4 లక్షల కొలువులు!

* ఐదేళ్లలో కల్పించాలనే లక్ష్యం
* మరో రూ. 68,200 బిలియన్ల విలువైన ఐటీ ఎగుమతులు
* వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లకూ ఐటీ హబ్‌లు
* తెలంగాణ రాష్ట్ర కొత్త ఐటీ విధాన ముసాయిదా సిద్ధం!

ఈనాడు - హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద అంకుర పరిశ్రమల కేంద్రం (టీ హబ్‌)తో అందరి దృష్టినీ ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విధానం (ఐటీ పాలసీ)లోనూ వినూత్నతకు పెద్దపీట వేస్తోంది. ప్రపంచంలోని ప్రతి ఐటీ కంపెనీకీ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా తెలంగాణ నిలిచేలా ఐటీ విధానాన్ని రూపొందిస్తోంది. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో ఆవిష్కరించాలనుకుంటున్న ‘తెలంగాణ ఐటీ విధానం’లో భారీ లక్ష్యాలు, పెట్టుబడిదారులకు వరాలున్నట్లు సమాచారం. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో ఇప్పటికే కసరత్తు పూర్తయి, తుది మెరుగులు దిద్దుకుంటున్న ఐటీ విధానంలో.. రాబోయే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించటం ప్రధానాంశం! ప్రస్తుతం రూ.682 బిలియన్లున్న ఐటీ ఎగుమతులను ఐదేళ్లలో రెట్టింపు చేయటం; ఐటీ రంగాన్ని వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా విస్తరించటం మరో కీలకాంశంగా చెబుతున్నారు. ఎన్నికల నిబంధనావళి తదితర సాంకేతిక అడ్డంకులేమైనా ఎదురైతే మాత్రం దీని విడుదల ఆలస్యం కావచ్చు!
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోతున్న ఐటీ విధానాన్ని ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో అన్నిరకాలుగా బేరీజు వేసి, పరిశ్రమల నిపుణులతో సంప్రదించి రూపొందించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. భౌగోళికంగా తెలంగాణకు ఉన్న అనుకూలతలు; మౌలిక సదుపాయాలు, అందుబాటులోని నైపుణ్యం, నియంత్రణ చట్రాల ఆధారంగా పది రంగాల్లో ఐటీ పెట్టుబడులకు అవకాశాలున్నట్లు గుర్తించి, వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్య రంగాలివీ...
1. ఐటీ/ఐటీ ఆధారిత రంగాల (ఐటీఈఎస్‌) విస్తరణ
2. ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌, తయారీ
3. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
4. నైపుణ్యాభివృద్ధి
5. ప్రభుత్వంచే ఐటీ ఉత్పత్తులు, సేవల సేకరణ
6. ఆధునిక కార్యాచరణలు
7. ఈ-పాలన, ఎం-పాలన
8. డిజిటల్‌ తెలంగాణ
9. విశ్వ ప్రచారం
10. మెరుగైన జీవన ప్రమాణాలు
ప్రతి విద్యార్థీ ఉద్యోగార్హుడయ్యేలా....
* తెలంగాణలో ప్రతి విద్యార్థీ ఉద్యోగార్హుడయ్యేలా అవసరమైన సాంకేతిక, నిర్వహణ, జీవన నైపుణ్యాలను అందిస్తారు.
* ఇందుకోసం ఓ నోడల్‌ సంస్థ ద్వారా పరిశ్రమలు, విద్యా రంగాన్ని అనుసంధానిస్తారు.
* వచ్చే ఐదేళ్లలో ఏటా 25 వేల మంది నిపుణులను ఉద్యోగాలకు సిద్ధంగా ఉంచుతారు.
* రాష్ట్రంలోని ప్రతి వృత్తి కేంద్రం నైపుణ్యాలను అందజేసేందుకు నోడల్‌ సంస్థతో కలసి పనిచేస్తుంది.
* ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా నిపుణులైన అభ్యర్థుల్లో 80% మందికిపైగా ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటారు.
ఆధునిక సాంకేతికతల్లో ముందంజ....
* భవిష్యత్‌లో వస్తున్న ఆధునిక సాంకేతికతల్ని అందిపుచ్చుకోవటంలో, ఆవిష్కరణల్లోనూ తెలంగాణ ముందంజలో ఉండబోతోంది. ఇందుకోసం గేమ్‌పార్క్‌, డాటా అనాలసిస్‌ పార్క్‌, డాటా సెంటర్‌ ప్రాంగణంలాంటి కొత్త మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
* ఫొటోనిక్స్‌ లాంటి రంగాలపై ప్రత్యేక దృష్టిసారిస్తారు.
* ఈ కొత్తరంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుంది.
* సైబర్‌ రక్షణకు చర్యలు తీసుకుంటారు.
మొబైల్‌ ద్వారానే సగం సేవలు...
* ఈ (ఎలక్ట్రానిక్‌) పాలనలో, ప్రజాసేవలను అందజేయటంలో అగ్రస్థానంలో ఉండటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాకుండా ఎం (మొబైల్‌)పాలనలోనూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఇళ్లకూ బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ ఇచ్చేలా చేసి, రాష్ట్రం మొత్తాన్ని డిజిటల్‌ ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్లన్నింటికీ వైఫై సదుపాయం కల్పించి 100 శాతం డిజిటల్‌ అక్షరాస్యత సాధించేలా చూస్తారు.
* వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అందిస్తున్న 322 సేవలను 500కు పెంచుతారు.
* సగం సేవలను మొబైల్‌ ద్వారానే పొందవచ్చు.
* ప్రతి ఇంటిలో ఒక్కరికైనా డిజిటల్‌ జ్ఞానం పొందేలా చర్యలు
* ప్రతి బడిలోనూ ఆరో తరగతి తర్వాత డిజిటల్‌ పాఠాలు
* ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ల ద్వారా డిజిటల్‌పాఠాలు తయారు చేయించటం.
* వీటితోపాటు... సౌర విద్యుత్‌, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిచటం; నీరు, చెత్త నిర్వహణలో సాంకేతికను వినియోగించుకోవటం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపర్చటానికి చర్యలు చేపడతారు.
* ఈ కొత్త ఐటీ విధానం లక్ష్యాలను సాధించటానికిగాను విశ్వవిద్యాలయాలు, పేరెన్నికగన్న ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వేతర సంస్థలు, పారిశ్రామిక సంస్థలతో కలసి ముందుకు సాగుతారు. ప్రభుత్వం వీరికి ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలతో కూడా ఒప్పందాలు చేసుకునే అవకాశముంది.
ఇదీ...విధాన దార్శనికత...
* ప్రపంచంలో ఎక్కడైనా ఐటీ కార్యకలాపాలు ఆరంభించాలనుకునే ప్రతి కంపెనీకీ హైదరాబాద్‌ అత్యంత ప్రాధాన్య కేంద్రం కావటం. అధునాతన సాంకేతికతలో అగ్రగామిగా తెలంగాణకు గుర్తింపు రావటం.
* ప్రజలకు వివిధ రకాలైన సేవలు, సదుపాయాల కల్పనలో ఐటీ రంగాన్ని విరివిగా వినియోగించుకొని, స్మార్ట్‌ పరిపాలనకు దేశంలోనే అందరికీ ఆదర్శంగా తెలంగాణ నిలవటం.
* డిజిటల్‌ ప్రపంచంలో రోజురోజుకూ పుట్టుకొస్తున్న అవకాశాల్ని తెలంగాణ ప్రజానీకం అందిపుచ్చుకునేలా చర్యలు.
* సాంకేతిక పెట్టుబడిలో, సృజనాత్మకతలో దేశంలోనే అగ్రగామి ప్రపంచస్థాయి కేంద్రంగా తెలంగాణ ఎదగటం.
ఈఎస్‌డీఎంలో 2.5 లక్షల మందికి ఉపాధి
ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌, తయారీ (ఈఎస్‌డీఎం)లో దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదగటానికి ఐటీ విధానంలో దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాల సమర్థ వినియోగం, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్‌ సాంకేతికత, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తారు. వచ్చే ఐదేళ్లలో ఈఎస్‌డీఎంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించటం... జాతీయ ఎలక్ట్రానిక్‌ వినియోగంలో పదిశాతం, జాతీయ ఎలక్ట్రానిక్‌ ఎగుమతుల్లో 15 శాతం ఉత్పత్తి చేయటం.. ఐదేళ్లలో ఈఎస్‌డీఎం రంగం ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
* ఈ-సిటీ, మహేశ్వరం సైన్స్‌ పార్క్‌ వద్ద 600 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్‌ తయారీ మండళ్ల (ఈఎంసీ)ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లోని బాహ్యవలయ రహదారి వద్ద ఏర్పాటుకానున్న ఈఎంసీల్లో నిరంతర విద్యుత్‌, నీటి వసతితోపాటు అత్యాధునిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ఈఎంసీల కోసం మరిన్ని ఐటీ పార్క్‌లను కూడా ఏర్పాటు చేయొచ్చు.
* ఈఎస్‌డీఎం కిందికి వచ్చే సెమీకండక్టర్లు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, మొబైల్‌ తయారీ యూనిట్లు, పీసీ, తదితర గ్యాడ్జెట్‌, ఎల్‌ఈడీ తయారీ యూనిట్లలాంటి పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చేవారికి అనేక రాయితీలు కల్పించటానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
* ఈ యూనిట్లన్నింటికీ అవసరమైన నైపుణ్య వనరులను టాస్క్‌ (తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ) ద్వారా సిద్ధం చేస్తారు. ఇందుకోసం విద్యాసంస్థలతో టాస్క్‌ అనుసంధానమై పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్‌ ఇన్‌క్యూబేషన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
* టీహబ్‌ ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారు. భవిష్యత్‌ తరం ఆవిష్కరణలకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
* స్టార్టప్స్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఐదేళ్లలో ప్రైవేటు రంగంతో కలసి 10 లక్షల చదరపుటడుగుల మౌలిక సదుపాయాన్ని కల్పిస్తారు.
* వినూత్నత, ఆవిష్కరణలు, కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి రూ.20 బిలియన్ల నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తారు.
* ఐదేళ్లలో 2,500 అంకుర పరిశ్రమలకు సదుపాయాలు కల్పిస్తారు.
Posted on 18- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning