కొత్త కంపెనీల్లో 'యువ' దూకుడు!

* శక్తి, సాహసం, వినూత్నత సమ్మిళితం ఏర్పాటులో శరవేగం
* అతి పెద్ద విపణీ మాదే
* అనేక విభాగాల్లో అపార అవకాశాలు
* సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ సదస్సులో ప్రధాని మోదీ

శాన్‌జోస్‌: 'భారతీయ యువత శక్తి, సాహసం, వినూత్నతకు దర్పణం పట్టేలా కొత్త కంపెనీలు (స్టార్టప్‌లు) శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. కొత్త తరహా సంస్థల ఏర్పాటుకు అవసరమైన విద్యాసంస్థలు, ప్రోత్సాహకాలు, ఆసక్తి వంటివి దేశంలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ సంస్థల సేవలు, ఉత్పత్తుల కొనుగోలుకు భారీ విపణి కూడా దేశీయంగా అందుబాటులో ఉంది. ప్రతి రంగంలోనూ ఇంకా ఎన్నో అవకాశాలున్నాయ్‌' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. లింక్డ్‌ఇన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హఫ్‌మన్‌ వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'స్టార్టప్‌ కార్యక్రమాన్ని విదేశాల్లో తొలిసారిగా సిలికాన్‌ వ్యాలీలో భారత్‌ నిర్వహించడం సమంజసమే. మేధోపరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించిన వినూత్నత, టెక్నాలజీ అంశాల్లో భారత్‌, అమెరికా సహజసిద్ధ భాగస్వాములు' అని మోదీ పేర్కొన్నారు. 'కొత్త సంస్థల ఏర్పాటుకు అవసరమైన ఇంక్యుబేటర్లు, యాక్సెలరేటర్లు మాకున్నాయి. ఒక వినూత్న ఆలోచనను సంస్థగా మలచేందుకు కావాల్సిన పెట్టుబడి పెట్టేందుకు గొప్ప ఉత్సాహం కలిగిన వారు ఎందరో ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా వీరంతా గణనీయంగా అభివృద్ధి చెందారు' అని మోదీ వివరించారు. 'ఇవన్నీ ఉద్యోగాల కల్పన, సంస్థల స్థాపనకు తద్వారా దేశ వృద్ధికి తోడ్పడుతున్నాయి. గ్రామీణుల ఆర్థిక -జీవన స్థితి మెరుగయ్యేలా ఈ సంస్థలు తోడ్పడాలి. చేతి వృత్తులు, పర్యాటకం.. ఎన్నోరంగాల్లో అపార అవకాశాలున్నాయి. గ్రామీణ మహిళలకు అవకాశం ఇస్తే, ఆర్థిక వ్యవస్థనే కాదు సమాజాన్నే మార్చేస్తున్నారు. వీరికి అనువైన సంస్థలు కావాలి' అని మోదీ పేర్కొన్నారు.
ఆర్థిక విజయమే కాదు సామాజిక బాధ్యత కూడా
'ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పర్యావరణ అనుకూల ఇంధనం, భద్రత, అందరికీ ఆర్థిక సేవలు, పరిశుభ్ర తాగునీరు వంటి విభాగాల్లో సమూల మార్పుల కోసం సాంకేతికతను వినియోగిస్తున్న కొత్త భారతీయ కంపెనీలు ఇక్కడకు వచ్చాయి. ఇవన్నీ ఆర్థికంగా విజయవంతం కావడంతో పాటు సామాజిక బాధ్యతను వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. వయస్సు, విద్య, భాష, ఆదాయంతో సంబంధం లేకుండా భారతీయులంతా డిజిటల్‌ సాంకేతికతను వినియోగిస్తున్నారు. 100 కోట్ల మంది సెల్‌ఫోన్‌ కలిగి ఉంటే, 10 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లపై ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. పాలను అందించేందుకు, వేగవంతమైన సేవలతో ప్రజలను సాధికారికంగా మలచేందుకు మొబైల్‌నే సాధనంగా చేసుకుంటున్నాం. పేదలకు అనువైన ధరల్లో ఉత్పత్తులు, సేవలు అందించడం ద్వారా ప్రపంచానికే దిక్సూచిగా నిలవాలి' అని మోదీ ఆకాంక్షించారు.
అంతరిక్ష అప్లికేషన్లు వినియోగిస్తున్నాం
'దేశీయంగా అంతరిక్ష విభాగం ఎంతో సమాచారాన్ని ఉచితంగా పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. పాలన-అభివృద్ధి కోసం అంతరిక్ష పరిజ్ఞానానికి చెందిన 170 అప్లికేషన్లను వినియోగించుకుంటున్నాం. క్లౌడ్‌ ఆధారంగా కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి.
కొత్త సంస్థల వృద్దికి 7 ఒప్పందాలు
ఈ కార్యక్రమానికి ముందు టై సిలికాన్‌ వ్యాలీ, ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సీఐఐఈ ఇండియా నిర్వహించిన 'ఇండియా-యూఎస్‌ కనెక్ట్‌ 2015'లో భారత్‌, అమెరికా నుంచి 40 కొత్త సంస్థలు పాల్గొన్నాయి. దేశీయంగా కొత్త కంపెనీల ఏర్పాటును మరింతగా ప్రోత్సహించేలా భారత్‌, అమెరికా సంస్థల మధ్య 7 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
* సైన్స్‌ ఆధారిత సంస్థలు, పరిశోధన, విద్య, వ్యాపారాల అభివృద్ధి కోసం పరస్పరం అభిప్రాయాలు పంచుకునేలా సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ ప్లాట్‌ఫామ్స్‌, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్వాటిటేటివ్‌ బయోసైన్సెస్‌ ఒప్పందం చేసుకున్నాయి.
* మితవ్యయ శాస్త్రానికి సంబంధించిన ఫోల్డ్‌స్కోప్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ, భారతీయులకు చెందిన ప్రకాశ్‌ ల్యాబ్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఒప్పందానికి వచ్చాయి.
* భారత్‌తో పాటు, సిలికాన్‌ వ్యాలీలో వినూత్న టెక్నాలజీ సంస్థల ఏర్పాటుకు నాస్కామ్‌, ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ సహకరించుకోనున్నాయి.
* ఇంక్యుబేషన్‌తో పాటు పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకరించుకునేందుకు ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ (సీఐఐఈ), యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాకు చెందిన హాస్‌ బిజినెస్‌స్కూల్‌లోని లెస్టర్‌ సెంటర్‌ ఫర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
* పరిశుభ్ర సాంకేతికతను క్యాలిఫోర్నియా, భారత్‌ విపణులకు అందించేందుకు లాస్‌ ఏంజెలెస్‌ క్లీన్‌టెక్‌ ఇంక్యుబేటర్లతో సీఐఐఈ ఒప్పందం చేసుకుంది. ఈ రంగానికి చెందిన ప్రారంభ, విస్తరణ పథంలోని సంస్థలు భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది ఉపకరిస్తుంది.
* భారత ఔత్సాహికులకు సీడ్‌ఫండింగ్‌ అందించేందుకు ఉద్దేశించిన భారత్‌ఫండ్‌కు తగిన భాగస్వామిని అన్వేషించేందుకు టాటా ట్రస్ట్‌తో ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన సీఐఐఈ ఒప్పందం చేసుకుంది.
* సాంకేతిక, ప్రభావం చూపగల ఔత్సాహికులకు వూహాత్మక మద్దతు ఇచ్చేందుకు గూగుల్‌తో సీఐఐఈ ఒప్పందం కుదుర్చుకుంది.
తొలినాళ్లలో నాదీ స్టార్టప్‌ ప్రభుత్వమే: మోదీ
'ఇప్పుడు దిగ్గజ సంస్థలుగా ఎదిగినవన్నీ ఒకప్పుడు కొత్త కంపెనీలే. అంతెందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, దిల్లీలో ప్రధానమంత్రిగా దేశ బాధ్యతలను చేపట్టినప్పుడు నా ప్రభుత్వం కూడా అదే స్థితిలో ఉండేది. మీకు మాదిరే ఏడాది పాలనా కాలంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం' అంటూ భారత్‌-అమెరికాకు చెందిన కొత్త సంస్థల ప్రతినిధులకు మోదీ ఆసక్తికరంగా వివరించారు. 'ప్రభుత్వాలు, దేశ రాజధానులు కొత్త సంస్థలను ఎందుకు ప్రోత్సహించవని, నెమ్మదింప చేస్తున్నాయని మీరు ఆలోచిస్తుంటారు. ఒకప్పుడు వాషింగ్టన్‌ (అమెరికా రాజధాని) గురించి సిలికాన్‌ వ్యాలీలోని ఔత్సాహికులు భావించినట్లే, బెంగళూరులోని కొత్త సంస్థల ప్రారంభకులకు దిల్లీపై ఇదే తరహా ఆలోచన ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే యాప్‌లు ఇంకా రూపకల్పన జరగలేదనే మీరు భావిస్తుంటారు' అని మోదీ పేర్కొన్నారు. సవాలునే అవకాశంగా మలచుకోవాలని ఉద్బోధించారు. 'పెద్ద గాలి వీచినప్పుడు కిటికీ మూసుకోవాలని కొందరు ఆలోచిస్తే, పవన విద్యుత్తు తయారు చేయాలని మరికొందరు నిర్ణయించుకుంటారు. వినూత్న ఆవిష్కరణలకు ఇలాంటి ఆలోచనలే దోహదం' చేస్తాయి అని వివరించారు. 'వనరులను వినియోగించుకుంటూ ముందుకెళ్లే బదులు, ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటూ ఎదిగేందుకు ప్రయత్నించాలి' అని వారికి ఉద్బోధించారు. 'క్యాలిఫోర్నియా తీరంలోని సిలికాన్‌ వ్యాలీ మార్చినంతగా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మరో బృందం లేనే లేదు. ఇదే అమెరికాకు విజయం, ప్రపంచానికి స్ఫూర్తి కలిగించింది' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌లోనూ మార్పు, ఉద్యోగాల కల్పనకు వినూత్న స్టార్టప్‌లు ఏర్పాటవ్వాలనేదే తమ ప్రభత్వ లక్ష్యంగా వివరించారు.
Posted on 29 - 09 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning