ఉత్తమ ఆలోచనలకు అంకురార్పణ..!

* సత్తా చాటేందుకు యువత సిద్ధం కావాలి
* టీహబ్‌ ప్రారంభోత్సవంలో టాటా సంస్థల మాజీ అధినేత రతన్‌టాటా
* గ్రామీణ యువత నైపుణ్యాన్ని గుర్తించాలన్న గవర్నర్‌
* దేశానికి ఇది ఆవిష్కరణల కేంద్రం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంకుర పరిశ్రమ (స్టార్టప్‌)లు భవిష్యత్‌ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పనిచేయడానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉత్తమ ఆలోచనలకు టీ -హబ్‌ సరైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. న‌వంబ‌ర్ 5న‌ హైదరాబాద్‌ ఐఐఐటీ ఆవరణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద ఇంక్యూబేటర్‌ టీ -హబ్‌ను గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో కలసి రతన్‌టాటా ప్రారంభించారు. అనంతరం రతన్‌టాటా మాట్లాడుతూ... దేశంలో వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌, స్టెమ్‌సెల్‌ వంటి వాటిపై పరిశోధనలు అత్యంత కీలకమన్నారు. మొండి వ్యాధులను నయంచేసే ఆవిష్కరణల అవసరం చాలా ఉందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినంత మాత్రాన.. పాతవి నిరర్థకం కాబోవన్నారు. నవభారత నిర్మాణ కలలు సాకారమయ్యేందుకు యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దోహదపడాలని, అందుకు నిరంతర ప్రోత్సాహం ఉంటుందన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ... నూతన ఒరవడికి టీ -హబ్‌ నాందిగా నిలవాలని, లక్ష్యసాధనలో విజయం సాధించాలని, ఇక్కడ జరిగే ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ యువత నైపుణ్యాలకు వెలుగునిచ్చేలా దృష్టి సారించాల్సి ఉందన్నారు. టీ -హబ్‌ ఏర్పాటుకు కృషిచేసిన కేటీఆర్‌... ఇతర శాఖల్లోనూ ఇలాంటి ఆవిష్కరణలు జరిగేలా సహచర మంత్రులతో చర్చించాలన్నారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు.
దేశ స్టార్టప్‌ల రాజధానిగా హైదరాబాద్‌... మంత్రి కేటీఆర్‌: దేశంలో స్టార్టప్‌ల రాజధానిగా హైదరాబాద్‌ను నిలపాలన్న సమోన్నత లక్ష్యంలో భాగంగానే టీ -హబ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే వేదిక కాదని, దేశంలోని యువత ఆలోచనలకు కార్యరూపమిచ్చే వేదికని వివరించారు. మరో రెండేళ్లలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండోదశ టీ -హబ్‌ను నిర్మిస్తామన్నారు. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు యువ భారత్‌ సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారని... వారి ఆశయాలకు రెక్కలిచ్చి ప్రపంచంతో పోటీ పడేందుకు యువత సిద్ధమవుతోందన్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని స్టార్టప్‌ సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో 'ఇన్నోవేషన్‌ పాలసీ'ని తీసుకొస్తుందని, ఇది అంకుర పరిశ్రమలకు వూతమిచ్చేలా ఉంటుందన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల డిసెంబరులో హైదరాబాద్‌కు వస్తారని, ఆయనను టీ -హబ్‌కు తీసుకొస్తామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
నాస్కాం ఛైర్మన్‌ బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... టీ -హబ్‌కు తాము తోడ్పాటును అందిస్తామన్నారు. పదివేల అంకుర పరిశ్రమలను స్థాపించే లక్ష్యంలో భాగంగా, టీ -హబ్‌ను నాస్కాం వినియోగించుకుంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ... ఆలోచలను ఆవిష్కరణలుగా మార్చేలా వివిధ సంస్థల సమన్వయంతో ముందుకెళ్లేందుకు టీ -హబ్‌ దోహదపడుతుందన్నారు. టీ -హబ్‌ ప్రారంభోత్సవం అనంతరం స్టార్టప్‌ సంస్థల భాగస్వాములతో రతన్‌టాటా ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశంలో మత అసహనం పారిశ్రామిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా ప్రశ్న అడగ్గా... ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే, భారతదేశం శతాబ్దాలుగా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందనీ, భిన్న మతాలకు చెందినవారు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగాలన్నారు. స్టార్టప్‌ సంస్థల్లో ఎక్కువ శాతం విజయవంతం కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... చిత్తశుద్ధిపైనే విజయం ఆధారపడి ఉంటుందన్నారు.
Posted on 06- 11 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning