మైక్రోసాఫ్ట్‌..మీ వెంటే!

* భవిష్య తరం సంస్థలకు సాయం
* ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ప్రారంభించాం
* బయోమెట్రిక్‌ రక్షణకు పరిశోధనలు
* మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల

ముంబయి: ఆకర్షణీయ (స్మార్ట్‌) నగరాలలో ఏర్పాటయ్యే భవిష్య తరం కొత్త కంపెనీలకు ఆర్థికసాయం చేస్తామని మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల తెలిపారు. దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం నెలకొందని ప్రశంసిస్తూ, వందల సంఖ్యలో సంస్థలకు సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 'భారత్‌లో అంతరాలు లేని భవిష్యత్తు' భావనతో మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తున్న ఖాతాదారుల సమావేశంలో సత్య నాదెళ్ల కీలక ప్రసంగం చేశారు. అనంతరం ఆయన విలేకరులతోనూ మాట్లాడారు. 'ప్రతి ఇంట్లో పర్సనల్‌ కంప్యూటర్‌ ఉండేలా చూడాలన్నది గతంలో మైక్రోసాఫ్ట్‌ లక్ష్యం కాగా.. దేశంలోని ప్రతి వ్యక్తి, వాణిజ్య సంస్థ, ప్రభుత్వసంస్థలు మరింత వృద్ధి సాధించేలా చూడటం ఇప్పటి ప్రణాళిక' అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఆయా అంశాలపై ఆయన ఏం అన్నారంటే..
ఇ-కామర్స్‌లో అపార అవకాశాలు
దేశంలో ఇ-కామర్స్‌ రంగం అనూహ్య వేగంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కొత్త సంస్థల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే, స్వాధీనం చేసుకునే ఆలోచనేమీ మైక్రోసాఫ్ట్‌కు లేనందున, ఆయా సంస్థల మదింపు విలువపై ఆందోళనేమీ లేదు. కానీ టెక్నాలజీ కొత్త సంస్థల ఏర్పాటుకు వినూత్న ఆలోచనలే ముఖ్యం. ఇ-కామర్స్‌ సంస్థలైన స్నాప్‌డీల్‌, పేటీఎం, జస్ట్‌ డయల్‌తో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వ్యాపారం పెంచుకునేందుకు అవకాశం ఉన్న కొత్త రంగాలు, కొత్త సేవలను వారికి పరిచయం చేయడంతో, ఆయా సంస్థల ఖాతాదారులకు క్లౌడ్‌ పద్ధతిలో మరింత మెరుగైన అనుభవం కలిగేలా చూస్తాం. ఇ కామర్స్‌ పోర్టళ్లను ప్లాట్‌ఫామ్‌గా చేసుకుని, ఉత్పత్తులను విక్రయిస్తున్న వారికి మరింత మేలు జరిగేలా చూడటమే మా లక్ష్యం.
ఆకర్షణీయ నగరాలకు సహకారం
'ఆకర్షణీయ నగరాలకు అనుబంధంగా నెలకొల్పే కొత్త కంపెనీల కోసం ప్రత్యేక క్లౌడ్‌ పథకాన్ని' మైక్రోసాఫ్ట్‌ చేపడుతుంది. రూ.80 లక్షల విలువైన అజ్యూర్‌ కంప్యూటింగ్‌ (క్లౌడ్‌) సేవలను ఒక్కో సంస్థకు అందివ్వాలన్నది మా ప్రణాళిక. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలతో పాటు భవిష్యత్తు నగరాలకు అవసరమైన సొల్యూషన్లు అందించే సంస్థలకు ఈ క్లౌడ్‌ సేవలు అందిస్తాం. ఇందువల్ల ఆకర్షణీయ నగరాలు త్వరగా సాకారమవుతాయి. వచ్చే ఏడాది 50 ఆకర్షణీయ నగరాలలో 50 కొత్త, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల తయారీ - విక్రయ సంస్థలకు ఇలా సాయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ తరహా ప్రయోగాత్మక ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. ముంబయి, చెన్నై, పుణెలలోని డేటా కేంద్రాల ద్వారా దేశంలో క్లౌడ్‌ సేవలు ప్రారంభించి ఏడాది అయ్యింది. ఇక్కడ స్పందన బాగా ఉంది. యాప్‌ డెవలపర్లు కూడా ఎంత వినూత్నంగా ఉంటారో చూడాలి. సంగీతం కంపోజింగ్‌లో డెవలపర్‌ అయిన స్టాఫ్‌ప్యాడ్‌ ఎంతటి మార్పు తెచ్చిందో తెలుసా. ఏఆర్‌ రెహమాన్‌ దీనినే వాడతారు.
పాస్‌వర్డ్‌ లేని ప్రపంచం దిశగా..
ఇ మెయిల్‌, సామాజిక మాధ్యమం, మొబైల్‌ఫోన్‌.. వంటివి హ్యాక్‌ అవుతున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వీటికి పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నా, హ్యాకర్లు వాటిని అధిగమించి నష్టం చేకూరుస్తున్నారు. అంకెలు, గుర్తులు, అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్‌ల స్థానంలో వేలిముద్ర తరహా (బయోమెట్రిక్స్‌) భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయగలిగితే, మన ప్రమేయం లేకుండా వేరే వ్యక్తి మన పరికరాల్లోకి చొరబడే వీలుండదు. ఈ దిశగా మైక్రోసాఫ్ట్‌ పరిశోధనలు సాగిస్తోంది. మారుతున్న ప్రపంచం, సాంకేతికతకు అనుగుణంగా ఉత్పాదకత, వ్యాపార కార్యకలాపాల తీరు మార్చాలనేది మైక్రోసాఫ్ట్‌ ప్రణాళిక. పని అంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి చేసేది కాదు. ఎక్కడ ఉండైనా, ఏదో ఒక విషయాన్ని నిర్వహించే, మరింత మెరుగ్గా రాణించేలా చేయడమే. ఇందుకనుగుణంగా ఇంటెలిజెంట్‌ క్లౌడ్‌ రూపొందిస్తున్నాం.
డిజిటల్‌ టూల్స్‌తో మెరుగైన ఉత్పాదకత..
నాయకత్వ బాధ్యతల్లోని వారు నిర్ణయాలు తీసుకునేందుకు, అధిక ఉత్పాదకతకు డిజిటల్‌ టూల్స్‌ వాడాలి. ఫోన్‌ అంటే కేవలం యాప్స్‌ను వినియోగించడం కాదు. పూర్తిస్థాయి కంప్యూటర్‌ అనుభవం దక్కేలా చూస్తాం. రాబోయే 10 ఏళ్లలో జీవితంలో కంప్యూటింగ్‌ మరింత పెరుగుతుంది.
Posted on 06- 11 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning