సాఫ్ట్‌వేర్‌లో నవ 'కిరణం'

* ఇంటర్‌ చదివి.. సంస్థనే స్థాపించిన వైనం
* ప్రముఖ సంస్థలతో పని చేసే భాగ్యం

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: 'సాఫ్ట్‌వేర్‌ భూం చూసి అందరిలా ఉద్యోగం కావాలనుకోలేదు ఆ కుర్రాడు. ఏకంగా ఓ కంపెనీనే స్థాపించాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యంతో ఇంటర్‌లో డిస్టింక్షన్‌ మార్కులు సాధించాడు. అంతే ఉత్సాహంతో అమెరికాలో ప్రముఖ కళాశాలలో డిగ్రీకి సీటు సంపాదించాడు. ఆర్థిక వెసులుబాటు లేక అమెరికా అవకాశాన్ని వదులుకొని, డిగ్రీ చేయలేకపోయాడు. అలాగని కలను మరువలేదు. లక్ష్య సాధనకు విక్రమార్కునిలా పట్టువదలక ముందుకు సాగాడు.
'మనలో ఉన్న ఆలోచన, నమ్మకమే మనం ప్రారంభించే ఏ కార్యానికైనా పెట్టుబడి.' అని నమ్మిన అనకాపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌ తన వినూత్న ఆలోచనలతో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించి తన కలను నిజం చేసుకున్నాడు. అనకాపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, అక్కడే ఇంటర్‌ చదివిన ఉదయ్‌కిరణ్‌ పదేళ్లుగా అలిసిపోని ప్రయాణం సాగిస్తూ ఫార్చ్యూన్‌-500 సంస్థల్లోని మూడు సంస్థలతో కలిసి తన కలల సంస్థ పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఉదయ్‌కిరణ్‌ డిగ్రీ చదివేందుకు అమెరికాలోని నాసాకు అనుబంధంగా ఉన్న ఫ్ల్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌లో అవకాశం వచ్చింది. అందుకు తగిన డబ్బులు లేక ఆ అవకాశాన్ని కోల్పోయాడు. వైజాగ్‌లో డిగ్రీలో చేరినా కొద్ది రోజులకే తన చదువును మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. కానీ ఏదో సాధించాలనే తన ఆలోచన కంప్యూటర్‌వైపు మొగ్గు చూపింది. ఫలితంగా అద్భుతాలు సృష్టించే అవకాశాలూ ఇచ్చింది.
సృజనాత్మకతకు పెద్దపీట
ఏ రంగంలోనైనా అనుభవం నేర్పించే సంస్థలు ఉండవు. మన జీవితమే అది నేర్పుతుంది. ఈ క్రమంలోనే డిగ్రీ మధ్యలో నిలిపిన ఉదయ్‌ తన సోదరుడితో కలిసి 2004లో 'టెర్మినస్‌' పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. సంస్థలో ఇద్దరే.. కానీ ఆలోచనలు అనేకం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల్లో టీసీ, విద్యార్హత పత్రాలు, ఐడీ కార్డులు ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. ఇలా దాదాపు 60కళాశాలలకు ఈ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించారు. అక్కడి నుంచి ఆయన 2006లో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నాలుగేళ్లు కష్టపడి 'క్యాంపస్‌ డ్రైవ్‌' పేరుతో మరో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. ఇది నాణ్యమైన విద్యను అందించేందుకు రూపొందించిన అంశం. విద్యార్థులకు కొత్త తరహాలో పాఠాలను నేర్పేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని అంటున్నాడు ఉదయ్‌. కానీ ఈ ప్రాజెక్టుకును ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోకి తీసుకెళ్దామంటే అది సాధ్యపడలేదన్నాడు.
సరికొత్తగా.. పెద్ద సంస్థలతో..
చేసిన ప్రాజెక్టులు మార్కెటింగ్‌ చేసుకోవడం, వివిధ సంస్థలు వాడుకునేలా చేయడంలో ఉదయ్‌ విఫలమవుతూ వచ్చాడు. దీంతో బలమైన ఒక జట్టును ఏర్పాటు చేసుకొని సరికొత్త సాంకేతికతపై పని చేయడం ప్రారంభించాడు. అలా ఓ సంస్థలో ఉద్యోగులందర్నీ క్రోడీకరించడమే కాకుండా వ్యాపారానికి సంబంధించి లావాదేవీలన్నింటినీ అరచేతిలో చూసుకొనేలా 'బిజ్‌గేజ్‌' పేరుతో మరో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉదయ్‌కు ఇలా కలిసొచ్చింది.
* 'బిజ్‌గేజ్‌' ఫార్చ్యూన్‌-500లోని మూడు సంస్థలూ ఉపయోగించేందుకు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ప్రముఖమైన ఆ కంపెనీలతో ఉదయ్‌ పని చేస్తున్నాడు.
* ఎనిమిది మంది డిస్ట్రిబ్యూటర్లతో దాదాపు 20వేల మంది ఉద్యోగులను సైతం ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తున్నట్లు ఉదయ్‌ చెబుతున్నాడు.
* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకే అందుబాటులో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ను ఈ నెల 5న అధికారికంగా మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో విడుదల చేయనున్నాడు.
* వచ్చే నెలలో ఐఓఎస్‌(యాపిల్‌ ఫోన్‌లకు) విడుదల చేస్తున్నట్లు వివరించాడు.
* గత సంవత్సరం దాదాపు రూ.కోటిన్నర టర్నోవర్‌ చేసిన సంస్థ ఈ సారి రూ.పది కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపాడు.
Posted on 07 - 09 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning