ఏడేళ్లలో 46 లక్షల ఉద్యోగాలు!

* 'ఎలక్ట్రానిక్స్‌'లో నిపుణులకు గిరాకీ
* మరమ్మతు, నిర్వహణలోనే అధికం
* శిక్షణపై పరిశ్రమ దృష్టి
ఈనాడు - హైదరాబాద్‌: మొబైల్‌ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను విరివిగా వినియోగించడంతోపాటు గృహోపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని వస్తువుల్లో ఎలక్ట్రానిక్స్‌ వినియోగం భారీగా పెరుగుతున్నందున ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ, మరమ్మతు, ఉత్పత్తుల మార్కెటింగ్‌ వంటి రంగాల్లో భారీగా నిపుణులు అవసరం కానున్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో వివిధ ప్రత్యేక విభాగాల్లో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే వీలుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 43 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌, తయారీలో 14.5 లక్షల మంది, అమ్మకాలు, మార్కెటింగ్‌లో 15.8 లక్షలు, మరమ్మతు, ఇన్‌స్టలేషన్‌, నిర్వహణ (మెయింటినెన్స్‌) విభాగంలో 13 లక్షల మంది ఉన్నట్లు అంచనా. 2022 నాటికి మొత్తం (ఇప్పుడున్న వారితో కలిపి) 89.4 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) భావిస్తోంది. ఇందులో మరమ్మతు, బిగింపు (ఇన్‌స్టలేషన్‌), నిర్వహణ (మెయింటినెన్స్‌)కే 35.4 లక్షల మంది నిపుణులు అవసరం అయ్యే వీలుంది. ప్రస్తుతం ఈ విభాగంలో 13 లక్షల మంది ఉన్నారు. వీరు కాక వచ్చే ఏడేళ్లలో 22.4 లక్షల మంది నిపుణులు ఈ విభాగంలో అవసరం కానున్నారు. ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ అండ్‌ తయారీలో అదనంగా 6.1 లక్షల మంది, అమ్మకాలు, మార్కెటింగ్‌ విభాగంలో అదనంగా 17.6 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుంది. మొత్తం మీద వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ , ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో 46.1 లక్షల నిపుణులకు గిరాకీ ఉందని అంచనా. సమీప భవిష్యత్తులో దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించగల కీలక రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌ రంగం ఒకటి కానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మారుతున్న పరిశ్రమ
సిస్టమ్‌ ఇంటిగ్రేటర్‌ వంటి ప్రత్యేక ఉద్యోగాలకు నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. వాహన, వైద్య ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు పెరుగుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్లు, డీటీహెచ్‌ విభాగాల్లో కూడా మానవ వనరుల అవసరం బాగా ఉంది. ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), కోల్‌కతా వంటి నగరాల్లో జీవన వ్యయం అధికంగా ఉన్నందున గ్రామీణ, చిన్న పట్టణాలలోని యువత ఈ నగరాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు పెద్ద సవాలుగా ఉంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు రావడంతో ఎలక్ట్రానిక్స్‌, నెట్‌వర్కింగ్‌ విభాగాల్లో మానవ వనరుల అవసరాల్లో భారీ మార్పులు వచ్చాయి. కొత్త నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలు పుట్టుకు వస్తున్నాయి.
బడి మానేసిన వారికి శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాఠశాల, కళాశాల మానేసిన విద్యార్థులకు ఎల్‌ఈడీ, తెరల తయారీ, మరమ్మతు, సీసీటీవీలు, నిఘా వ్యవస్థల బిగింపు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల తయారీ వంటి వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్‌ రంగ స్కిల్‌ కౌన్సిల్‌ నడుం బిగించింది. శిక్షణలో భాగంగా 10 శాతం శిక్షణను తరగతి గదుల్లో 90 శాతం శిక్షణను ఆయా పరిశ్రమల్లో ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించి బడి మానేసిన విద్యుర్థులను గుర్తిస్తే వారికి సెక్టర్‌ కౌన్సిల్‌ శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇస్తుందని మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మెయిట్‌) దక్షిణ ప్రాంత అధిపతి ఎస్‌.జయరాజ్‌ తెలిపారు. కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 25,000 మందికి ఈ విధంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడానికి లేదా సొంతంగా యూనిట్‌ స్థాపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి కూడా పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో ఈ విధంగా 15 లక్షల మందికి ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.24 లక్షల కోట్లకు విపణి:
అయిదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌ విపణి విలువ రూ.24 లక్షల కోట్లకు చేరగలదని అంచనా. ప్రస్తుతం ఇది రూ.6 లక్షల కోట్లు ఉండగా.. ఇందులో రూ.2,16,000 కోట్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు ప్రధానంగా వ్యాపారం లభిస్తోంది. నేషనల్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వంటి ప్రాజెక్టులు రానున్న కాలంలో ఎలక్ట్రానిక్స్‌ గిరాకీని బాగా పెంచనున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు, గృహోపకరణాలు, అత్యాధునిక సదుపాయాల కార్లు మొదలైనవి కూడా ఎలక్ట్రానిక్స్‌ వాడకాన్ని పెంచుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ పథకం, ప్రిఫరెన్షియల్‌ మార్కెట్‌ యాక్సెస్‌ పథకం వంటి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది.
Posted on 04- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning