వృత్తిగత ప్రతిభకే ప్రాధాన్యం

* ప్రాంగణ నియామకాల్లో విజేతల మనోగతం
* ఏడాదికి రూ.32లక్షల వేతనం

హైదరాబాద్ (గచ్చిబౌలి): వారిద్దరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీకి వచ్చారు. ఏడాదిగా ఇక్కడే చదువుతున్నారు. నిన్న మొన్నటి వరకు వారి గురించి ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఇప్పుడు క్యాంపస్‌లో హీరోలుగా మారిపోయారు. అందుకు కారణం ఎంటెక్‌ చదువుతుండగానే ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి రూ.32 లక్షల వేతనంతో కూడిన ఉద్యోగాలకు ఎంపిక కావడం. జపాన్‌కు చెందిన ఐటీ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తా చాటారు. 24 ఏళ్లకే తిరుగులేని విజయం సాధించారు. వారే స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్సెస్‌లో ఎంటెక్‌(ఐటీ) చదువుతున్న అభిజిత్‌ పరబ్‌, ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్న రాబిన్‌ థామస్‌లు. ఈ సంస్థ వివిధ నగరాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలో హైదరాబాద్‌ నుంచి నలుగురు ఎంపిక కాగా అందులో హెచ్‌సీయూ నుంచి వీరిద్దరినీ ఉద్యోగాలు వరించాయి. ఈ సందర్భంగా న్యూస్‌టుడేతో మనోగతం పంచుకున్నారిలా.
* ప్రోగామింగ్‌లోపట్టు సాధించాలి - రాబిన్‌ థామస్‌
మాది కేరళలోని కోచి. నాన్న ఎం.థామస్‌ ఎరువుల కంపెనీలో అధికారి. అమ్మ టి.డి.థామస్‌ షిప్‌యార్డ్‌లో పనిచేస్తోంది. తమ్ముడు వైద్య విద్యార్థి. నేను బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేసిన తరువాత హెచ్‌సీయులో ఎంటెక్‌లో ప్రవేశం పొందాను. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరాను. నేను తొలి ఏడాది టాపర్‌గా నిలిచాను. అక్టోబర్ 6న క్యాంపస్‌లో ప్రాంగణ నియామకాలు జరిగాయి. అందులోనే నేను రెండు సంస్థలకు ఎంపికయ్యాను. ఒకటి హైదరాబాద్‌ సంస్థకాగా మరొకటి జపాన్‌ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. జపాన్‌ సంస్థలో ఏడాదికి రూ.32 లక్షల వేతనం ఇవ్వనుండడంతో అందులోనే చేరాలనుకున్నాను. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1న సింగపూర్‌లోని కంపెనీ శాఖలో చేరాల్సి ఉంది. కంప్యూటర్‌ రంగంలో ఉన్న వారు థియరీ చదివితే సరిపోదు. ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్‌లో మంచి పట్టు సాధించాలి. ప్రోగామింగ్‌, అల్గోరిథమ్స్‌ వాటిపై దృష్టి సారించాలి. ఇంటర్వ్యూల్లో మన ఆలోచనలను అర్థమయ్యేలా చెప్పగలగాలి.
* విద్యాంశంపైపరిజ్ఞానంతోనే విజయం - అభిజిత్‌ పరబ్‌
మాది గోవాలోని సియెలిమ్‌ గ్రామం. నాన్న అపా పరబ్‌ గోవా పోలీసుశాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌. అమ్మ శోభ గృహిణి. సోదరుడు వ్యాపారి. నేడు బీటెక్‌ పూర్తి చేసిన తరువాత రెండేళ్లు గోవాలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేశాను. ఎంటెక్‌ చదవాలనే ఆకాంక్షతో హెచ్‌సీయులో సీటు సాధించాను. అత్యాధునిక పరిజ్ఞానంతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలనేది నా లక్ష్యం. ప్రాంగణ నియామకం కోసం పెద్దగా సిద్ధం కాలేదు. సబ్జెక్ట్‌లో మంచి పరిజ్ఞానం ఉండటం వల్ల ఉద్యోగానికి ఎంపిక కాగలిగాను. ప్రోగ్రామింగ్‌ గురించి అవగాహన ఉండటంతో సంస్థ నిర్వహించిన రాత, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితం సాధించాను. ఇక్కడ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివిన చాలా మంది విద్యార్థులకు ప్రోగామింగ్‌లో అవగాహన ఉండటం లేదు. బీటెక్‌ స్థాయిలో దీనిపై అవగాహన ఉంటే మంచిది. మా కుటుంబంలో ఇంత మొత్తం వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికైన వాడిని నేనే. నాకు వచ్చే వేతనం ద్వారా కొంతైనా ఇతరులకు సహాయం చేయాలనేది నా ఉద్దేశం.
Posted on 25- 10 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning