ఏ చదువైనా లక్ష్యం ఉద్యోగమే!

* ఇంజినీరింగ్‌లోనూ ఇదే దుస్థితి
* ఉద్యోగ సృష్టికర్తల తయారీకి దూరంగా సిలబస్‌, బోధన
* ఇప్పుడిప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ దిశగా ఐఐటీల అడుగులు
* ఆ వూసే పట్టని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు
ఈనాడు - హైదరాబాద్‌: కోర్సు ఏదైనా కానీ.. పాఠాలు బోధించడం, పరీక్షలు జరపడం, కంపెనీలు ముందుకొస్తే ప్రాంగణ నియామకాలు నిర్వహించడం... మొత్తానికి డిగ్రీ పట్టాలిచ్చి బయటకు పంపించడం. ప్రైవేట్‌ కళాశాలల్లోనే కాదు.. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి! ఇంజినీరింగ్‌ విద్యా అందుకతీతం కాదు. ఉద్యోగాలు చేయడం తప్ప, ఉద్యోగాలను స్పష్టించే దిశగా విద్యార్థులకు కనీస మార్గనిర్దేశనం లేదు. కొన్నేళ్లుగా స్టార్టప్‌ సంస్కృతి పెరుగుతున్నా.. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత కంపెనీల స్థాపనకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ గురించి ప్రాథమిక అవగాహన కూడా కల్పించలేకపోతున్నాయి. సంప్రదాయ డిగ్రీ పట్టాలకే కాదు.. వృత్తివిద్యా కోర్సు అయిన ఇంజినీరింగ్‌(బీటెక్‌) 80శాతం మార్కులతో పాసవుతున్న అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఉత్తీర్ణులెక్కువగా ఉండటం ఒక కారణమైతే... చదువు పూర్తికాగానే ఉద్యోగ నైపుణ్యాలతో బయటకొచ్చేవారు కేవలం 15శాతమే అని నాస్కామ్‌ లాంటి సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క బీటెక్‌ ఉత్తీర్ణులవుతున్నవారే ఏటా 60వేలమంది ఉంటున్నారు. వారిలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నవారు 10వేలమంది లోపే. మరి మిగతా మాటో?.. అందుకే కొందరినైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(ఎంటర్‌ప్రెన్యూర్స్‌)గా తీర్చిదిద్దడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు, దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికీ అది అవసరమని చెబుతున్నారు.
అవగాహన పాఠాలూ లేవు
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రధానంగా ఇంజినీరింగ్‌ విద్యను చెప్పుకోవాలి. నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో కనీసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ప్రాథమిక అవగాహన కల్పించేలా కూడా పాఠ్యప్రణాళిక లేకపోవడం గమనార్హం. ఉదాహరణకు జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌లో మూడు ఎలెక్టివ్‌ సబ్జెక్టులను ఎంచుకోవాలి. పదుల సంఖ్యలో ఉండే వాటిల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఒక సబ్జెక్టు. అవి ఐచ్ఛికం కావడం, తక్కువమంది ఎంపికచేసుకుంటే బోధించడం కష్టమని అధ్యాపకులు, ఆచార్యులే వేరే కొన్నింటిని సూచిస్తుంటారు. ఫలితంగా ప్రయోజనం నెరవేరడం లేదు. వందలాది కళాశాలలు అనుబంధంగా ఉన్న జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించే ఇంక్యుబేటర్‌ కేంద్రం లేకపోవడం గమనార్హం.
పరిస్థితులు మారుతున్నా...
కేంద్రప్రభుత్వం ఒకవైపు దేశాన్ని భారత్‌లో తయారీ (మేక్‌ ఇన్‌ ఇండియా)గా మార్చాలన్న లక్ష్యంతో ఉంది. రుణాలిచ్చేందుకు ముద్ర పేరిట ప్రత్యేక బ్యాంకును ప్రారంభించారు. తెలంగాణ సర్కారు సైతం ఇటీవలే ట్రిపుల్‌ఐటీ టీ-హబ్‌(ఇంక్యుబేటర్‌)ను ఆరంభించింది. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లపై యువత ముందుకొస్తోంది.
* గత ఏడాది హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎస్‌బీ) ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌(టెప్‌)ను ప్రవేశపెట్టగా, రెండు రాష్ట్రాల నుంచి 2000మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారంతా 80శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నవారే కావడం విశేషం.
* ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అవసరాన్ని గుర్తించిన ఐఐటీలు మేల్కొన్నాయి. గత ఏడాది నుంచి దానిపై స్వల్పకాలిక కోర్సు (మైనర్‌)లకు శ్రీకారం చుడుతున్నాయి. వాటిని తప్పనిసరిగా విద్యార్థులు ఎంచుకోవాలి.
* ఇంజినీరింగ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై పాఠాలు తప్పక ఉండాలని నిర్ణయించి కేరళ ప్రభుత్వం సిలబస్‌లో మార్పులుచేస్తోంది. జాతీయ విద్యా విధానానికీ దీన్ని ప్రతిపాదిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ సిలబస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేలా మార్పులు జరగాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నిజమే... మారాలి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఇంజినీరింగ్‌లో అవసరమైన సిలబస్‌, బోధన లేదు. కంపెనీల స్థాపన, ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ఏంచేయాలనే దానిపై ప్రాథమిక అవగాహనైనా కల్పించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఉద్యోగాల కల్పన జరగాలంటే కొందరినైనా ఆ దిశగా ప్రోత్సహించాలి.
     - ప్రొ॥ వెంకటరమణారెడ్డి, సంచాలకుడు, వర్సిటీ -పరిశ్రమల అనుసంధాన విభాగం, జేఎన్‌టీయూహెచ్‌.
అద్భుత ఆలోచనలు విద్యార్థుల సొంతం
ప్రైవేట్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లో వ్యాపారానికి అనుకూలించే అద్భుత ఆలోచనలు అనేకం ఉన్నాయి. చాలమంది ఉద్యోగం చేయడానికంటే, ఉద్యోగాలిచ్చేందుకు వీలుగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంలేదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు ఉద్యోగంచేసి ఆర్థిక స్థిరత్వం ఏర్పడ్డాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారొచ్చు. ప్రతి కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అభివృద్ధి విభాగాన్ని తప్పనిసరి చేయాలి.
     - కోటేశ్వర్‌రావు, సంచాలకుడు, గ్లోబల్‌ ఎగ్జిమ్‌ కంపెనీ
ఒక కోర్సుగా ఉండాలి
డిగ్రీ పట్టాలతో బయటకొస్తున్నవారితో పోల్చుకుంటే ఉద్యోగాల సంఖ్య చాల తక్కువగా ఉంది. ప్రతి అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో తప్పనిసరి సబ్జెక్టుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ గురించి బోధించాలి.
     - ప్రొ॥ రాజశేఖర్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం, హెచ్‌సీయూ
Posted on 13- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning