అమీర్‌పేట ‘ప్రాజెక్టులు’ తగ్గాయ్‌..!

* కళాశాలల్లోనే 80 శాతం బీటెక్‌ ప్రాజెక్టులు
* మూడేళ్ల నుంచి తగ్గిన విద్యార్థుల రాక
* ఇంటర్వ్యూలో కీలకమైనా సొంతంగా చేసేది 20 శాతంలోపే!

ఈనాడు - హైదరాబాద్‌: ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌మీడియట్‌ పూర్తిచేస్తే ఇంజినీరింగ్‌లో చేరడం.. బీటెక్‌ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌లోకి వస్తే ప్రాజెక్టు పూర్తిచేయటానికి ‘చలో అమీర్‌పేట’ అనడం.. ఇప్పటివరకు అత్యధిక శాతం విద్యార్థులు చేస్తున్నదిదే.. ఈ ధోరణిలో క్రమేణా మార్పువస్తోంది. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కొంత ఫీజు రాబడుతూ తమ సంస్థల్లోనే ప్రాజెక్టుల పూర్తికి ఏర్పాట్లుచేస్తున్నాయి. ఫలితంగా అమీర్‌పేటలోని సాఫ్ట్‌వేర్‌ శిక్షణసంస్థలకు ప్రాజెక్టులపరంగా గిరాకీ తగ్గింది. మరోవంక.. ఎక్కడైనా సరే, ప్రాజెక్టులను స్వయంగా పూర్తిచేస్తేనే విద్యార్థులకు మెరుగైన భవిత ఉంటుందని నిపుణులు, శిక్షణసంస్థల నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సర తొలి సెమిస్టర్‌ డిసెంబర్‌కు పూర్తవుతుంది. తర్వాత చివరి సెమిస్టర్‌లోకి ప్రవేశిస్తారు.అందులో ప్రాజెక్టు ఏదైనా పూర్తిచేయాలి. గత దశాబ్దం నుంచి అంతా సాఫ్ట్‌వేర్‌మయంగా మారడం.. ఉద్యోగావకాశాలూ అందులోనే అధికంగా ఉండటంతో కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్‌ శాఖల విద్యార్థులు సైతం సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ సహాయంతోనే ప్రాజెక్టులు చేసేవారు. సాఫ్ట్‌వేర్‌ శిక్షణ, అభివృద్ధికి కేంద్రబిందువైన హైదరాబాద్‌ అమీర్‌పేట ప్రాంతంలో 400-500 శిక్షణసంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 700 కళాశాలల్లో అధికశాతం విద్యార్థులు ఇక్కడకు వచ్చేవారు. అలా చివరి సంవత్సరంలో దాదాపు 2లక్షల మంది విద్యార్థులుంటే కనీసం సగం మంది సంక్రాంతి తర్వాత నుంచి ఏప్రిల్‌, మే వరకు బ్యాచ్‌లవారీగా నెలన్నరపాటు అమీర్‌పేటలోనే ఉండేవారు. ఒక్కో ప్రాజెక్టుకు రూ.నాలుగైదు వేలు వెచ్చించేవారు. అలా నాలుగైదు నెలల్లో విద్యార్థులు కనీసం రూ.40కోట్లు ప్రాజెక్టు శిక్షణకే చెల్లించేవారు. అంతకంటే ఎక్కువగా వసతిగృహాలకు వెళ్లేవి.
ప్రాజెక్టుల‌పై శిక్షణ‌
కళాశాలలకే రప్పించి...: గత మూడేళ్లుగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను అమీర్‌పేట పంపించే బదులు శిక్షణసంస్థల ప్రతినిధులను, ప్రాజెక్టుల కన్సల్టెన్సీలను తమవద్దకే రప్పిస్తున్నాయి. ఇక్కడి సంస్థలు కొన్ని కళాశాలలను సంప్రదించి, చదువుతున్న సంస్థలోనే విద్యార్థులకు ప్రాజెక్టులపై మార్గదర్శకత్వం ఇచ్చేలా కొత్త విధానాన్ని ప్రారంభించాయి. ఎక్కువ శాతం కళాశాలలు అందుకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలుచేస్తున్నాయి. శిక్షణసంస్థల ప్రతినిధులు అక్కడ ఓ వారంపాటు ఉండి ప్రాజెక్టు ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని వివరించి సూచనలు, సలహాలు ఇచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. అయితే.. సొంతంగా ఓ సమస్యకు పరిష్కారం చూపేలా ఈ ప్రాజెక్టులు చేయకపోతుండటంతో ఉద్యోగాల ఎంపిక సమయంలో విద్యార్థులు నష్టపోతున్నారు. బీటెక్‌ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టుకు 200మార్కులు కేటాయించారు. తూతూమంత్రపు వైవా కారణంగా మార్కులు బాగానే వస్తున్నా.. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో ప్రోగ్రామ్‌లకు వాడే కోడింగ్‌పై మాత్రం విద్యార్థులకు అవగాహన ఉండటం లేదు.
తొలి సవాల్‌ అదే...: ఉద్యోగం కోసం అభ్యర్థులు ఇంటర్వ్యూ(సాంకేతిక)కు వెళితే నిపుణులు అడిగే మొదటి ప్రశ్న బీటెక్‌లో వారు చేసిన ప్రాజెక్టు గురించే. తాజాగా బీటెక్‌ పూర్తయిన వారైతే లోతుగా ఏమీ అడగరని, కాస్త వివరిస్తే చాలని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా॥రవీంద్ర చెప్పారు. అభ్యర్థి చెప్పేదాన్ని బట్టి ఆ ప్రాజెక్టు స్వయంగా చేశారా.. ఎత్తుకొచ్చారా.. అనేది పసికడతారు. సాంకేతికంగా బలంగా ఉంటే కమ్యూనికేషన్‌ విషయంలో బలహీనంగా ఉన్నా విద్యార్థి ఎంపికకు ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సీనియర్లను చూసి మారుతున్నారు
సీనియర్ల అవస్థలను, ఉద్యోగ ప్రయత్నాల్లో వారి సమస్యలను తెలుసుకుంటున్న జూనియర్లు ఇప్పుడిప్పుడే ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకుంటున్నారని శిక్షణసంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల విద్యార్థులు కేవలం గైడెన్స్‌ కోసం వస్తున్నారు...మిగతాది వారే సొంతగా చేస్తున్నారని నరేష్‌ టెక్నాలజీస్‌ అధినేత నరేష్‌ చెప్పారు. కళాశాలలు ప్రోత్సహించి సహకరిస్తే 50శాతం మంది సొంతగా ప్రాజెక్టులు చేయగలరని అభిప్రాయపడ్డారు. ఎక్కువగా మొబైల్‌ యాప్స్‌పై ప్రాజెక్టులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని పీర్స్‌ టెక్నాలజీస్‌ సంచాలకుడు టీవీజీకే ప్రసాదరావు తెలిపారు.
ఏడాది ఆలస్యమైతే పోటీ రెట్టింపు
విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగాలకు ఎంపికయ్యేలా కృషిచేయాలి. కళాశాల నుంచి బయటకొచ్చామంటే ఎంపిక కష్టమవుతోంది. అది ఏడాది ఆలస్యమైతే రెండు రాష్ట్రాల నుంచి ఉత్తీర్ణులై వచ్చే విద్యార్థులతో పోటీ రెట్టింపవుతోంది. నేను 2013-14లో బీటెక్‌ ఈసీఈ పూర్తిచేశాను. ఉద్యోగానికి ఎంపిక కాకపోవడానికి సాంకేతిక, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల లేమి లోపంగా అనిపిస్తోంది. వాటిని అశ్రద్ధ చేయవద్దని జూనియర్లకు చెబుతుంటా.
     -శ్రీనివాస్‌, ఏలూరు, 2013-14 బీటెక్‌ విద్యార్థి
Posted on 16- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning