ప్రాం'ఘన' నియామకాలు!

ఈనాడు-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఈ సారి ప్రాంగణ నియామకాల్లో వీరికి ప్రాధాన్యం పెరిగింది. గతేడాదితో పోల్చితే పది శాతం మేర ఉద్యోగ అవకాశాలు, జీతం అధికమిస్తూ సాఫ్ట్‌వేర్ సంస్థలు ముందుకొస్తున్నాయి. జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, విజయనగరం, ఆంధ్రా, కొన్ని ప్రయివేటు కళాశాలల్లో ఈ నియామకాలు త్వరలో ముగియనున్నాయి.
* జేఎన్‌టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో యూజీ, పీజీలో కలిపి 620 మంది విద్యార్థులుండగా టీసీఎస్ 305 మందిని, యాక్సెంచర్ 211 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసింది. క్యాప్‌జెమినీ 20 మందిని ఎంపిక చేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్ తెలిపారు.
* జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని విజయనగరం ఇంజినీరింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులకుగాను 81 మందిని టీసీఎస్ ఎంపికచేసింది.
* జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కశాలలో 337 మంది విద్యార్థులకుగాను 165 మందిని టీసీఎస్ ఎంపిక చేసింది. యాక్సెంచర్ ద్వారా నియామకాలు కూడా పలు దశల్లో ఉన్నాయి.
* ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో 1400 (యూజీ+పీజీ) మంది విద్యార్థులకుగాను 600 మంది ఎంపికయ్యారు. ఇన్ఫోఇస్ 280, విప్రో 150, ఐబీఎం 100, యాక్సెంచర్ వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.
* కృష్ణా జిల్లా విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లాల్లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ నియామకాలు ఆశాజనకంగానే జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మలివిడత జరిగే ప్రాంగణ నియామకాల్లో కోర్ కంపెనీలు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీలు పరిమితంగానే నియామకాలు జరిపి వార్షిక వేతనం కింద ఏడెనిమిది లక్షల రూపాయల్ని అందచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రాంగణ నియామకాల పర్యవేక్షకులు పేర్కొంటున్నారు.
ప్రతిభావంతులకు అధిక ప్రాధాన్యం
ఈ నియామకాల్లో టీసీఎస్ చేపట్టిన ఓ విధానానికి ప్రాధాన్యం చేకూరింది. టీసీఎస్ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకుని వారిలో అత్యంత ప్రతిభావంతులకు అధిక జీతం ఇస్తోంది. సాధారణ విద్యార్థులకు నాలుగు లక్షల దాకా ఇస్తే అత్యంత ప్రతిభావంతులకు ఏడు లక్షల దాకా ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే అత్యంత ప్రతిభావంతుల నియామకాలు తక్కువగానే ఉన్నాయని జేఎన్‌టీయూ కాకినాడ ప్రాంగణ నియామకాల పర్యవేక్షకులు డాక్టర్ లింగరాజు దుంపల 'ఈనాడుతో తెలిపారు. ఈ సంవత్సరం ప్రాంగణ నియామకాలు ఆశాజనకంగానే జరుగుతున్నాయని జేఎన్‌టీయూ అనంతపురం ఇంఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు పేర్కొన్నారు. రానున్న కాలంలో నియామకాల ప్రక్రియ మరింత వేగాన్ని అందుకోనుందని అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణ నియామకాల పర్యవేక్షకురాలు డాక్టర్ అరుణ మస్తనీ తెలిపారు.
తస్మాత్ జ్రాగత్త!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు వందలకుపైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ..ద్వితీయ శ్రేణి కింద గుర్తించిన కళాశాలల్లో మాత్రమే నియామకాలు జరుగుతున్నాయి. వీటి సంఖ్య స్వల్పంగానే ఉంది. ముఖ్యంగా రెండు బ్యాచుల ఉత్తీర్ణత శాతం, బోధకుల అర్హతలు, కోర్సుల నిర్వహణకు ఉన్న అక్రిడిటేషన్ ఇతర అంశాల్ని పరిగణనలోనికి తీసుకుని ప్రాంగణ నియామకాల కోసం సాఫ్ట్‌వేర్ సంస్థలు ముందుకొస్తున్నాయి. వీటికి దూరంగా ఉండే కళాశాలలు ఏపీలో కొదవలేదు. దీంతో..ఈ కళాశాలల వారే..ఆయా సంస్థల ప్రతినిధుల్ని పలుమార్లు కలిసి నియామకాలకు రావాలని అభ్యర్థిస్తున్నాయి. పలు కంపెనీల ప్రతినిధులు డబ్బులు తీసుకుని మరీ వస్తున్నట్లు తెలిసింది. అయితే..ఈ కంపెనీలు అతికొద్ది మందినీ మాత్రమే ఎంపికచేసినప్పటికీ ఆయా కళాశాలలు మాత్రం అధిక సంఖ్యలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఎంపికైన విద్యార్థుల నుంచి రెండు, మూడు నెలల జీతాన్ని ముందుగానే తీసుకుని వ్యయంచేసిన డబ్బును తిరిగి రాబట్టుకుంటున్నాయి.
నియామకాలే బోగస్!
కొన్ని కంపెనీల పేర్లతో అనధికారికంగా పలువురు విద్యావంతులు నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించి కళాశాలల యాజమాన్యాలనీ, విద్యార్థుల్ని మోసానికి గురిచేస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని విశ్వవిద్యాలయాల వర్గాలు సూచిస్తున్నాయి.
Posted on 15- 10 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning