ప్రాజెక్టు వర్క్‌... ఫలించే దారి!

ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థికీ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్‌ ఉంటుంది. దీనికి విద్యాపరంగానే కాదు, భవిష్యత్తులో ఉద్యోగపరంగా కూడా ప్రాముఖ్యం ఉంది. ఈ విషయంలో విద్యార్థుల్లో తరచూ ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసే కథనమిది....
విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ ముఖ్యోద్దేశం అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ‘టాపిక్‌’ ఎలాంటి విషయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా విద్యార్థులు ఇటువంటి అంశాలను స్నేహితుల/ సీనియర్ల ద్వారానో, కొన్ని సందర్భాల్లో కళాశాల ప్రొఫెసర్ల ద్వారానో నిర్ణయించుకుంటుంటారు. స్నేహితులు, సీనియర్లు వారి అనుభవం, అవగాహనతో సలహాలు ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కళాశాల ప్రొఫెసర్లు లేదా అధ్యాపకులు ప్రాజెక్టు విషయంలో సహాయం ఇస్తుంటారు.
ప్రాజెక్టు వర్క్‌ చేయడానికి ఒక క్రమబద్ధమైన క్రియావిధానం ఉందని చెప్పడం కష్టం. అయినప్పటికీ మార్గదర్శనం ఉండడం మేలే. దీనివల్ల ప్రాజెక్టు వర్క్‌ మీద అవగాహన, పట్టు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, ప్లేస్‌మెంట్ల విషయంలో నాణ్యతగల ప్రాజెక్టు వర్క్‌ ఎంతో దోహదకారి అవుతుంది.
మొక్కుబడి కారాదు
* ప్రాజెక్టు ఏదో మొక్కుబడిగా కాకుండా వ్యవహారిక సంబంధమై, ఆచరణాత్మక ప్రయోగం కలిగివుండాలి.
* దీనివల్ల పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం మెరుగుపడుతుంది.
* చిక్కు ప్రశ్నలకు సమాధానాలు: విచక్షణతో ఆలోచనీయమైన అంశాలతో అన్వయించుకునే విధానం ఉండాలి.
* తాజా సాంకేతికత: విశేషమైన సాంకేతిక విజ్ఞానపరమైన ప్రాజెక్టును ఎంచుకోవడం మేలు.
ఈ అంశాలుంటే చక్కని ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు కూడా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. సాధారణంగా విద్యార్థులు చేసే ప్రాజెక్టుల్లో కొన్ని ముఖ్యాంశాలు కనిపించకుండా ఉంటాయి. వారు ఎంచుకునే ప్రాజెక్టులు నామమాత్రంగానే ఉంటూ పాఠశాల స్థాయికి పరిమితమవుతున్నాయి. చాలావరకు విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ అంటే మంచి ఉత్సాహంతో వారికి తోచిన అభిప్రాయాలతో ప్రాజెక్టు చేయాలని ఉత్సాహపడుతుంటారు. ఆ అభిప్రాయాలకు ప్రాణం పోసి ఉత్తేజపరిచే ప్రేరణను అందించడంలో కళాశాలలు విద్యార్థులకు సాయపడాలి.
ప్రాజెక్టు రకాలు- వర్గీకరణ
1. థియరిటికల్‌ ప్రాజెక్టు (సిద్ధాంతపరమైన ప్రాజెక్టు): ఇవి సాధారణంగా సిద్ధాంతపరమైన/ గణిత సంబంధమైన నమూనాలతో పరిష్కారాలు చూపుతాయి.
2. ఎక్స్‌పెరిమెంటల్‌ ప్రాజెక్టు: కల్పన, సృష్టి పట్ల ఆసక్తి కలవారు ఈ ప్రాజెక్టు తీసుకోవచ్చు. సామాజిక అనువర్తనం సంబంధితమైన ప్రాజెక్టులు వాడుకలో ఉన్నాయి.
3. పరిశోధనపరమైన ప్రాజెక్టు: పరిశోధన, విచారణ సంబంధిత ప్రాజెక్టులు ఈ కోవకు చెందుతాయి. ఇటువంటి ప్రాజెక్టు ద్వారా పేపర్‌ పబ్లిష్‌ చేసే అవకాశాలు మెరుగవుతాయి.
4. సమస్యాసాధన ప్రాజెక్టు: ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపుతూ సమాజానికీ, బిజినెస్‌కూ, సంస్థలకు ఉపయోగపడే ప్రాజెక్టులు. వీటిమూలంగా ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలున్నాయి. విద్యార్థుల అభిరుచులనుబట్టి కొన్ని ప్రాజెక్టులు సాంకేతిక (టెక్నాలజీ) సంబంధితమైతే, మరికొన్ని సామాజిక సంబంధితమై ఉండడం గమనార్హం.
ప్రాజెక్టు ఎంపిక
ఒక సబ్జెక్టుపై ఆసక్తి, ప్రేరణ ఉండడం ఎంతో అవసరం. అపుడే చేసినదానిపై పట్టు సాధించవచ్చు. పైన చెప్పిన వర్గీకరణలో ఏది ఎక్కువ ప్రేరణ కలిగిస్తుందో అటువంటిది ఎన్నుకుంటే ప్రాజెక్టు విషయంలో ఉత్తీర్ణత సాధించవచ్చు.
* విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన టాపిక్‌ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు టెక్నాలజీ/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌/ మొబైల్‌ ఆప్స్‌/ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌/ డిజిటల్‌ మార్కెటింగ్‌ సంబంధమైనవిగా ఉండవచ్చు. మరికొంతమంది విద్యార్థులు వారివారి కోర్‌ సబ్జెక్టుల్లో కూడా ప్రాజెక్టు తీసుకునే ప్రయత్నం చేయాలి.
* సమయం అనుకూలం: ఎంచుకునే ప్రాజెక్టు తగిన సమయంలో పూర్తవుతుందా లేదా అన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలి.
* జ్ఞానం: ఎంచుకునే ప్రాజెక్టుకు ఎంత పరిజ్ఞానం అవసరమన్నది అంచనా వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. అటువంటి జ్ఞానం విద్యార్థి తనకు లభ్యమయ్యేలా చూసుకోవాలి.
* ఎంచుకున్నది ఎక్స్‌పరిమెంటల్‌ లేదా అప్లికేషన్‌ సంబంధితమైతే కావాల్సిన పరికరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాటికి కావాల్సిన పరీక్ష, శోధన చేసేవిధంగా ఉండాలి.
బృంద ప్రాజెక్టు
సాధారణంగా ఒకే ప్రాజెక్టు నలుగురు లేదా అయిదుగురు విద్యార్థులు కలిసి బృందంగా (గ్రూపు) చేస్తున్నపుడు ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
* ప్రాజెక్టు టాపిక్‌ ఎంపికయిన తరువాత ఆసక్తిగలవారినే బృందంలోకి తీసుకోవాలి.
* బృందంలో ఉండేవారు కావాల్సిన సమయం కేటాయిస్తారో లేదో చూసుకోవాలి.
* ప్రాజెక్టుకు కావాల్సిన నిబంధనల ప్రకారం పనిచేసేవారిని ఎంచుకోవాలి.
* ప్రతి ఒక్కరికీ సమానమైన రీతిలో ప్రాజెక్టు వర్క్‌ను విభజించి మొత్తం ప్రాజెక్టు మీద అవగాహన, పట్టు అందరికీ ఉండేట్టు చూసుకోవాలి.
* ఈ ప్రాజెక్టులో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి తోడ్పాటుతో ప్రాజెక్టు పూర్తిచేయడంలో స్పష్టత ఉండాలి. అపుడే వారు చేసిన ప్రాజెక్టు గురించి చక్కగా వివరించగలరు.
నివేదిక (రిపోర్ట్‌) ఇలా రాయాలి
1. స్పష్టత: చేసిన ప్రాజెక్టు విధానం చక్కగా సులభమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. ఎందుకు ఈ ప్రాజెక్టు ఎంపిక చేసుకున్నారు? ఈ ప్రాజెక్టు కారణంగా ఏం సాధించారు? ఈ ప్రాజెక్టు వల్ల సమాజానికి లేదా ఒక సంస్థకు ఉపయోగం ఉందా? అన్న కీలకాంశాలు ఉండాలి.
2. ప్రాజెక్టు టైటిల్‌: ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టతతో ప్రాజెక్టు టైటిల్‌, ఎప్పటి నుంచి ఎప్పటివరకు (కాలం, వ్యవధి), ఎంతమంది ఈ ప్రాజెక్టు చేశారు? అది ఎటువంటిది? అన్న అంశాలు చక్కగా రాయాలి.
3. సాంకేతికపరమైన అంశాలు: ప్రాజెక్టులో ఏదైనా సాంకేతికపరమైన అంశాలు ఉంటే వాటికి సంబంధించిన వివరణ చాలా అవసరం.
4. చక్కని వివరణ: ప్రాజెక్టు నివేదిక ఎన్ని పేజీలన్నది ముఖ్యం కాదు. చక్కని వివరణతో నాణ్యత స్పష్టమవ్వాలి. ఒక్కోసారి ప్రాజెక్టు వల్ల ఏం ప్రయోజనాలు అనేది చెప్పలేకపోతుంటారు. ప్రాజెక్ట్‌ వల్ల ఏదైనా సంస్థలో ప్రయోజనం జరిగి ఉంటే ఆ విషయాలు తప్పనిసరిగా రాయాలి.
నాణ్యతగల మంచి ప్రాజెక్టు చేయడం వల్ల ఇంటర్వ్యూలో తడబడకుండా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వగలుగుతారు. దీనివల్ల విద్యార్థి తాను కోరుకున్న ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
Posted on 14- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning