాదిలోనే ఆంగ్లం సబ్జెక్ట్‌ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆంగ్లం అంటే ఓ భాష అనే ముద్ర పడింది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.. భవిష్యత్తులో దీనితో పని ఉండదనే భావన విద్యార్థుల్లో నెలకొని ఉంది. యూరప్‌, ద్రావిడ భాషలకు స్పష్టమైన తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండానే ఆంగ్లాన్ని కూడా తెలుగు యాసలోనే మాట్లాడుతుంటారు. ఆంగ్ల సహాయక క్రియలు(ఈజ్‌, ఆర్‌, కెన్‌), ఆర్టికల్స్‌(ఏ, ఏఎన్‌), విభక్తి అర్థ పదాలు (ఆన్‌, బై)ను వాడకుండానే మాట్లాడటం ప్రధాన దోషమని నిపుణులు చెబుతున్నారు. పదాల అర్థం తెలియకపోవడం వల్ల వాడకూడని చోట వాడుతున్నారు లేదా మింగేస్తున్నారు.
ఇలా చేస్తే..!
* ముందుగా ఆంగ్లంలో మీ సామర్థ్యమెంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఓ ఆంగ్ల నిపుణుడి వద్ద కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఎంత సమయం కేటాయించదలుచుకున్నారో ముందే నిర్ణయించుకోవాలి.
* సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అందుకే ఆంగ్లం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు బృందంగా ఏర్పడి సాధన చేయాలి. అప్పుడే తొందరగా భాషపై పట్టు వస్తుంది. బృంద సభ్యులు తప్పులు పోయినా సరే ఇంగ్లిష్‌లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాలి.
* పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రోజూ ఓ మూడు కొత్త పదాలు నేర్చుకోవాలి. అర్థం తెలుసుకోవడంతో పాటు ఆ పదాలను ఏయే సందర్భాల్లో ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి.
* ఆంగ్లంలో పలుకు తీరు (ఉచ్చారణ) కీలకం. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ పదాన్ని ఎలా పలకాలో ముందు తెలుసుకోవాలి. నొక్కి చదవాల్సిన పదాలను.. నొక్కే చదవాలి.
* ఆక్స్‌ఫర్డ్‌, లాంగ్‌మన్‌ నిఘంటువులలో నిజజీవితంలో వినియోగించే ఆంగ్ల పదాలు వేలల్లో ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.
* వ్యాకరణంపై పట్టు సాధించాలి. అప్పుడే వాక్య నిర్మాణం తెలుస్తుంది. మాట్లాడేటప్పుడే ఏ పదాన్ని ఎక్కడ వాడాలి అనే అంశంపై అవగాహన ఏర్పడుతుంది.
* ఆంగ్ల పత్రికలను చదవాలి. ఆంగ్ల వార్తలను వినాలి. మిత్రులు, పత్రికలకు లేఖలు రాయాలి. చిన్న చిన్న కథలు రాసేందుకు ప్రయత్నించాలి.
* సాధన చేయకుండా ముఖాముఖీకి వెళ్లకపోవడమే ఉత్తమం. అద్దం ముందు సాధన చేయాలి. అప్పుడు మన బాడీ లాంగ్వేజ్‌, మన ఉచ్ఛరణను గమనించాలి. దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి.
ఏ ఇనిస్టిట్యూట్‌లో చేరాలి..
నగరంలో సుమారు 1500కు పైగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. ఏటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతుంది. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవగాహన లోపంతో కొంత మంది నకిలీ ఇనిస్టిట్యూట్‌ల చేతిలో మోసపోతున్నారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో చేరే ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందుగా రెండు, మూడు సంస్థలను సందర్శించాలి. అక్కడి శిక్షకుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. సిలబస్‌, బ్యాచ్‌లో ఉండే విద్యార్థుల సంఖ్య, రుసుముల వివరాలను అడిగి తెలుసుకోవాలి. అనంతరం.. మన లక్ష్యం, ఆంగ్లం గురించి రోజూ మనమెంత సమయం కేటాయించగలమో నిర్వాహకులకు వివరించాలి. వారిచ్చే సమాధానాలతో సంతృప్తి చెందితేనే చేరాలి. వీలయితే గతంలో ఆ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులను కలిసి మాట్లాడాలి.
సర్వే జరిగిన తీరు
* నిర్వహించిన సంస్థ : అస్పైరింగ్‌ మైండ్స్‌
* ఎన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో: దేశవ్యాప్తంగా 500
* పాల్గొన్న విద్యార్థుల సంఖ్య : 30వేలు
* సర్వే జరిగిందిలా : శ్రవణ, భాషణం పరీక్ష ద్వారా
* ఆంగ్లం సంభాషణకు ఇబ్బందిపడినవారు : 97 శాతం
* ఇంగ్లిష్‌లో అడగ్గానే స్పందించినది : 6.8 శాతం
* నైపుణ్యమున్నా ఉద్యోగం రాని వారు : 51 శాతం
* వ్యాకరణంలో ఏడో తరగతి విద్యార్థి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారు : 61 శాతం
* విషయ, ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వారు : 2.9 శాతం
* అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతున్నది : 7.1 శాతం
* ఆంగ్లంలో భేష్‌ : దిల్లీ, ముంబయి, పుణే, బెంగళూరు
* బాగా మెరుగుపడాలి : హైదరాబాద్‌, చెన్నై
నగరంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు : 180
ఇంజినీరింగ్‌ విద్యార్థులు : 1.5లక్షల నుంచి 2లక్షలు
ఏటా పట్టభద్రులు : 30వేల నుంచి 40వేలు
ఉద్యోగాలు పొందుతున్నది : 15 నుంచి 20 శాతం
ఒకే సినిమాను పదిసార్లు చూడాలి
మన దగ్గర విద్యార్థులు సబ్జెక్టులో నిపుణులు. కానీ.. ప్రపంచ భాష ఆంగ్లంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు అభ్యర్థులను నిందించడం తప్పే. విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది. తెలుగు, ఆంగ్లం మధ్య ఉన్న సారూప్యతను ఆస్వాదించాలి. ఒకే ఆంగ్ల సినిమాను పదిసార్లు చూడాలి. సాధన ఉంటే భాషపై పట్టు సాధించడం కష్టమేమీ కాదు. పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏ పదాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వినియోగించాలి. సొంతంగా ఓ నిఘంటువును తయారు చేసుకోవాలి. వ్యాకరణంపై దృష్టి పెట్టాలి. తప్పులు పోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా ఆంగ్లంలోనే మాట్లాడాలి.
- డా.వి.శ్రీనాథాచారి, సహాయ ఆచార్యులు, ఆంగ్లం
రెండింటిలో నైపుణ్యం ఉంటేనే
అభ్యర్థులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సబ్జెక్టుతో పాటు ఆంగ్లంలో నైపుణ్యం ఉంటేనే కొలువు దక్కుతుంది. తాజా పట్టభద్రుల్లో పది మందిలో అయిదుగురు ఆంగ్లంలో ప్రతిభ చూపకపోవడం వల్లే ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. చాలా మంది అభ్యర్థులు సాధన చేయకుండానే ముఖాముఖికి హాజరవుతున్నారు. 'టెల్‌ మీ అబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌' అని అడిగితే సమాధానం ఇవ్వడానికే చాలా సమయం తీసుకుంటారు. వ్యాకరణ దోషాలు ఎక్కువగా వస్తాయి. భయపడుతూ సమాధానాలిస్తారు. అందుకే తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పాలి. తెలియని పదాలను వాడకపోవడమే ఉత్తమం. ముఖాముఖికి ముందు రోజు అద్దం ముందు సాధన చేయాలి.
- కృష్ణారెడ్డి, హెచ్‌ఆర్‌


Posted on 20 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning