ప్రాంగణ ఎంపికల్లో ఐటీ సంస్థలు నిమగ్నం

* ఈ ఏడాది 1.90 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు

* సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఎక్కువ ప్రాధాన్యం

టీ సంస్థల నియామకాల్లో అభ్యర్థి నైపుణ్యం, సంస్థ అవసరం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఖాతాదారుల ఆకాంక్షలకు మించి, ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఐటీ సంస్థలు నియామకాల్లో నిపుణులకు పెద్దపీట వేస్తున్నాయి. వచ్చే ఏడాది దేశీయంగా గిరాకీ పెరగడంతో పాటు విదేశీ ప్రాజెక్టులు కూడా అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి. అందుకే ప్రాంగణ నియామకాలతో పాటు ప్రాంగణేతర (ఆఫ్‌ క్యాంపస్‌) ఎంపికల్లో అనుకున్న దానికంటే కొంత అధికంగా తాజా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా విప్రో, కాగ్నిజెంట్‌, క్యాప్‌జెమినీ, ఐబీఎం, ఎన్‌టీటీ డేటా, వర్చ్యూసా వంటి దిగ్గజ ఐటీ సంస్థలు దేశవ్యాప్తంగా పేరొందిన విద్యాసంస్థల్లో ప్రాంగణ ఎంపికలు జరుపుతున్నాయి. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలో వీరిని ఎంపిక చేస్తున్నారు. వీరు ఉత్తీర్ణులయ్యాక శిక్షణానంతరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీరిని ఆయా సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఇప్పుడు ఎంపిక చేస్తున్న వారికి సగటున రూ.2.5-3.0 లక్షల వార్షిక వేతనాన్ని ఈ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయని సమాచారం. వచ్చే సంవత్సరం కోసం కళాశాల ప్రాంగణాల నుంచి 25,000 మందిని ఎంపిక చేసుకుంటామని టీసీఎస్‌ సీఈఓ చంద్రశేఖరన్‌, 16,000 మంది వరకు తీసుకుంటామని ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నారాయణమూర్తి ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన కంపెనీలు నియామక లక్ష్యాలను వెల్లడించకున్నా, ప్రాంగణాల్లో ఎంపికలు చేస్తున్నాయి. ఐటీ సంస్థల నిర్వహణ వ్యయంలో సిబ్బంది వేతనాలే అధికం. ఆయా సాంకేతిక అంశాల్లో పనిచేసిన అనుభవం ఉన్న నిపుణులకు అధిక వేతనం ఇవ్వాల్సి వస్తోంది. వీరితో పాటు తక్కువ వేతనాలకు లభించే కొత్తవారిని జతచేరిస్తే, నిర్వహణ వ్యయం కలిసి వస్తోంది. అందువల్లే ఏటా నియమించే సిబ్బందిలో 60 శాతం కొత్త అభ్యర్థులు ఉంటే, 40 శాతం మంది నిపుణులను తీసుకుంటారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అందరూ కలిపి 1.90 లక్షల మంది మందికి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వీరిలో 1.20 లక్షల మంది వరకు తాజా అభ్యర్థులే అని అంచనా.
ఈసారి నిష్పత్తి మారుతుందా?
వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ప్రస్తుతం విద్యా సంస్థల్లో ఐటీ సంస్థల అధికారులు ఎంపికలు జరుపుతున్నారు. ఇంజినీరింగ్‌ మొదటి 3 సంవత్సరాల్లో కనీసం 60 శాతం, అంతకుమించిన విద్యార్థులకు రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈసారి తాజా అభ్యర్థులు, నిపుణుల నిష్పత్తి 60:40 ఉంటుందా, లేక 50:50కి మారుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ప్రాంగణ ఎంపికల్లో నిమగ్నమైన ఐటీ సంస్థల ఉన్నతాధికారులు వివరించారు. అనుకోకుండా కొత్త ప్రాజెక్టు వచ్చినప్పుడు, అన్ని ప్రాంతాల అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు ప్రాంగణేతర (ఆఫ్‌క్యాంపస్‌) ఎంపికలూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 700 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలుంటే, అగ్రశ్రేణి సంస్థలన్నీ కలిపి ప్రాంగణ ఎంపికలకు 100 వరకు కళాళాశాలకే వెళ్తున్నాయి. మిగిలిన కళాశాలల అభ్యర్థులకు, కొన్నాళ్లు ఖాళీగా ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు ఆఫ్‌ క్యాంపస్‌ ఎంపికలు చేపడతామని టెక్‌మహీంద్రా, టీసీఎస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉండవచ్చని టీసీఎస్‌ అధికారి చెప్పారు. మొత్తం సిబ్బందిలో 10వ వంతు మందిని ఏటా ప్రాంగణాల్లో ఎంపిక చేస్తుంటారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టెక్‌మహీంద్రా ఉన్నతాధికారి ఒకరు 'ఈనాడు'తో చెప్పారు. 80,000 మంది సిబ్బంది ఉన్నందున, ఈ ఏడాది 8,000 మంది వరకు దేశవ్యాప్త కళాశాలల్లో ఎంపిక చేస్తారని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, విజయనగరంలోని జీఎంఆర్‌ ఐటీ కళాశాలలోనూ ఎంపికలు నిర్వహించినట్లు క్యాప్‌జెమినీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది 5,000 మందిని ప్రాంగణ, ఆఫ్‌క్యాంపస్‌ పద్ధతుల్లో ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆదిబట్లలో టీసీఎస్‌ కొత్త ప్రాంగణం సిద్ధం అవుతుండగా, ఇన్ఫోసిస్‌ పోచారం ప్రాంగణంలో సిబ్బందిని భారీగా పెంచనుంది.
ఈ విభాగాల్లో అవకాశాలెక్కువ
సామాజిక మాధ్యమాలు, మొబిలిటీ, డేటాసైన్సెస్‌, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో 2017 నాటికి దేశీయ ఐటీ సంస్థలు 107 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6,50,000 కోట్లు) వ్యాపారం చేస్తాయని అంచనా ఉందని టీసీఎస్‌ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ఐటీ సంస్థల పెట్టుబడులు ఈ విభాగాల్లోనే 70 శాతం ఉంటాయని వివరించారు. దేశీయంగా ఇ బిజినెస్‌, ఇ గవర్నెన్స్‌, మొబిలిటీ అప్లికేషన్లు, చిన్న-మధ్యస్థాయి సంస్థల (ఎస్‌ఎంఈ)కు ఐటీ సేవల వినియోగం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. రిమోట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, అస్సూరెన్స్‌ సర్వీసెస్‌ విభాగాల్లో వృద్ధి లభిస్తుందని చెప్పారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ విభాగాలతో పాటు సర్క్యూట్‌, నాన్‌ సర్క్యూట్‌ విభాగాల విద్యార్థులకూ అవకాశాలు లభిస్తాయని వివరించారు.

- ఈనాడు, హైదరాబాద్‌
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning