నియామకాల్లో నెగ్గేదెలా?

ఇప్పటికే కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రాంగణ నియామకాలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఉద్యోగాలు సాధించాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆశావహ దృక్పథంతో కొన్ని మెలకువలు పాటించాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతారు!
'ఒక్కోసారి.. ఏ సబ్జెక్టు అంటే ఎక్కువ ఇష్టం? అన్న ప్రశ్నకు సమాధానమివ్వడం కష్టం. ఇప్పటివరకూ ఆలోచించకపోతే, ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకు ఆ సబ్జెక్టు/ కోర్సు ఇష్టమో కూడా చెప్పగలిగి ఉండాలి.'
ఆఖరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కళాశాల నుంచి డిగ్రీ తీసుకునే లోపలే వారికి తగిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. ప్రతి సంస్థా తమకు కావాల్సిన నైపుణ్యాలు విద్యార్థులకు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి రాతపరీక్ష విధానాన్ని అవలంబిస్తుంది. రాతపరీక్షలో విజయం సాధిస్తే, తర్వాతి దశ ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ రెండు అంచెలనూ సరిగా ఎదుర్కోవడానికి కృషి చేయాలి.
చాలా సందర్భాల్లో ఉద్యోగావకాశాలు లేక కాదు, కావాల్సిన నైపుణ్యాలు లేక అభ్యర్థులు ఉద్యోగం సాధించలేకపోవడం గమనార్హం. ఎక్కువమంది విద్యార్థులు ఈ కింది అంశాల్లో సందేహాలను వ్యక్తం చేయడం గమనించవచ్చు.
మొదటి మెట్టు: అర్హతలు
* తగిన మార్కులు: ప్రతి సంస్థకూ మార్కుల విషయంలో కొన్ని నిబంధనలుంటాయి. విద్యార్థులకు వారు చదివే కోర్సు/ బ్రాంచిలో కనీసం 60% మార్కులు వచ్చుండాలి. మరికొన్ని సందర్భాల్లో సంస్థలు కనీసం 60% మార్కులు ఉన్నవారినే రాతపరీక్ష రాయడానికి అనుమతిస్తాయి. ప్రతి విద్యార్థీ ఈ కనీస మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.
* బ్యాక్‌లాగ్‌లు: సబ్జెక్టులు మిగిలిపోయుంటే వాటిని త్వరగా పూర్తిచేసుకోవాలి. కొన్ని సంస్థలు బ్యాక్‌లాగ్‌లు ఉన్నవారిని రాతపరీక్షకు అనుమతించవు. ఇంకొన్ని సంస్థలు ఒకటి/ రెండు బ్యాక్‌లాగ్‌లు ఉన్నా, తమ రిక్రూట్‌మెంట్‌ పద్ధతులను అనుసరించి అనుమతిస్తాయి.
రెండో మెట్టు: రాతపరీక్ష
రాతపరీక్షను రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్‌, టెక్నికల్‌ పరీక్షలు.
* ఆప్టిట్యూడ్‌ రాతపరీక్ష: చాలామంది విద్యార్థులు ఈ రాతపరీక్షలో విఫలమవుతుంటారు. చాలావరకు సంస్థలు రాతపరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా నిర్వహిస్తాయి. ఆన్‌లైన్‌ పద్ధతిలో సాధన చేయడం ఎంతో అవసరం. దీనివల్ల సరైన సమయంలో రాతపరీక్షలో ఉత్తీర్ణత పొందే అవకాశాలు మెరుగవుతాయి.
* టెక్నికల్‌ పరీక్ష: విద్యార్థులు దీనిలో ఉత్తీర్ణత సాధించడం చాలా అవసరం. ఇటీవల చాలా సంస్థలు టెక్నికల్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తున్నాయి. దీనిలో తగిన మార్కులు రాకపోతే ఇంటర్వ్యూ దశను చేరుకోవడం చాలా కష్టం.
మూడో మెట్టు: మౌఖిక పరీక్ష
* టెక్నికల్‌ ఇంటర్వ్యూ: విద్యార్థుల సబ్జెక్టు/ బ్రాంచిని బట్టి సాంకేతిక సంబంధ ప్రశ్నలు అడుగుతారు. మొదటి సంవత్సరం నుంచి మూడు/ నాలుగు సంవత్సరాల్లో చదివినవి మరచిపోకుండా సాధన చేయాలి. టెక్నికల్‌ సంబంధిత ప్రాజెక్టు ఏదైనా ఉంటే ఈ ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది.
* హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ: టెక్నికల్‌ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత పొందిన వెంటనే సాఫ్ట్‌స్కిల్స్‌ మీద, విద్యార్థులు సంస్థ విలువలకు, నియమాలకు కట్టుబడి ఉంటారా లేదా అని హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో ప్రవర్తనా సంబంధిత ప్రశ్నలు వేస్తారు. ఇలాంటివాటికి సమాధానాలు రిక్రూటర్లు ఆశించేవిధంగా ఇవ్వాలంటే ఎంతో సాధన అవసరం.
పైన చెప్పిన ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సాధన చేయాలి. తమకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లో ఉద్యోగం రాదని భావించేవారు కూడా తగినవిధంగా సాధన చేస్తే ఫలితం లభిస్తుంది.
ఎలా సిద్ధమవాలి?
* కింది ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి: ఎటువంటి సంస్థలు మీ కళాశాలకు ప్రాంగణ నియామకాల నిమిత్తం వస్తాయి? వాటి పరీక్ష విధానాలు ఎలా ఉంటాయి? ఆయా సంస్థల నియామక పద్ధతులెలా ఉంటాయి? ఆ సంస్థకు సంబంధించిన గత ఏడాది ప్రశ్నలు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయా? ఆయా సంస్థలకు కావాల్సిన అర్హతలేంటి? ఈ అర్హతలన్నీ మీలో ఉన్నాయా? ఉంటే ఎలా సిద్ధమవాలి? లేకపోతే ఏం చేయాలి?
* సబ్జెక్టుల మీద అవగాహనతో పాటు పట్టు సాధించాలి. మొదటి సంవత్సరం నుంచి ఇప్పటివరకు చదివిన సబ్జెక్టులన్నింటి మీదా దృష్టి సారించాలి.
* ఆసక్తి ఉన్న సబ్జెక్టు: ఒక్కోసారి ఏ సబ్జెక్టు అంటే ఎక్కువ ఇష్టం? అన్న ప్రశ్నకు సమాధానమివ్వడం కష్టం. ఇప్పటివరకూ ఆలోచించకపోతే, ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకు ఆ సబ్జెక్టు/ కోర్సు ఇష్టమో కూడా చెప్పగలిగి ఉండాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఇష్టమైన సబ్జెక్టు మీద అడిగే అవకాశాలు ఎక్కువ.
* రాతపరీక్ష సాధన: ఆప్టిట్యూడ్‌, టెక్నికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి రెండు నుంచి మూడు నెలలు ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో సాధన చేయాలి.
* రెజ్యూమే/ బయోడేటా తయారీ: బయోడేటా అన్నది ముఖ్యాంశం. చాలావరకు ప్రశ్నలు విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ లేదా ప్రాజెక్టు మీద ఉంటాయి. చేసిన ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్‌ వివరాలను రెజ్యూమేలో స్పష్టంగా రాయగలిగి ఉండాలి.
* ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనే విషయాలు తెలియడం అవసరం. ప్రశ్నలు సులభంగా అనిపించవచ్చు కానీ వాటికి తగిన, ఆశించినవిధంగా బదులివ్వడం అంత సులభం కాదు. ఉదాహరణకు: ీమీ గురించి చెప్పండి? ఈ ఉద్యోగం మీకెందుకివ్వాలి? ఈ ఉద్యోగానికి మీరు అర్హులని భావిస్తున్నారా?' వంటి ప్రశ్నలు వినడానికి చాలా సులువుగా ఉంటాయి. కానీ, ఆలోచిస్తే సమాధానమివ్వడం అంత తేలిక కాదు.
* భావప్రసరణ నైపుణ్యాలు: ఎంత సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నా, ఎన్ని రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఆశించిన విధంగా భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌) నైపుణ్యాలు లేకపోతే చేసిన సాధన, శ్రమ అంతా వృథా అవుతుంది. మంచి ఉచ్చారణతో, స్పష్టతతో సమాధానాలివ్వడం ఎంతో అవసరం.

పైన చెప్పిన అంశాలన్నీ గమనించి సాధన చేసి సమాధానాలు ఇస్తే నియామక సంస్థల ప్రతినిధులకు ఆ అభ్యర్థులపై అనుకూలాభిప్రాయం ఏర్పడుతుంది. ఈ మెలకువలు ఒక వారమో, పది రోజులో నేర్చుకునేవి కావు. శ్రద్ధతో ఏడాది పొడవునా ప్రతి ఒక్క అంశంపై సాధన చేసి పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచే పైన చెప్పిన అంశాలపై దృష్టిపెడితే ఉద్యోగ వేటలో సఫలమయ్యే అవకాశాలు మెరుగవుతాయి.
Posted on 09- 11 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning