ప్రతిభ ప్రదర్శిస్తే ఆర్థిక ఆసరా

అమెరికాలో ఉన్నత విద్య ఉత్తమ ప్రమాణాలతో ఉంటుంది కాబట్టి అక్కడ చదవటానికి అయ్యే ఖర్చు కూడా అధికమే. అందుకని అక్కడ చదువుకోవాలని అభిలషించేవారు ఆర్థిక సహాయం లభించే మార్గాలను తెలుసుకుని, అర్హత పొందేందుకు కృషి చేయాలి!
భారత్‌కు చెందిన ఓ విద్యార్థి 94% మార్కులు సంపాదించినా స్వదేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించలేకపోయాడు. కానీ ఇవే మార్కులతో అమెరికాలోని ఓ అత్యున్నత విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకోవడమే కాకుండా ఇరవైవేల డాలర్ల ఉపకారవేతనం కూడా పొందాడు. ఇదెలా సాధ్యమైంది? మన దగ్గర సీట్లు పరిమితం. పోటీ అత్యధికం. ఈ కారణంగా అత్యధిక మార్కులు వచ్చిన అనేకమందిలో సూక్ష్మ ఆధిక్యం ఉన్న కొద్దిమందే ప్రవేశం పొందుతున్నారు. ఎందరెందరో ప్రతిభావంతులు మంచి మార్కులు వచ్చి కూడా ఈ పోటీలో నిలవలేకపోతున్నారు. ఇటువంటివారికి యూఎస్‌ విశ్వవిద్యాలయాల్లో చక్కని గుర్తింపు, అంతకుమించిన గౌరవం దక్కుతున్నాయి.
భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో ఉన్నత విద్యాభ్యాసం ఖర్చుతో కూడుకున్నదే. జాతీయబ్యాంకుల నుంచి విద్యారుణాలు అందుబాటులోకి రావడంతో స్వల్పాదాయ వర్గాల విద్యార్థులు కూడా అమెరికా విద్యాఫలాలను అందుకోగలుగుతున్నారు. అమెరికాలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో ట్యూషన్‌ ఫీజుకే నలబైవేల డాలర్ల వరకు వెచ్చించాల్సివుంటుంది. పోటీ ఎక్కువే అయినా విదేశీ విద్యార్థుల ఖర్చును తగ్గించడానికి వీలుగా అమెరికా అనేక ఉపకార వేతనాలు, ఫెలోషిప్స్‌, అసిస్టెంట్‌షిప్స్‌ రూపంలో ఆర్థిక సహాయం చేస్తోంది.
ప్రత్యేక అర్హతలు అవసరమా?
అమెరికా వెళ్లడానికి ప్రత్యేక అర్హతలంటూ లేవు. ఆంగ్లభాషలో ప్రావీణ్యం, కొంత ప్రతిభ, అందుకు తగిన ఆర్థిక వనరులుంటే చాలు. అక్కడ కుల, మత భేదం లేకుండా విద్యాసంస్థల్లో ప్రవేశముంటుంది.
* కమ్యూనిటీ కళాశాలలు: వీటినే జూనియర్‌ కళాశాలలు/ రెండేళ్ల కళాశాలు అంటారు. అమెరికాలో ఇటువంటివి వందల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్టేట్‌ సపోర్ట్‌తోనే నడుస్తాయి. కొన్ని ప్రైవేటు/ స్వతంత్రంగా నడుస్తాయి. అసోసియేట్‌ డిగ్రీల వంటి కాలేజీ డిగ్రీలకు దారితీసే అకడమిక్‌ ప్రోగ్రాములతోపాటు ఈ కమ్యూనిటీ కళాశాలల్లో వృత్తివిద్యా కోర్సులు, సాంకేతిక శిక్షణ కూడా అందుబాటులో ఉంటుంది.
* పబ్లిక్‌ వర్సిటీలు: ఒక రాష్ట్రంలోని వారికి తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు కల్పించడానికి ఆ రాష్ట్రప్రభుత్వం ఏర్పరచి, ఆర్థిక వెసులుబాటు కల్పించే రాష్ట్ర కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పబ్లిక్‌ యూనివర్సిటీలు అంటారు.
అమెరికాలో విద్యాభ్యాసానికి ఇది తప్పనిసరి అవసరం. విదేశీ విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ వంటి పరీక్షలకు హాజరు కావాలనే నియమం ఇందులోని భాగమే. అమెరికా వెళ్లాలంటే, ముందు- వీసా ఇంటర్వ్యూలో ఆంగ్లంలో తన లక్ష్యాన్ని విద్యార్థి సరిగా చెప్పగలిగి ఉండాలి.
ఏది మంచి విద్యాసంస్థ?
అమెరికాలో ఏ విశ్వవిద్యాలయానికీ అమెరికా ప్రభుత్వం ర్యాంకులు ఇవ్వదు. టాప్‌-10, టాప్‌-100 విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ అనేవి స్వతంత్ర విశ్లేషకులు ఇచ్చినవి మాత్రమే. అయితే ఆ ర్యాంకులు ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది విద్యార్థులు గమనించుకోవడం కొంత ఉపకరించే అంశమే.
ఇక్కడ నాలుగు వేలకుపైగా గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలున్నాయి. వీటిలో మనకు అనువైనది ఎంచుకోవడం కోసం విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధమైన ఫీజు, ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధమైన జీవన వ్యయం ఉంటాయి. ఆయా విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశపరీక్షలూ వేర్వేరుగా ఉంటాయి.
అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఎస్‌ఈవీపీ అధీకృత విద్యాసంస్థల జాబితా లభిస్తుంది. ఇంకా gradschools.com, petersons.com, princetonreview.com, collegenet.com వంటి సైట్‌ల ద్వారా కూడా ఆయా విద్యాసంస్థల వివరాలు రాబట్టవచ్చు. అమెరికాలో తగిన విద్యాసంస్థను ఎంపిక చేసుకునేముందు గమనించాల్సింది- ఆ విద్యాసంస్థ విద్యా సంవత్సరం గురించి. కొన్ని తేడాలున్నా అమెరికా విద్యాసంస్థల విద్యాసంవత్సరం సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌ ఆరంభం నుంచి మే నెలాఖరు వరకు ఉంటుంది.
యూఎస్‌ డిగ్రీలు
అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీల్లో అసోసియేట్‌ డిగ్రీలు, బాచిలర్‌ డిగ్రీలు ఉంటాయి. వీటిలోనే సర్వసాధారణమైనవి- బాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) డిగ్రీలు. బ్యాచిలర్‌ స్థాయికి మించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తాయి మాస్టర్స్‌ డిగ్రీలు. వీటిలో అకడమిక్‌, ప్రొఫెషనల్‌ అనే రెండు రకాల డిగ్రీలు ప్రధానమైనవి. పీహెచ్‌డీ అనేది అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్‌ డిగ్రీ. దీన్ని పూర్తి చేయడానికి ఐదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుంది. ఎంఏ, ఎంఎస్‌లు మాత్రం రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ స్టడీ తరువాత లభిస్తాయి. ఎంబీఏ, ఎంఎడ్‌, ఎంఎఫ్‌ఏ, ఎంపీఏ, ఎంపీపీ, ఆర్కిటెక్చర్‌, అంతర్జాతీయ సంబంధాలు, జర్నలిజం వంటివి ప్రొఫెషనల్‌ మాస్టర్స్‌ డిగ్రీల కిందకు వస్తాయి.
సాయానికి అవకాశాలు
అమెరికాలో ఇంజినీరింగ్‌ కోర్సులు చేసే విదేశీ విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల నుంచి ఆర్థికసాయం లభిస్తుంది. ఏబీఈటీ (అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) సమాచారం ప్రకారం.. అమెరికాలో 350కి పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో బాచిలర్స్‌ డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి.
వీటిలో ఏదైనా కళాశాలను ఎంపిక చేసుకోవాలనుకునే విద్యార్థి మొదట ఆ కళాశాలకు ఏబీఈటీ గుర్తింపు గురించి, ఆ విద్యాసంస్థ ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ (ఆర్థిక సాయం) అందిస్తోందా అనే విషయాన్ని తెలుసుకోవాలి. కళాశాల బోర్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ హ్యాండ్‌బుక్‌ ఆయా కళాశాలల్లో విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి వ్యయం వివరాలనూ, అవి ఇవ్వగల ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ సమాచారాన్నీ తెలియజేస్తుంది.
ఏ కళాశాల ఎంత మొత్తంలో సాయం అందిస్తుందనేది ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ కేంద్రాల నుంచి కానీ, www.collegeboard.org నుంచి కానీ తెలుసుకోవచ్చు.
మాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ వంటి అంశాల్లో టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్స్‌ ద్వారా తమ మొదటి సంవత్సరానికి ఆర్థికసాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ విధమైన అసిస్టెంట్‌షిప్స్‌ వచ్చే అవకాశాలను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశోధించాలి.
అయితే ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ పొందడమనేది అంత తేలిక కాదు. భారత్‌ మొదలైన విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల మధ్య ఈ విషయంలో తీవ్ర పోటీ ఉంటుంది. ఆంగ్లంలో అత్యద్భుత ప్రతిభ ప్రదర్శించడంతోపాటు అత్యుత్తమ అకడమిక్‌ రికార్డును ప్రదర్శించగలగాలి. ఫైనాన్షియల్‌ ఎయిడ్‌తోపాటు అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఏటా నాలుగు వేల నుంచి ఐదు వేల డాలర్లకు మించని రిసెర్చ్‌ గ్రాంటులు, ఉపకార వేతనాలు కూడా లభించే అవకాశముంది.
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్‌లోని ఈ ఆర్థిక సహాయ వనరులను అందుకోవడానికి మొదటి నుంచి తమ అకడమిక్‌ రికార్డు అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవాలి. మంచి ఆంగ్లభాష ప్రావీణ్యాన్ని సంపాదించాలి. ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ (మాస్టర్స్‌)కి ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ సాధించుకోవడం.. శాస్త్ర విజ్ఞానరంగ అధ్యయనాలకు ఆర్థికసాయం పొందే తరహాలోనే ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ అధ్యయనాలకు ఫండింగ్‌ (యూనివర్సిటీ నిధులు) రావడమనేది ఆయా ప్రొఫెసర్లతో విద్యార్థులు జరిపే సంప్రదింపుల (కమ్యూనికేషన్‌)పై ఆధారపడి ఉంటుంది.
కొందరు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు మాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ వంటి అంశాల్లో టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్స్‌ ద్వారా తమ మొదటి సంవత్సరానికి ఆర్థికసాయాన్ని సంపాదించుకుంటారు. విద్యార్థులు ఈ విధమైన అసిస్టెంట్‌షిప్స్‌ వచ్చే అవకాశాలను కూడా క్షుణ్ణంగా పరిశోధించాలి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి విద్యార్థులకు లభించే సుమారు 500 ఉపకార వేతనాలు, గ్రాంట్లు, ఫెలోషిప్‌ల సమాచారంతో ఐఐఈ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌) ప్రచురించే పుస్తకం కూడా మన వాళ్లకి విలువైన సమాచారాన్ని ఇస్తుంది. మరిన్ని వివరాలను www.iiebooks.org వెబ్‌ సైట్‌లో తెలుసుకోవచ్చు.
Posted on 07 - 10 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning