ఇంజినీరింగ్‌లో... అదనపు మెలకువలు

ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు తమ బ్రాంచిలోని అవకాశాలపై పరిజ్ఞానం, వాటిని అందిపుచ్చుకోవడానికి ఎలా చదవాలో తగిన అవగాహన చాలా అవసరం. ఈ నాలుగేళ్ళలో కొన్ని అదనపు మెలకువలు నేర్చుకోవడం ద్వారా ఇంజినీరింగ్‌ పట్టా నాణ్యతనూ, విలువనూ పెంచుకోవచ్చు.
విద్యాబోధన విధానం మూడు రకాలు. వీటిని బోధనా న్యాయాలుగా వ్యవహరించవచ్చు.
అ) కుక్కుట న్యాయం: కుక్కుటం (కోడి) తన పిల్లలతోపాటు ఎల్లప్పుడూ ఉంటూ, ఆపదల సమయంలో తన రెక్కల చాటున కోడి పిల్లలను దాచి సంరక్షించుకుంటుంది. ప్రాథమిక విద్య స్థాయిలో ఈ పద్ధతి ఆచరణలో కనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థుల పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆ) మార్జాల న్యాయం: పిల్లి తన కూనకు వేటను నేర్పడానికి ఒక ఎలుకను కొంతమేరకు గాయపరచి, ఆ అర్ధప్రాణమున్న ఎలుకను తన కూనకు ఇచ్చి తాను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎలుక తన ప్రాణరక్షణ ప్రయత్నంలో కూన చేతికి దక్కకుండా పోయే సందర్భంలో తల్లి పిల్లి దాని సహాయార్థం రంగంలో దిగి, ఎలుకను పట్టి ఇస్తుంది. మాధ్యమిక విద్యావిధానంలో విద్యార్థులు తప్పు చేసే సందర్భాల్లో ఉపాధ్యాయులు వారికి మార్గనిర్దేశం చేసి సరైన దారిలోపెడతారు. ఈ రెండు న్యాయాల్లోనూ గురువులను 'ఉపాధ్యాయులు'గా వ్యవహరిస్తారు. ఉప అధ్యాయి అంటే సహాయ సహకారాలు అందించే అధ్యాయి (విద్యార్థి)గా గురువు బాధ్యత గురుతరమైనది.
ఇ) మర్కట న్యాయం: పిల్ల కోతి తల్లి పొట్టను పట్టుకుని ఉంటుంది. కోతి ఒక కొమ్మనుంచి మరో కొమ్మపైకి దూకుతున్నపుడు పడిపోకుండా తల్లిని గట్టిగా పట్టుకునే బాధ్యత పూర్తిగా పిల్లకోతిదే. కళాశాల స్థాయిలో అధ్యాపకులు బోధన చేసే పద్ధతి ఇలాగే ఉంటుంది. బోధనకు తోడుగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వీరు మార్గనిర్దేశం చేస్తుంటారు. అందువల్ల వీరిని అందుకోగలిగిన సామర్థ్యాలు పెంపొందించుకునే బాధ్యత ఎక్కువగా విద్యార్థులదే. మౌలిక సమాచార తరగతుల్లో తెలుసుకుని, అదనపు విషయ సేకరణకు తమ అధ్యాపకుల సాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ మొదటి సంవత్సరంలో ఏయే అదనపు మెలకువలపై దృష్టిపెట్టాలో తెలుసుకుందాం.
లక్ష్య నిర్థారణ
ఇంజినీరింగ్‌ విద్యార్థి చేయవలసిన మొదటి పని- లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. బీటెక్‌ తరువాత ఏం చేయాలనే విషయంలో స్పష్టత చాలా అవసరం. లక్ష్యం ఏమిటన్నది తెలిస్తే గమ్యం చేరుకోవడానికి కావాల్సిన, ఉపయోగమైన నిర్ణయాలు సముచితంగా ఉంటాయి. ఉదాహరణకు ఈసీఈ బ్రాంచి విద్యార్థి స్పేస్‌ సైంటిస్టు కావాలనే లక్ష్యం నిర్దేశించుకుంటే- అందుకు కావాల్సిన సబ్జెక్టులు, బీటెక్‌లో ఏయే సంవత్సరాల్లో ఉంటాయి, అవసరమయ్యే ఇతర సబ్జెక్టుల విజ్ఞానం గురించి ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఏ అదనపు కోర్సులు, మెలకువల్లో శిక్షణ అవసరమవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.
కేవలం లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు. దాని సాధ్యాసాధ్యాల గురించీ, అవకాశాలు, పరిమితుల గురించీ తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. కలెక్టర్‌ కావాలని లక్ష్యం ఉంటే- దానికి సంబంధించిన సమాచారాన్ని, ఆ ఉద్యోగానికి ఉండాల్సిన లక్షణాలను గురించి తెలుసుకుని, ఆ దిశలో తయారు కావాలి. లేదంటే ప్రయత్నలోపంతో కూడుకున్న లక్ష్యం కేవలం కోరిక మాత్రమే అవుతుంది.
సమయ నిర్వహణ
ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు సమయ నిర్వహణపట్ల అవగాహన సరిగా ఉండదు. సమయ మూల్యంపై పూర్తి అవగాహన ఉండదు. పైగా దాదాపు మే నెల నుంచి ఆగస్టు వరకు (ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశపరీక్షల కాలం, కోర్సుల్లో ప్రవేశ మధ్యకాలం) ఏ క్రియాశీల కార్యక్రమం లేకపోవడం వల్ల కొంత అలసత్వ పోకడలకూ అవకాశముంది. దీంతో సమయం విలువ తెలుసుకోలేకపోవచ్చు.
అందుకే... ఇంజినీరింగ్‌లో ఉన్న సబ్జెక్టులు, వాటిలోతుపాతులు త్వరగా తెలుసుకోవాలి. సబ్జెక్టును అంత లోతుగా అర్థం చేసుకోవాలంటే దినసరి ప్రాతిపదికన, ఒకవేళ వీలుపడకపోతే వారం ప్రతిపదికన ప్రతి సబ్జెక్టుకూ సమయం కేటాయించుకోవాలి. అంటే, ఒక నిర్దిష్టమైన టైం టేబుల్‌ వేసుకోవాలి.
మొదటి సంవత్సరంలో ఆరు/ ఏడు సబ్జెక్టులు, ఐదు లేబొరేటరీలు ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్టులన్నీ చదవడానికి కచ్చితమైన సమయం కేటాయించడం తప్పనిసరి.
ఉదాహరణకు రోజుకు రెండు గంటల సమయం కళాశాలలో చెప్పిన విషయాలను చదవడానికి కేటాయించామనుకుందాం. ఈ రెండు గంటల్లో ఒకటిన్నర గంటలు ఒక సబ్జెక్టుకీ, అరగంట ఇంకో సబ్జెక్టుకీ కేటాయించాలి. ఇలా మూడురోజుల్లో అన్ని సబ్జెక్టులూ చదవడం కుదురుతుంది. ఇక నాలుగోరోజు మొదటి రోజు సబ్జెక్టుల్లో మొదటి దానికి అరగంట, రెండోదానికి ఒకటిన్నర గంటలు కేటాయించాలి. ఈవిధంగా ఒక వారంలో ప్రతి సబ్జెక్టుకీ రెండు గంటల చొప్పున కేటాయించినట్లవుతుంది.
ఒకటిన్నర గంటలు చదువుకోవడానికి వినియోగిస్తే, అరగంట సమయం పునశ్చరణకు ఉపయోగించుకోవాలి. అయితే ఈ రెండు గంటల సమయం అదనపు సమయం కావాలి. అంతేకానీ అసైన్‌మెంట్లు, రికార్డులు రాయడానికి వినియోగించి సమయం కేటాయించామనుకోకూడదు. దీనికితోడు లక్ష్యం సాధించుకోవడానికి అవసరమయ్యే ఇతర సబ్జెక్టుల అభ్యాసానికి కేటాయించాలి.
ఉదాహరణకు ఐపీఎస్‌ లక్ష్యం అనుకుంటే- దానికి కావాల్సిన చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి సబ్జెక్టులకు కూడా కొంత సమయం కేటాయించాలి. ప్రణాళికను శ్రద్ధగా అమలుపరచాలి. అపుడే నిర్దేశించుకున్న లక్ష్యం సాధించవచ్చు. సమయాన్ని అదనంగా సృష్టించలేమనీ ప్రతి ఒక్కరికీ ఒకరోజులో 24 గంటలే ఉంటాయనీ, ఈ సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉందనీ తెలుసుకోవాలి.
పాఠ్యపుస్తకాలు చదివే మెలకువ
ఇంటర్మీడియట్‌ వరకూ కళాశాలలు ముందస్తుగా తయారుచేసి పంపిణీ చేసిన పాఠ్యాంశాలనే చదువుకోవడం సాధారణం. దీనివల్ల ప్రతిపాదిత పాఠ్యపుస్తకాలు, ప్రామాణిక పుస్తకాలు చదివే అవకాశం తక్కువగా ఉండడం, ఒకవేళ ఉన్నా దాని నుంచి సొంతంగా సంగ్రహించి అర్థం చేసుకోవడమనే మెలకువ అలవడి ఉండకపోవచ్చు. దీనివల్ల ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటర్మీడియట్‌ మాదిరి ఇంజినీరింగ్‌ కోర్సులో ముందస్తు నోట్సు తయారుచేయడమనేది సాధ్యపడదు. పైగా ఒకే పుస్తకం నుంచి సమగ్రమైన నోట్సు తయారీ అనేది వీలుపడదు. అందువల్ల పాఠ్యపుస్తకం (టెక్ట్స్‌ బుక్‌) చదివే అలవాటు తప్పనిసరి. పరీక్షలతోపాటు ఉద్యోగావకాశాలకు కూడా ఇది అవసరమవుతుంది.
పుస్తకాలు చదవడానికి ఒక నిర్దిష్ట పద్ధతిని అవలంబించాలి. ఒక పుస్తకం చదువుతున్నపుడు మొదట ఆ పాఠ్యాంశం శీర్షిక, ఉపోద్ఘాతాల ఆధారంగా ఆ పాఠం ముఖ్య సమాచారం గురించి బేరీజు వేసే మెలకువను అలవరచుకోవాలి.
ఉదాహరణకు భౌతికశాస్త్రంలో తరంగాల గురించి చర్చించే పాఠం ఉంది. అపుడు విద్యార్థికున్న ఇంటర్మీడియట్‌ జ్ఞానంతో ఆలోచించి, ఈ పాఠంలో ఏయే అంశాల గురించి సమాచారం, అదనపు సమాచారం లభిస్తుందో అంచనా వేసుకోవాలి. అప్పుడు ఆ పాఠం సులభంగా అర్థమయ్యే అవకాశముంటుంది.
మానసికంగా సిద్ధపడి ఉండడం వల్ల సబ్జెక్టుపై ఆసక్తి కలుగుతుంది. ఒక వాక్యం చదివి, దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానిని సొంత వాక్యంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల గ్రాహ్యశక్తి, భావప్రకటన సామర్థ్యం పెంచుకోవచ్చు. అలాగే ఒక పేరా మొత్తం చదివి, పుస్తకం మూసి ఆ పేరా ద్వారా రచయిత చెప్పదలచుకున్న అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే పద్ధతిని పేజీకి కూడా చేయాలి.
ఇలా చేయడం ద్వారా ఆ పాఠ్యాంశంలోని అన్ని విషయాలు అర్థమవడమే కాకుండా దానికి సంబంధించి గత తరగతుల్లో తెలుసుకున్న విజ్ఞానాన్ని జోడించి సమగ్ర జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఒకే పాఠ్యాంశానికి సంబంధించిన విషయసేకరణ వివిధ పుస్తకాల నుంచి చేయాలి. వాటన్నింటినీ జోడించి సారాంశాన్ని నోట్సుగా చేసుకుంటే పరీక్షలకూ, ఇతర అవసరాలకూ ఎంతో ఉపయోగపడుతుంది.
నోట్సు తయారీ
తరగతిలో అధ్యాపకులు చెప్పే అంశాలను చిన్న చిన్న పాయింట్లుగా రాసుకోవాలి. వీటి ఆధారంగా పాఠ్యపుస్తకాల నుంచి పైన చెప్పిన రీతిలో నోట్సు తయారు చేసుకోవాలి. అధ్యాపకులకు చూపించి, అందులో తప్పులను సరిదిద్దుకుని చక్కని నోట్సు తయారుచేసుకుంటే ఇది అన్నివిధాలా ఉపయోగపడుతుంది.
నోట్సు తయారీ ఒక కళ. ఇది పుస్తకాల్లోని అంశాలనూ, అధ్యాపకులు నేర్పిన పాఠాలనూ తమకు అర్థమయ్యేరీతిలో తయారు చేసుకునే మెలకువ. నోట్సు రాసుకోవడం అలవాటులేనివారికి మొదట ఇది కష్టమనిపించినా, కొద్దికాలంలోనే దీనివల్ల ఉండే ఉపయోగాలు తెలుస్తాయి. ఆపై త్వరితగతిన నోట్సు తయారీ కూడా వస్తుంది. ఇంకా అవసరమైతే మైండ్‌ మ్యాపింగ్‌ వంటి మెలకువలను కూడా నేర్చుకుని నోట్సు తయారుచేసుకునే పటిమను పెంచుకోవచ్చు.
అసైన్‌మెంట్లు రాయడం
ఒక పాఠ్యాంశం పూర్తికాగానే ఆ అంశానికి సంబంధించిన వివిధ ప్రశ్నలను అధ్యాపకులు అసైన్‌మెంట్లుగా ఇస్తుంటారు. ఇంజినీరింగ్‌ స్థాయిలో అయితే ఈ అసైన్‌మెంట్లకు కొన్ని మార్కులు (జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ప్రతి సబ్జెక్టుకి గరిష్ఠంగా 5 మార్కులు) కూడా కేటాయించారు.
వీటి ముఖ్య ఉద్దేశం- కేవలం మార్కులే కాకుండా అధ్యాపకులకు, విద్యార్థులు పాఠ్యాంశాన్ని ఏమేరకు అర్థం చేసుకోగలుగుతున్నారనే అంశంపై ప్రతిపుష్టినిస్తుంది. అందువల్ల విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను తిరగరాయకుండా సొంత వాక్యాల్లో క్లుప్తంగా, సూటిగా రాస్తే చాలా ఉపయోగం. దీనిద్వారా అధ్యాపకులు ప్రతి విద్యార్థి కోసం ఎంత అదనపు సమయం వెచ్చించాలన్న విషయంపై అవగాహనకు వచ్చే ఆస్కారముంటుంది. అసైన్‌మెంట్లలోని ప్రశ్నలకు సమాధానాలు తాము తయారుచేసుకున్న నోట్సు నుంచి రాస్తే ఇంకా మంచిది.
నియమ నిబంధనల అవగాహన
జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి కొన్ని కొత్త నియమ నిబంధనలను ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు పరుస్తున్నారు. వీటి గురించి పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవటం చాలా అవసరం.
క్రెడిట్ల ప్రాముఖ్యం: ప్రతి సబ్జెక్టుకీ కొన్ని క్రెడిట్లు కేటాయించారు. మొదటి సంవత్సరంలో ప్రతి సబ్జెక్టుకీ ఆరు క్రెడిట్లు, ప్రతి లేబొరేటరీ సబ్జెక్టుకీ నాలుగు క్రెడిట్లు ఉంటాయి. రెండో సంవత్సరం నుంచి ఈ క్రెడిట్లు సబ్జెక్టుకి నాలుగు, లేబొరేటరీకి రెండు చొప్పున ఉంటాయి. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే అన్ని క్రెడిట్లూ వస్తాయి. ఫెయిల్‌ అయితే క్రెడిట్లు రావు. ఒక సంవత్సరం నుంచి పై సంవత్సరానికి వెళ్లడానికి ఈ క్రెడిట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. క్రెడిట్ల ప్రాతిపదిక ఈ కింది విధంగా అమలుపరుస్తారు.
* మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి వెళ్లడానికి, మొదటి సంవత్సరంలో కనీసం 28 క్రెడిట్లు వచ్చుండాలి. లేదంటే రెండో సంవత్సరం చదవడానికి అనర్హులు. ఈ పరిస్థితిలో విద్యార్థి ఇంటిపట్టునే ఉండి కావాల్సిన కనీస క్రెడిట్లు సంపాదించుకుని, రెండో సంవత్సరానికి ప్రవేశం పొందాలి. అంతవరకూ రెండో సంవత్సరం చదవడానికి అర్హులు కారు. అంటే కనీస క్రెడిట్లు తెచ్చుకోలేకపోతే కనీసం ఒక విద్యాసంవత్సరం నష్టపోతారు.
ఏ శ్రేణిలో పాసవదల్చుకున్నదీ మొదటి సంవత్సరంలోనే లక్ష్యంగా నిర్ణయించుకోవాలి. ఒక సబ్జెక్టులో 100కు 70 మార్కులు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో ఎన్ని మార్కులు దేంట్లో తెచ్చుకోవాలో స్పష్టత ఉండాలి.
* రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరానికి వెళ్లడానికి మొదటి, రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్లను కలుపుకుని మొత్తం 84 క్రెడిట్లకుగానూ కనీసం 50 క్రెడిట్లు వచ్చి ఉండాలి. ప్రత్యామ్నాయంగా మొదటి రెండు సంవత్సరాల్లోని మొత్తం 112 క్రెడిట్లకుగానూ కనీసం 68 క్రెడిట్లు వచ్చివుండాలి. లేకపోతే మూడో సంవత్సరం చదవడానికి అనర్హులు. ఈ పరిస్థితిలో విద్యార్థి ఇంటిపట్టునే ఉండి కావాల్సిన కనీస క్రెడిట్లు సంపాదించుకుని మూడో సంవత్సరానికి ప్రవేశం పొందాలి.
* మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరానికి వెళ్లడానికి మొదటి, రెండో, మూడో సంవత్సరాల మొదటి సెమిస్టర్లను కలుపుకుని మొత్తం 140 క్రెడిట్లకుగానూ కనీసం 84 క్రెడిట్లు వచ్చుండాలి. ప్రత్యామ్నాయంగా మొదటి మూడు సంవత్సరాల్లోని మొత్తం 168 క్రెడిట్లకుగానూ కనీసం 100 క్రెడిట్లు వచ్చుండాలి. లేకపోతే నాలుగో సంవత్సరం చదవడానికి అనర్హులు.
* ఈ నిబంధనలకు అదనంగా మొదటి సంవత్సరంలోకానీ ఏ సెమిస్టరులోనైనా కానీ హాజరుపరంగా కనీస అర్హత పొంది ఉండడం కూడా అవసరం. హాజరు ఆధారంగా అనర్హులై ఉండరాదు. బీటెక్‌లో ఉన్న మొత్తం 224 క్రెడిట్లకుగానూ ఉత్తీర్ణులుగా అర్హత పొందడానికి కనీసం 216 క్రెడిట్లు సంపాదించి ఉండాలి. లేకపోతే బీటెక్‌ డిగ్రీ పొందలేరు.
అంతర్గత మార్కులు: ప్రతి సబ్జెక్టులోనూ గరిష్ఠంగా 25 అంతర్గత మార్కులుంటాయి. ఇందులో పది మార్కులు రాతపరీక్షకూ, పది మార్కులు ఆబ్జెక్టివ్‌ పరీక్షకూ, ఐదు మార్కులు అసైన్‌మెంట్‌కూ కేటాయించి ఉంటాయి. మొదటి సంవత్సరంలో మూడు అంతర్గత పరీక్షలు, రెండో సంవత్సరం నుంచి ప్రతి సెమిస్టర్‌లో రెండు అంతర్గత పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలోనూ హాజరు తప్పనిసరి. ఈ పరీక్షల్లో విద్యార్థి పొందిన మార్కులను అన్ని పరీక్షల సరాసరిగా లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంగా విద్యార్థి సబ్జెక్టులో పరీక్షలు రాయలేకపోతే విశ్వవిద్యాలయం ఆ సబ్జెక్టులో ఒక ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో వచ్చిన మార్కులు ఆ సబ్జెక్టులో అంతర్గత మార్కులుగా పరిగణిస్తారు. కాబట్టి అంతర్గత పరీక్షలు తప్పకుండా రాయాలి.
అంతర్గత మార్కులు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మంచి శ్రేణిలో ఆ సబ్జెక్టులో పాస్‌ అవవచ్చు. విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలు పాస్‌ అవుతారో లేదో నిర్ణయిస్తే, అంతర్గత పరీక్షలు ఏ శ్రేణిలో పాస్‌ అవ్వగలరో నిర్ణయిస్తాయి.
ఇంజినీరింగ్‌లో ఏ శ్రేణిలో పాసవదల్చుకున్నదీ మొదటి సంవత్సరంలోనే లక్ష్యంగా నిర్ణయించుకోవాలి. ఒక సబ్జెక్టులో 100కు 70 మార్కులు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో ఎన్ని మార్కులు దేంట్లో తెచ్చుకోవాలో స్పష్టత ఉండాలి. విశ్వవిద్యాలయం నిర్వహించే మార్కుల్లో ఎన్ని, అంతర్గత మార్కుల్లో ఎన్ని సాధించాలో అంచనా వేసుకోవాలి. అప్పుడే ఎంత నాణ్యతతో చదవాలో బాగా విశదమవుతుంది. లక్ష్యసాధనకు సరైన ప్రాతిపదిక ఏర్పడుతుంది.
గిరాకీ తగ్గిందా?
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే కాకుండా ఐఐటీలు, ఇంకా ఇతర విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో కూడా ఇంజినీరింగ్‌లో కొన్ని సీట్లు మిగిలిపోయాయి. ఈ వాస్తవం ఇంజినీరింగ్‌ విద్యకు గిరాకీ తగ్గిందనే అనుమానాన్ని రేకెత్తించే ఆస్కారముంది. అయితే ఈ నిజం నాణేనికి ఒక పార్శ్వమే.
మన దేశంలోనే కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడం సహజమే. అంతేకాకుండా చాలావరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో, ప్రమాణాలున్న స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థల్లో సీట్లు మిగలకుండా పోవడమనేది కూడా అంతే నిజం. కాబట్టి సీట్లు మిగిలిపోవడమనే విషయం పెద్దగా ఆందోళన పడవలసిన విషయం కాదు.
సమకాలీన పరిస్థితులను గమనించి, భవిష్యత్తులో మంచి అభివృద్ధికి అవకాశం కలిగిన కొత్త కోర్సుల్లో ప్రవేశం తీసుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
Posted on 28 - 09 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning