లక్ష్య దిశగా సాగేదెలా?

గమ్యం అనేది స్పష్టంగా తెలియకుండా వేసే అడుగుల్లో తడబాటు, అయోమయం తప్పవు. ఇది విద్యాభ్యాసానికీ వర్తిస్తుంది. ఉన్నత లక్ష్యాలను తయారుచేసుకుని వాటికి తగ్గట్టుగా చదువు కొనసాగిస్తే అది ఫలవంతమవుతుంది. అదెలాగో చూద్దామా?
ఉన్నతవిద్య చదవటం అనేది లక్ష్యంగా ఉంటే.. తమ బ్రాంచిల్లో ఉన్నత విద్య స్పెషలైజేషన్లు, వాటిని అందిస్తున్న ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థలు, ప్రవేశానికి కావాల్సిన మార్కుల శాతం వంటివి తెలుసుకోవాలి.
విద్యార్థి దశలో మంచి భవిష్యత్తు కోసం లక్ష్యం ఏర్పరచుకోవడం, దాన్ని సాధించుకోడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం నేర్చుకోవాలి. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరముంది.
జీవితాశయాల పట్ల స్పష్టమైన అవగాహనకూ, విద్యాభ్యాసంలో నిర్దిష్టమైన ఫలితం సాధించడానికీ దోహదపడుతుంది లక్ష్యం. తాము ఏ అంశాల మీద శ్రద్ధ వహించాలో, ఇంకా వేటిని మెరుగులు దిద్దుకోవాలో తెలుస్తుంది. పైగా దీర్ఘకాలిక దృష్టికోణం స్వల్పకాలిక ప్రేరణను కలిగిస్తుంది. స్పష్టమైన- కొలబద్ధమైన లక్ష్యాలను సాధించిన విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాంటివారు తమ జీవితంలో విస్పష్టమైన పురోగతి అనుభూతిని పొందగలుగుతారు.
లక్ష్య సాధనకు విద్యార్థులు మూడు దశల్లో కృషి చేయాల్సివుంటుంది.
* మొదటి దశలో లక్ష్యాన్ని గుర్తించాలి. ఇది నిర్దిష్టమైనదిగా ఉండాలి. ఉదాహరణకు... 'బాగా చదవాలి' అనే లక్ష్యం మంచిదే అయినా... ఇందులో స్పష్టత లేదు. 'తరగతుల్లో విన్నదాన్ని ఇంటి దగ్గర మళ్ళీ చదివి, అసైన్‌మెంట్లను సాధించటం ద్వారా బాగా చదవాలి'. ఇలా పెట్టుకునే లక్ష్యంలో నిర్దిష్టతా, స్పష్టతా ఉన్నాయి.
* రెండో దశలో లక్ష్య సాధనకు అవసరమైన ఆచరణయోగ్యమైన ప్రణాళికను ఏర్పరచుకోవాలి. దీనిలో ఎలాంటి సందిగ్ధతలకూ తావు ఉండకూడదు. అవసరమైతే ప్రణాళికను అధ్యాపకులకో, అనుభవజ్ఞులకో చూపించి వారి ఆమోదం తీసుకోవచ్చు.
* చివరి దశలో లక్ష్యసాధనలో పురోగతిని తరచూ పరీక్షించుకోవాలి.
ఈ మూడు దశలనూ ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉదాహరణ ద్వారా చూద్దాం.
బీటెక్‌/బీఈ మొదటి సంవత్సరంలో ఒక విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాడనుకుందాం. మొదటి దశలో తన బ్రాంచికి సంబంధించి ఏయే ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలున్నాయో తెలుసుకోవాలి. ఆపైన ఈ సంస్థల్లో నియామకాలు ఏవిధంగా జరుగుతాయో గమనించాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హతలు ఏమిటో గ్రహించాలి. నియామక ప్రకటనలు ప్రతి సంవత్సరం వచ్చేవి అయితే లక్ష్యం సాధ్యమే. లేనిపక్షంలో లక్ష్యం కష్టసాధ్యమని తెలుసుకుని, తగిన మార్పులు చేసుకోవాల్సివుంటుంది.
ఉన్నతవిద్య చదవటం అనేది లక్ష్యంగా ఉంటే.. తమ బ్రాంచిల్లో ఉన్నత విద్యకు సంబంధించి లభిస్తున్న స్పెషలైజేషన్లు, వాటిని అందిస్తున్న ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థలు, వాటిలో ప్రవేశానికి కావాల్సిన మార్కుల శాతం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించాలి. దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి.
కావాల్సిన కనీస విద్యార్హత ఇంజినీరింగ్‌లో 60 శాతం అనుకుందాం. మొదటి దశలో లక్ష్యం- 60 శాతం మార్కులు సాధించాలన్నమాట. అయితే కావాల్సిన అర్హత 60 శాతం అయినపుడు 65-70 శాతం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో దశలో ప్రతి సంవత్సరం ఎంత శాతం మార్కులు తెచ్చుకోవాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మొదటి లక్ష్యం నాలుగు అంచెలుగా విడిపోయింది. మరో విధంగా చెప్పాలంటే... నాలుగు చిన్న లక్ష్యాల సంయుక్త లక్ష్యంగా మారింది.
మొదటి సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యంలో అంతర్గత మార్కులు ఎన్ని తెచ్చుకోవాలి, విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షల్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనేది నిర్ణయించుకోవాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా మార్కులు రావు. కొన్నిటిలో ఎక్కువా, కొన్నిటిలో తక్కువా వస్తాయని గ్రహించాలి. దాన్నిబట్టి సబ్జెక్టులవారీగా లక్ష్య నిర్ణయం చేసుకోవాలి.
రోజుకు ఏ సబ్జెక్టు ఎంత సమయం చదవాలి, ఇందులో పునశ్చరణకు ఎంత వ్యవధి కేటాయించాలి అన్నదీ స్పష్టంగా నిర్వచించుకోవాలి. ఈ స్థితిలో అధ్యాపకుల సహకారంతో ఈ ప్రణాళిక ఆచరణ ఆరంభించాలి.
మూడో దశలో ప్రణాళిక ఆచరణలో ఏవైనా లోపాలు, దిద్దుబాటు చర్యలు అవసరమైతే తగిన మార్పులు చెయ్యాలి.
తొలి విడత అంతర్గత పరీక్షల తర్వాత వచ్చిన మార్కుల సహాయంతో లక్ష్యానికి ఎంత దగ్గరలో ఉన్నదీ తెలుసుకోవాలి.
లక్ష్యం ఏర్పాటులో జాగ్రత్తలు
విద్యార్థి దశలో లక్ష్యం ఏర్పరచుకోవడం అనేది మొదటిసారయ్యే అవకాశం ఎక్కువ. తెలిసో తెలియకో, అనుభవ రాహిత్యం వల్లనో పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
* లక్ష్యాలను నకారాత్మక వాక్యాల్లో కాకుండా సకారాత్మక వాక్యాల రూపంలో నిర్వచించుకోవాలి. ఉదాహరణకు... ఆంగ్లభాషలో 'వ్యాకరణంలో తప్పులు చేయకూడదు' అనే వాక్యం కన్నా 'ఆంగ్ల వ్యాకరణం మెరుగుదిద్దుకోవాలి' అన్న వాక్యం ఎక్కువ ప్రభావశీలిగా ఉంటుంది.
* లక్ష్య నిర్వచనంలో, ప్రణాళిక తయారీలో కచ్చితత్వం పాటించాలి.
* ఏ సమయానికి ఏది చెయ్యాలో స్పష్టత ఉండేలా ప్రాముఖ్యతను సందిగ్ధం లేకుండా నిర్వచించుకోవాలి.
* స్వల్పకాలిక లక్ష్యాలను చిన్నవిగా, సూక్ష్మంగా, సాధించేందుకు వీలుగా ఉండేటట్లు నిర్వచించాలి.
ఉపకరించే మెలకువలు
* రెండు సబ్జెక్టులు చదవాలనుకుంటే... ఒకటి సులభంగా అనిపించేదీ, మరొకటి కష్టమనిపించేదీ ఉంటే మంచిది. అందులో మొదటిది ఎక్కువసేపూ, రెండోది తక్కువసేపూ చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. వారంలో రెండోసారి ఈ సబ్జెక్టులు చదివేటప్పుడు సమయం కేటాయింపు విరుద్ధంగా చెయ్యాలి. అప్పుడు సగటున ప్రతి సబ్జెక్టూ వారంలో రెండు సార్లు చదివితే అందులో ఎక్కువ నిడివి గల సమయం చదివేందుకూ, తక్కువ నిడివి సమయం పునశ్చరణకూ ఉపయోగపడతాయి.
* మధ్యమధ్యలో ఒకసారి మొత్తం ప్రణాళికను మదింపు చెయ్యాలి. అందులో సాధ్యాసాధ్యాల గురించి బేరీజు వేసి, తగిన మార్పులూ చేర్పులూ చెయ్యాలి.
* పురోగతికి అవరోధాలను ముందస్తుగా గుర్తించడానికి ప్రయత్నించాలి. అధిగమించడానికి వీలుపడని అవరోధాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అవసరమైతే ఇతరుల సహకారం తీసుకోవచ్చు.
* సన్నద్ధత కొనసాగించేటపుడు పరిపూర్ణత కంటే పురోగతికే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇలా చేస్తే చదువుల్లోనూ, పరీక్షల్లోనూ ముందుకు సాగటానికి వీలవుతుంది. శక్తియుక్తులను సక్రమ రీతిలో వినియోగించుకోవటం సాధ్యమవుతుంది. ఇంకా ఎక్కువ సాధించాలనే ప్రేరణ, ఉత్సాహం ఏర్పడతాయి. ప్రజ్ఞాపాటవాలు పెరిగి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.
సూచనలు ఇవీ..
స్థూల స్థాయిలో లక్ష్యం నిర్వచించుకోవాలి. అది నిర్దిష్టంగా, కొలబద్ధంగా, సాధించగలిగేదిగా, వాస్తవికంగా, సమయోచితంగా ఉండాలి. ఈ ఐదు లక్షణాలున్న లక్ష్యాన్ని ఆంగ్లంలో 'స్మార్ట్‌' అని వ్యవహరిస్తారు. (SMART- Specific, Measurable, Attainable, Realistic, Timely and Trackable)
* ఆ స్థూల లక్ష్యాన్ని కొన్ని స్వల్పకాలిక లక్ష్యాల సంయుక్తంగా తిరిగి నిర్వచించుకోవాలి.
* ప్రతి స్వల్పకాలిక లక్ష్యానికీ తగిన, ఆచరణయోగ్యమైన టైమ్‌ టేబుల్‌ చేసుకోవాలి. అవసరమైతే ప్రణాళికా పట్టికల రూపంలో తయారుచేసుకోవాలి. స్థిమితంగా, ఎక్కువ సమయం కేటాయించి ఇది చెయ్యాలి.
* ప్రణాళికా పట్టికలను ఆయా సమయాన్నీ, అవసరాన్నీ బట్టి కంటికి కనిపించేవిధంగా గోడ మీదనో, చదివే టేబుల్‌ దగ్గరో వేలాడతీసుకోవాలి.
* ప్రణాళిక ప్రకారం అభ్యాసాన్ని ఆచరణలో పెట్టాలి.
* ప్రతి వారాంతంలోనూ ఆచరణలోని పురోగతిని మదింపు చేసుకోవాలి.
* కావాలంటే స్టిక్కర్ల రూపంలో కూడా లక్ష్యాలను తయారుచేసుకోవచ్చు.
* మిత్రుల/ అధ్యాపకుల సహాయంతో తరచూ పురోగతిని పరీక్షించుకోవాలి.
* వీలైతే.. అదే లక్ష్యంతో ఉన్న మిత్రులతో కలిసి ఉమ్మడిగా లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* లక్ష్య నిర్దేశనం, సాధన నిరంతర ప్రక్రియలని గుర్తించాలి.
Posted on 27- 10 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning