బిజినెస్‌ స్కూళ్ల తీరు మారాలి..!

* మహిళలు తక్కువగా ఉంటున్నారు
* అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఉండాలి
* ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌

ముంబయి: ఎంబీఏ ప్రవేశ పరీక్షల్లో పరిమాణాత్మక సామర్థ్యం (క్యూఏ) పైనే అధిక ప్రశ్నలుంటున్నందున, బిజినెస్‌ స్కూళ్లకు యువతులు తక్కువగా ఎంపికవుతున్నారని ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) చందా కొచ్చర్‌ అన్నారు. అన్ని అంశాలలో సామర్థ్యాన్ని వెల్లడించేలా పరీక్షలు ఉండాలని, అప్పుడే ఎంబీఏ కోర్సుల్లో మహిళా శాతం పెరుగుతుందని తెలిపారు. బిజినెస్‌ స్కూళ్లలోని విద్యార్థుల్లో యువతులు 10-15 శాతమే ఉంటున్నారని ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఆమె అన్నారు. సాధారణ నిర్వహణ సామర్థ్యాలు అభివృద్ధి చేసే కోర్సులో చేరేందుకు క్యూఏపై అన్ని ప్రశ్నలు అనవసరం అని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలన్నింటిల్లో ఎక్కువగా క్యూఏ, డేటా వ్యాఖ్యానం, మౌఖిక సామర్థ్యం, తార్కిక హేతువుకు సంబంధించి ప్రశ్నలుంటూ, వాటి ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారని గుర్తు చేశారు. వాణిజ్య సంస్థల్లో మహిళా సిబ్బంది ఎక్కువగా ఉంటే, మంచి ఫలితాలు వస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల్లో సగం మంది మహిళలే కనుక, వారి అభిరుచుల్ని అంచనా వేసేలా సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో 35 శాతం ఆస్తులు కలిగిన సంస్థలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారని చందా కొచ్చర్‌ వివరించారు. అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగలిగే సామర్థ్యం కలిగిన మహిళల్లో 80 శాతం మంది సంఘటిత రంగాల్లో చేరడం లేదని పేర్కొంటూ, విధుల్లో అవసరమైతే ఎక్కువ దూరం ప్రయాణించడానికీ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. హస్తకళలు, కోరిన భోజనం తయారు చేసి అందించే విభాగాల్లో ఆన్‌లైన్‌ వ్యాపారానికి అవకాశాలున్నాయని తెలిపారు. సిబ్బంది భద్రత కోసం తాము తయారు చేసిన మొబైల్‌ యాప్‌ను ఏ కంపెనీ అయినా వినియోగించుకోవచ్చని తెలిపారు.
Posted on 03- 11 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning