ఐటీలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

* నైపుణ్యాలు పెంచడానికే
* 2020 నాటికి 15 లక్షల మందికి
* నాస్‌కామ్‌ నైపుణ్యాల మండలి కృషి

ఈనాడు - హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఆధారిత సేవల కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు విద్యార్థులను తీర్చిదిద్దడానికి వారికి వివిధ ప్రత్యేక విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌) ఆధ్వర్యంలోని ఐటీ, ఐటీఈఎస్‌ రంగ నైపుణ్యాల మండలి (సెక్టర్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌-ఎస్‌ఎస్‌సీ) కృషి చేస్తోంది. వివిధ విభాగాల్లో పరిశ్రమకు అవసరమైన బోధన అంశాలను తయారు చేసి, క్యాలిఫికేషన్‌ ప్యాకేజీల (క్యూపీ)ల ద్వారా శిక్షణ ఇస్తుంది. ప్రత్యేక శిక్షణ 200-400 గంటల వరకూ ఉంటుంది. నాస్‌కామ్‌ బోధన అంశాలను, ఇతర మద్దతును అందిస్తే.. ఆయా కాలేజీలు విద్యార్థులకు వీటిలో శిక్షణ ఇస్తాయి. శిక్షణ పొందిన వారికి ఎస్‌ఎస్‌సీ నుంచి ధ్రువీకరణ పత్రం లభిస్తుంది. ఇది దేశీయంగా పరిశ్రమల్లో ఉద్యోగాలను సంపాదించడానికే కాకుండా విదేశాల్లో కూడా ఈ ధ్రువీకరణ పత్రానికి గుర్తింపు ఉంటుందని నాస్‌కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, ఐటీఈఎస్‌ ఎస్‌ఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతల సంధ్యా తెలిపారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ 150 కాలేజీల్లో దీన్ని అమలు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో తప్పనిసరిగా అమలు చేయడానికి యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. సాధారణ డిగ్రీతోపాటు, ప్రత్యేక నైపుణ్యాల్లో పట్టు ఉండడం వల్ల విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇప్పటి వరకూ ఇటువంటి ప్రత్యేక శిక్షణను 3.5 లక్షల మంది పొందారని, 2020 నాటికి 15 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంధ్యా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడి విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో శిక్షణ అందిస్తున్నారు. ఐటీ సేవలు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజిమెంట్‌ (బీపీఎం), ఇంజినీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌ అభివృద్ధి విభాగాల్లో అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైంటిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ, టెస్టింగ్‌, రిమోట్‌ ఇన్‌ఫ్రా మేనేజిమెంట్‌, సీఆర్‌ఎం వంటి 516 రకాల ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను ఐటీ/ఐటీఈఎస్‌ ఎస్‌ఎస్‌సీ అందిస్తోంది. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ డేటాను కాపాడుకునేందుకు అన్ని రంగాల్లో సైబర్‌ భద్రత కీలకంగా మారింది. అవసరాలకు అనుగుణంగా ప్రారంభ, మధ్య, పైస్థాయిలో 30 రకాల ఉద్యోగాలను, అందుకు అవసరమైన శిక్షణను కొద్ది వారాల్లో నాస్‌కామ్‌కు చెందిన డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రవేశపెట్టనుంది.
ట్యాప్‌ ఫోరమ్‌ ఏర్పాటు
హైదరాబాద్‌కు చెందిన ట్యాలెంట్‌ స్ప్రింట్‌ కంపెనీతో కలిసి ట్యాలెంట్‌ అక్వైజైషన్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరమ్‌ (ట్యాప్‌ ఫోరమ్‌)ను ఐటీ, ఐటీఈఎస్‌ రంగ నైపుణ్యాల మండలి ఏర్పాటు చేసింది. ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులను నియామకం చేసే కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలు, నిపుణులు సమాచారాన్ని పంచుకోవడానికి ఇది ఒక వేదికగా పని చేస్తుంది. దేశంలో దాదాపు 30 వేల ట్యాలెంట్‌ అక్వైజేషన్‌ నిపుణులు ఉన్నాయి. పరిశ్రమ అవసరాలు, టెక్నాలజీ మొదలైన వాటిని పంచుకోవడానికి ఫోరమ్‌ దోహదం చేస్తుందని ట్యాలెంట్‌ స్ప్రింట్‌ ఎండీ, సీఈఓ శాంతను పాల్‌ చెప్పారు.

Posted on 28- 08 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning