దారి చూపే దార్శనికత!

* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రపంచవేదిక ఏర్పాటుచేసిన యువకుడు
ఈనాడు, హైదరాబాద్‌: రోజుకో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది.. శాస్త్ర సాంకేతిక రంగం కొంగొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న పరిణామాలకనుగుణంగా వివిధ అంశాలపై క్షుణ్ణంగా అవగాహన ఉంటేనే విద్యార్థులకు ఉపాధి మార్గం మరింత సులువవుతుంది. అటు పుస్తకాలతో విద్య, విజ్ఞానం సముపార్జించడంతోపాటు ఇటు అంతర్జాలంపైనా పట్టు అవసరమంటోంది నేటి యువత. అందుకు తగ్గట్లే ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి వారిని ఉపాధిబాట పట్టించేందుకు 'ఇంజినీర్స్‌ హబ్‌'ను ఏర్పాటుచేశామంటున్నాడు నగరానికి చెందిన మనోజ్‌. 19 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించిన ఈ కుర్రాడు ఇప్పుడు ఫేస్‌బుక్‌, లింగ్‌డిన్‌ వంటి సామాజిక వెబ్‌సైట్ల లానే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడే మివో సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించిన మనోజ్‌రాజ్‌ 2011లో ఓ బ్లాగ్‌ రూపొందించాడు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు దిశానిర్దేశం చేసే దీనిని జనవరిలో స్టార్టప్‌గా మార్చాడు. 2016 ఏప్రిల్‌లో ఆ వెబ్‌సైట్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌గా తీర్చిదిద్ది ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ ఓ వేదికలా తయారుచేస్తానని చెబుతున్నాడు. 'ప్రస్తుతం ప్రతి విద్యార్థి తన సీనియర్ల సూచనలు పాటిస్తూ మూసధోరణిలో ముందుకు వెళ్తున్నాడు. కొంతవరకు వారి సలహాలు, సూచనలు ఉపయోగపడినా కొత్తగా ఆలోచించి, భిన్నమైన మార్గంలో గమ్యాన్ని చేరుకునేందుకు ఆస్కారం ఉండదు. నడుస్తోన్న సాంకేతిక వ్యవస్థతో విద్యార్థులు చేయి కలిపితేనే ఉజ్వల భవిష్యత్తు. అలాంటి మార్గం చూపించేందుకు ఈ హబ్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం శ్రీరాగ్‌, హర్షవర్ధన్‌, అనిష, తరుణ్‌, అక్షయలతోపాటు 29మంది పనిచేస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నా...' అని మనోజ్‌ చెప్పుకొచ్చారు.
అనుభవ పాఠాలు
ఏటా లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులవుతున్నారు. ఆశించిన కొలువులు రాక, వచ్చిన ఉద్యోగంలో స్థిరపడలేక వేలాదిమంది నానాఅవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం.. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం లోపించడమే అన్నది వీరి అభిప్రాయం. అనేక కళాశాలల్లో నాణ్యమైన విద్య కొరవడిందని.. ఇలాంటి సమయంలో విద్యార్థులకు కావల్సింది జీవితాన్ని మార్చే అనుభవ పాఠాలు, నిపుణులైన ఆచార్యుల సలహాలని చెబుతున్నారు.
ఆచార్యులు, విద్యార్థులకు వారధి
2011లో రూపుదిద్దుకున్న ఇంజినీర్స్‌హబ్‌ విద్యార్థులు, ఆచార్యులకు మధ్య వారధి నిర్మించింది. అందులో సాంకేతిక అంశాలు, ప్రయోగాలతో కూడిన పాఠాలు, మెటీరియల్‌ ఉన్నాయి. ఆయా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సిలబస్‌ను పొందుపరిచారు. మూడంచెలుగా ఉండే వెబ్‌సైట్‌లో మొదటిదశగా సిలబస్‌ అంశాన్ని పూర్తిచేశామని, నగరంలోని సుమారు 20 కళాశాలలతో ఒప్పందం కుదుర్చుకుని 'ఓపెన్‌ కమ్యునిటీ'ని ఏర్పాటుచేశామన్నారు. సాంకేతిక విద్యార్థులకు అవసరమయ్యే స్టార్టప్‌లు, ప్రదర్శనలు, సదస్సులు ఏ ప్రాంతంలో జరుగుతున్నా విద్యార్థులకు చేరవేస్తామని, వారు ఇతరులకు తెలుపుతారన్నారు.
ప్రముఖులతో కార్యక్రమాలు - మనోజ్‌రాజ్‌, ఇంజినీర్స్‌ హబ్‌ వ్యవస్థాపకుడు
విద్యావేత్తలు, వ్యాపారవేత్తలతో ఎక్స్‌పర్ట్‌షో ఏర్పాటుచేస్తున్నాం. ప్రతినెలా ఇంజినీరింగ్‌ రంగంలో రాణించిన ప్రముఖులతో ఏర్పాటయ్యే ఈ కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖుల అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. తిరిగి అవే వీడియోలను యూట్యూబ్‌లోనూ ఉంచుతున్నాం. అంతేకాదు పలువురు విద్యార్థులకు కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, స్టార్టప్‌ సంస్కృతి గురించి తెలియజేస్తున్నాం. దాంతో సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు నైపుణ్యాలను పెంచుకుంటున్నారు.
Posted on 12- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning