నైపుణ్యాభివృద్ధిరస్తు

* ఎంత పెంచుకుంటే అంత ఉపాధి
* ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు తగిన నైపుణ్యం లేదు
* భవిష్యత్తులో భారీగా పెరగనున్న లోటు
* కీలక రంగాల్లో పెద్ద ఎత్తున శిక్షణ అవసరం

రాష్ట్రంలో అడుగడుగునా వెలసిన చదువుల కర్మాగారాల నుంచి ఏటా లక్షల మంది యువత పట్టాలు పుచ్చుకొని బయటికి వస్తున్నారు. కాళ్లరిగేట్లు ఏళ్ల తరబడి తిరిగినా అర్హతకు తగిన ఉద్యోగాలు లేవని వాపోతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉపాధికి కొరత లేదు. ఉన్నదల్లా నైపుణ్యాల కొరతే.

నైపుణ్యం కలిగిన వారికి రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. వచ్చే పదేళ్లలో (2022 కల్లా) రాష్ట్రంలో పని చేయగలిగిన శక్తి ఉన్న మనుషుల సంఖ్య 4.44 కోట్లకు పెరుగుతుంది. ఇందులో 85 శాతం కొత్తగా ఆవిర్భవించిన మానవ వనరులే. అంటే ఇప్పుడు పని చేస్తున్న వారిలో 15 శాతం మందే అప్పటికి పని చేస్తుంటారన్న మాట. రాష్ట్రం కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుని ముందుకు నడుస్తుందా? లేదా తిరోగమిస్తుందా? అన్నది ఈ నాలుగున్నర కోట్ల మంది పని చేయగలిగిన పౌరుల నైపుణ్యాలను పెంపొందించడం పైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో మరో ఐదేళ్లలో దాదాపు 63 లక్షల మంది వివిధ నైపుణ్యాలు కలిగిన శ్రామిక శక్తి కొత్తగా అవసరం పడతారు. ఆ తర్వాత మరో ఐదేళ్లలో మరో 48 లక్షల మంది నిపుణులైన మానవ వనరుల్ని తీర్చిదిద్దుకొని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా నిర్మాణ రంగం, పర్యాటక ఆతిథ్య రంగాలు, బ్యాంకింగ్, బీమా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలకు భారీ డిమాండ్ రానుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్ (ఎన్ఎస్‌డీఎస్) రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలు, జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఏ రంగాల్లో శిక్షణ దృష్టి సారించాలి, పారిశ్రామిక అవసరాలు, భాగస్వామ్యం వంటి కీలకాంశాలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఐటీ సంస్థ యాక్సెంచర్ ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకున్నాయి
నివేదికలో ముఖ్యాంశాలు
భవిష్యత్ అవసరాలకు అందుబాటులో ఉండే నైపుణ్యానికి భారీ అంతరం ఉండబోతోంది. వచ్చే ఐదేళ్లలోనే ఈ కొరత ఎక్కువగా ఉండబోతోంది.
ఇప్పటి నుంచే ప్రాధాన్య రంగాల్లో నైపుణ్యాల పెంపునకు కార్యాచరణ అవసరం. ఆ మేరకు చొరవ తీసుకోకుంటే ఆ తర్వాత ఐదేళ్లలోనూ నిపుణుల కొరత తీవ్రంగా వేధించనుంది.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోతాయి. ఈ రంగాల్లోని వారు రంగాల వైపు మళ్లుతారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలవారిని పెంచుకోవాలి. నిర్మాణ రంగం, ఆతిథ్యం, బ్యాంకింగ్ పైనాన్షియల్ సర్వీసెస్, మైనింగ్ క్వారీయింగ్, వస్తూత్పత్తి, రసాయనాలు, ఔషధాలు, లోహాలు, లోహ ఉత్పత్తులు, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమ, రవాణా రంగాల్లో నైపుణ్యం కలవారి అవసరం బాగా పెరుగుతుంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, కరీంనగర్, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలు మానవ వనరుల కొరత తీర్చనున్నాయి.
వృత్తివిద్య శిక్షణ అత్యంత కీలకం కానుంది. మౌలిక సదుపాయాలు బాగున్నా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. శిక్షణల కోసం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాలను పెంచాలి. నైపుణ్యం కల శిక్షకులను తయారు చేయాలి. మార్కెట్‌కు అవసరమైన అనుసంధానమైన కోర్సులను రూపొందించాలి. డ్రాప్ అవుట్‌లను తగ్గించాలి. యువత ఆకాంక్షలకు అనుగుణంగా వృత్తి విద్య కోర్సులను రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో నైపుణ్య శిక్షణ సంస్థలతో అవగాహనతో ముందుకు వెళ్లాలి. జాతీయ స్థాయి శిక్షణ ప్రమాణాలను కలిగి ఉండేలా పరిశ్రమ-యువతతో సంప్రదించి వీటిని రూపొందించాలి. ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. పరిశ్రమల భవిష్యత్ అవసరాలను గుర్తించడం ప్రభుత్వం, శిక్షణ సంస్థల ప్రధాన బాధ్యత. పరిశ్రమలు తరచూ శిక్షణ సంస్థలతో అవసరమైన మానవ వనరుల గురించి చర్చించాలి. పరిశ్రమలు కూడా శిక్షణ కోర్సుల సిలబస్‌ను రూపొందించడంలో సహకరించాలి.
పట్టణీకరణ నేపథ్యంలో నిర్మాణరంగం ఎంతో పెరగనుంది. జిల్లాల్లో డిమాండ్ 49 శాతం దాకా పెరగనుంది. మొత్తం పెరుగుదలలో నిర్మాణరంగం వాటా ఐదు శాతంగా ఉంటుంది. పర్యాటక వాణిజ్య, అతిధ్య రంగం, 20 శాతం పెరుగుదల ఉంటుంది. తయారీ, కోక్, పెట్రోల్, అణు ఇంధన రంగాల్లో అత్యధికంగా 157 శాతం వరకూ పెరుగుదల ఉంటుంది. రబ్బర్, ప్లాస్టిక్ తయారీ రంగం డిమాండ్ 127 శాతం మేర తగ్గనుంది. 2021-22 నాటికి వాహనరంగం, వాహన రంగ పరికరాల రంగంలో 1.6 లక్షల మంది అవసరమవుతుంది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి పారిశ్రామిక రంగానికి భారీగా మారనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా
మహబూబ్‌నగర్ జిల్లా రెండో అతి ఎక్కువ శ్రామిక శక్తి ఉన్న జిల్లా. తక్కువ అక్షరాస్యత(56.06%) ఉంది. పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లా. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఉండటంతో ఎగుమతి లక్ష్యంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక యూనిట్‌లకు అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా
పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ప్రాధాన్యమున్న మూడో జిల్లా. పత్తి, మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండించే జిల్లా. సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఆగ్రోఫుడ్ ఇండస్ట్రీస్, పర్యాటక, సేవా రంగానికి అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించి ఉన్న ఈ జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు, సమాచార, రవాణావ్యవస్థను కలిగి ఉన్న జిల్లా ఇది.
కర్నూలు జిల్లా
ఈ జిల్లాలో పట్టణ ప్రాంత జనాభా 28.26 శాతం. నూనె మిల్లులు, జౌళి, పాలిషింగ్ యూనిట్, సిమెంట్, రసాయన పరిశ్రమలు. పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, బేరింగ్‌లు, బోల్ట్‌లు, గ్రైండర్లు, ఇండస్ట్రియల్, పారిశ్రామిక శుద్ధి కర్మాగారాలు.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి
నిర్మాణ, పర్యాటక, అతిథ్య, బ్యాంకింగ్, అర్థిక సేవలు, తయారీ, రవాణా, సరకు రవాణ వంటి రంగాల్లో శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలి. నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అసంఘటిత రంగంపై దృష్టి సారించి టెక్స్‌టైల్స్, తోళ్ల ఉత్పత్తి, ఇమిటేషన్ జ్యూయలరీ వంటి రంగాల్లో అవసరమైన శిక్షణ ఇవ్వాలి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణ మెరుగుపర్చాలి. పరిశ్రమలు, జాతీయ నైపుణ్య పెంపు వంటి సంస్థలతో కలసి రాష్ట్ర స్ధాయిలో నైపుణ్య పెంపు కార్యక్రమాలు రూపొందించాలి. ఈ గవర్ననెన్స్‌ను బలోపేతం చేసి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో డేటాబేస్‌ను మెరుగు పర్చాలి ప్రభుత్వం, పరిశ్రమాలు, శిక్షణ ఇచ్చేవారితో భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌ను మెరుగుపర్చాలి. శిక్షణ సంస్థల్లో మౌలిక వసతులు పెంచాలి. ఉద్యోగశిక్షణలో ఇంటర్న్‌షిప్‌ను ప్రోత్సహించాలి.

              

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning