భవిష్యత్తుకు భరోసా!

* ఉపాధి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు 'టాస్క్‌'
* ఒక్కసారి నమోదు చేసుకుంటే ఉద్యోగం వచ్చే దాకా తోడ్పాటు
* ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు అవకాశం
*సెప్టెంబరు 21 ఆఖరు తేదీ
* ఇప్పటికి 136 ఇంజినీరింగ్‌, 83 డిగ్రీ కాలేజీల నమోదు

ఈనాడు - హైదరాబాద్‌: కార్పొరేట్‌ సంస్థలు కోరుకునే నైపుణ్యం.. పరిశ్రమకు అవసరమయ్యే సామర్థ్యం.. నేటి విపణి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, నిరుద్యోగులను తయారుచేసే లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్‌) విద్యార్థుల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈసారి టాస్క్‌లో నమోదుకు వచ్చే నెల 21వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ఏటా వేల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నా.. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వారు తయారయ్యేలా టాస్క్‌ తోడ్పాటు అందించనుంది. చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగం వచ్చేదాకా అండగా నిలవడంతోబాటు చదువుకుంటున్న సమయంలోనే ఉద్యోగాలకు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు టాస్క్‌ శ్రీకారం చుట్టింది. పూర్తి స్థాయి సన్నద్ధత అనంతరం తొలి ఏడాది విద్యార్థుల నమోదును ప్రారంభించింది. ఇప్పటికే 136 ఇంజినీరింగ్‌ కాలేజీలు, 83 డిగ్రీ కాలేజీలు టాస్క్‌ వద్ద నమోదు చేసుకుని కలసికట్టుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి.
టాస్క్‌ ఏం చేస్తుంది?
* తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, చదువుకుంటున్న విద్యార్థులకు వ్యక్తిగత నైపుణ్యం, సంస్థాగత నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.
* పరిశ్రమ లేదా సంస్థలు కోరుకుంటున్న నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించేలా విద్యాసంస్థలకు తోడ్పాటును అందిస్తుంది.
* విద్యాసంస్థలు- కార్పొరేట్‌ సంస్థలు- పరిశ్రమలను అనుసంధానం చేస్తుంది.
2015-16లో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులెవరు..?
* తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఎంబీఎ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు (రెండో సంవత్సరం నుంచి..)
* సాధారణ కేటగిరి విద్యార్థులు రూ.855 డీడీ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారైతే రూ.228 డీడీ ద్వారా చెల్లించాలి.
* ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
* దరఖాస్తుకు ఆఖరు తేది సెప్టెంబర్‌ 21
* ఇతర వివరాలకు www.tstask.com చూడవచ్చు.
నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఏం చేస్తారు..?
* విద్యార్థులకు అనేక మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం.
* సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం
* వ్యక్తిగత నైపుణ్యాభివృద్ధి
* అనేక అంశాలపై గెస్ట్‌లెక్చర్లు
* ఆంగ్లంలో చక్కగా మాట్లాడేలా తర్ఫీదు
* అందుబాటులోకి వర్చువల్‌ ల్యాబ్‌లు,
* ఈ-లెర్నింగ్‌ మెటీరియల్‌
* వర్క్‌షాపులు నిర్వహించడం
* ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు
* నియామకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం
* టాస్క్‌ ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం
* 'ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ప్రాక్టిస్‌' ద్వారా శిక్షణ పొందే అవకాశం
* శిక్షణకు వర్క్‌షాపులు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రాంలుంటాయి. (50 మంది విద్యార్థులు ఉంటే వాటిలో సర్టిఫికేషన్‌ కోర్సు)
నమోదు చేసుకున్న కళాశాలలకు టాస్క్‌ ఇలా తోడ్పడుతుంది
* బోధన సిబ్బంది నైపుణ్యం పెంపు
* కార్పొరేట్‌ సంస్థల అవసరాలకు అనుగుణంగా కాలేజీల అనుసంధానం
* వివిధ సాంకేతిక అంశాలపై కాలేజీల్లో గెస్ట్‌ లెక్చర్లు
* ప్లేస్‌మెంట్‌కు అవకాశాలు కల్పించడం
చదువు పూర్తయినవారికి ఫినిషింగ్‌ స్కూలు..
చదువు పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి టాస్క్‌ అండగా ఉంటుంది. వీరు కూడా ఉద్యోగాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యం, సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. కార్పొరేట్‌ సంస్థల అవసరాలకు తగినట్లు శిక్షణకు 'ఫినిషింగ్‌ స్కూల్‌' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఎనిమిది నుంచి 12 వారాలు ఉండే కోర్సు ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
టాస్క్‌లో భాగస్వామ్య, అనుబంధ సంస్థలు
హైసియా, ఐఎస్‌బీ, శాంసంగ్‌, ఐబీఎం, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, వర్చువల్‌ ల్యాబ్స్‌
పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా
తెలంగాణ రాష్ట్రంలో వృత్తివిద్యాకోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన పూర్తి తోడ్పాటును అందించేలా టాస్క్‌ తొలి ఏడాది విద్యార్థుల నమోదుకు అవకాశం కల్పించింది. పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో టాస్క్‌ ఏర్పాటైంది. విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను అనుసరిస్తే అవసరమైన పూర్తి సమాచారం అందుతుంది. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు, సామర్థ్య మదింపు ఉంటుంది. ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ప్రాక్టిస్‌ పేరుతో వివిధ రంగాల్లో నిష్ణాతులు, విద్యావంతులను టాస్క్‌ గుర్తించింది. వారు సమర్థవంతంగా ఉపయోగపడేలా సిద్ధంగా ఉన్నారు. విద్యార్థుల నమోదు పూర్తయిన తర్వాత కార్యాచరణ ఉంటుంది.
----- సుజీవ్‌ నాయర్‌, టాస్క్‌ సీఈఓ


Posted on 24 - 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning