అమ్మనడిగి చెబుతా!

ఆండ్రాయిడ్‌ వెర్షన్లకు భారతీయ వంటకాల
పేర్లపై సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్య
చిన్నప్పుడు క్రికెటర్‌ కావాలనే కలగన్నానని వెల్లడి
విద్యావ్యవస్థలో సృజనాత్మకకు ప్రాముఖ్యం ఇవ్వాలి
గూగుల్‌ విస్తరణలో భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం
విద్యార్థులతో ముఖాముఖిలో గూగుల్‌ సీఈఓ..

మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ప్రపంచంలో ఎన్నో అవకాశాలున్నాయి. సవాళ్లను ఎదుర్కొనే తత్వమే మిమ్మల్ని విజయాలకు చేరువ చేస్తుంది.
మీరు అగ్రస్థానంలో ఉన్నప్పుడు.. తర్వాత వేయబోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించాలి.
ప్రస్తుతం చేస్తున్న పనిలోనే సంతృప్తి చెంది అక్కడే ఉండిపోతే.. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఇక మీరు ప్రయత్నించరు.
మేం ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్‌లో సమాలోచనలు జరుపుతాం.
భారత్‌లో అన్ని రైల్వే స్టేషన్లకూ వైఫై సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
సమస్యలను, ప్రమాదాలను ఎదుర్కొనేలా విద్యార్థులకు మనం పాఠాలు చెప్పాలి.
నిర్మాణాత్మక అవరోధాలు భారత్‌ అభివృద్ధిని శాసిస్తున్నాయి
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఆయన. కానీ.. యువతీయువకులు సరదాగా ఓ ప్రశ్న అడిగేసరికి తడబడ్డారు. ‘మా అమ్మను అడిగి చెబుతా’నంటూ చిరునవ్వు నవ్వారు. దిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమై నవ్వులు పూయించింది. భారత పర్యటనలో ఉన్న గూగుల్‌ ముఖ్యకార్య నిర్వహణాధికారి సుందర్‌ పిచాయ్‌ శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో విద్యార్థులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌ వర్షన్లకు అన్నీ విదేశీ వంటకాల పేర్లే పెడుతున్నారు. భారతీయ వంటకం పేరు పెట్టవచ్చు కదా?’’ అని అడిగారు. దీనికి పిచాయ్‌ తొలుత తడబడి.. ఆ తర్వాత.. ‘‘దీనిపై మా అమ్మను అడగాల్సిందే’’నన్నారు. పేరును నిర్ణయించడానికి ఆన్‌లైన్‌లో పోల్‌ను కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు మాత్రం ఆండ్రాయిడ్‌ కొత్త వర్షన్‌కు ‘పేడా’, ‘నెయ్యప్పమ్‌’, ‘నాంఖటాయ్‌’ వంటి రకరకాల వంటకాల పేర్లను సూచించి పిచాయ్‌ను నవ్వుల్లో ముంచెత్తారు. ఇప్పటివరకూ యాండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు డోనట్‌, ఎక్లెయిర్‌, జింజర్‌ బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌, జెల్లీ బీన్‌, కిట్‌క్యాట్‌, లాలీపప్‌ వంటి పేర్లను పెట్టగా.. తాజా వర్షన్‌కు మార్ష్‌మాలో పేరును పెట్టారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు భారతీయ వంటకాల పేర్లు పెట్టవచ్చుగదా అని సూచించారు.

నాటి నుంచి నేటివరకూ...
ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షభోగ్లే అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పిచాయ్‌.. పలుఅంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. అనంతరం దిల్లీలో పలు ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో.. చిన్నప్పటి తన ఆకాంక్షలను, తనకు వచ్చిన మార్కులను, తాను ఇష్టపడే వంటకాల వంటి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూనే యువతకు మార్గనిర్దేశనం చేసేలా స్ఫూర్తివంతమైన మాటలు చెప్పారు. గూగుల్‌ భవిష్యత్‌ ప్రాజెక్టుల గురించి, భారత్‌లో ఇంటర్నెట్‌ విస్తరణ గురించీ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నాకు చిన్నప్పటి నుంచీ తీపి పదార్థాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదంటే.. పాయసాన్ని కూడా సాంబార్‌లో కలుపుకొని తినేవాడిని. అందుకే పాయసం కూడా తియ్యగా అనిపించేది కాదు. ఇక క్రికెట్‌ విషయానికొస్తే.. భారతీయులందరిలాగే నాకూ క్రికెటరవ్వాలనే కల ఉండేది. గావస్కర్‌, సచిన్‌లకు వీరాభిమానిని. టెస్టులు, వన్డేలు చూస్తూ పెరిగి పెద్దయ్యా. అందుకే ఆ రెండు ఫార్మాట్లంటే నాకు చాలా ఇష్టం. టీ20లను మాత్రం అంతగా ఆస్వాదించలేను. ఫుట్‌బాల్‌ కూడా చాలా ఇష్టం. ఫిఫా ప్రపంచకప్‌ వచ్చిందంటే టీవీలో మ్యాచ్‌లు చూడటం కోసం అర్ధరాత్రి నిద్ర లేచేవాణ్ని. ఈ పనులతో మా అమ్మకు విసుగు తెప్పించేవాణ్ని. ఫుట్‌బాల్‌లో అర్జెంటినాకు చెందిన మెస్సీ నా అభిమాన క్రీడాకారుడు.
నచ్చిన రంగాల్లోనే కృషి: విద్యార్థులు తమకు నచ్చిన రంగాలనే ఎన్నుకొని కృషి చేయాలి. నీ స్వప్నాలను అనుసరిస్తూ వెళ్తే నీకు ఎక్కడ కావాలంటే అక్కడే ఉద్యోగం దొరుకుతుంది. గూగుల్‌లో కంప్యూటర్‌ సైన్స్‌యేతర విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. భారత్‌లో విద్యకు విలువనిచ్చే సంప్రదాయం ఉంది. అయితే సృజనాత్మకతను తట్టిలేపేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అపుడే ఎవరైనా వ్యక్తి భిన్నంగా ఆలోచించటానికి ముందుకొస్తారు. అమెరికా తరహాలో ప్రయోగాల ద్వారా నేర్చుకునే విధానాల్ని ప్రవేశపెట్టాలి. సృజనాత్మకతను వెలికితీసేలా భారతీయ విద్యా వ్యవస్థ ఉండాలి.

భారత్‌లో తయారీ
భారత్‌లో బలమైన మొబైల్‌ మార్కెట్‌కు తోడు భారతీయుల్లో సాంకేతికతపై ఆసక్తి ఎక్కువగా ఉంది. దీనివల్లే ఇక్కడ ఉత్పత్తుల తయారీకి మంచి అవకాశాలున్నాయి. మా ఉత్పత్తులన్నింటినీ భారత్‌కు తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం. తొలుత భారత్‌లోనే వాటిని విడుదల చేసి ఆ తర్వాతే అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి ‘యూట్యూబ్‌ ఆఫ్‌లైన్‌’ ఒక ఉదాహరణ. దానిని తొలుత భారత్‌లో ప్రవేశపెట్టిన తర్వాతే 77 దేశాల్లో విడుదల చేశాం. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. కార్యాలయాలను విస్తరిస్తున్నాం. భారత్‌లో అంకుర పరిశ్రమల (స్టార్టప్‌) విషయంలో మంచిమార్పులు వస్తున్నాయి. భారత్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకుల ఆలోచనలు.. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. ఇది సంతోషకరమైన పరిణామం. వైఫల్యాలకు వెరవకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ స్టార్టప్‌ల విషయంలో ముందడుగు వేయాలి’’ అని సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు. గురువారం దిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పిచాయ్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ సమావేశమయ్యారు.
మహిళలు-ఇంటర్నెట్‌
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో చాలామంది ఇంటర్నెట్‌ (అంతర్జాలం) తమకు ఉపయోగపడుతుందని కనీసం వూహించడం లేదని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. మహిళలను అంతర్జాలంలోకి తీసుకురావడమే అన్నింటి కంటే ముఖ్యమైన అంశమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మూడోవంతు కంటే తక్కువ మంది మాత్రమే అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారని.. ఈ పరిస్థితిని మార్చాల్సి ఉందన్నారు.
కాలేజీలో సీటొచ్చేది కాదు

శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌తోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సుందర్‌పిచాయ్‌ను పలువురు వివిధ అంశాలపై ప్రశ్నించారు. దీనికి ఆయన కూడా సరదాగా స్పందిస్తూ జవాబులు ఇచ్చారు.
మీకు ఇంటర్‌ (12వ తరగతి)లో ఎన్ని మార్కులు వచ్చాయి?
ఆ మార్కులు శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చేరడానికి మాత్రం సరిపోవు.
గూగుల్‌ సీఈఓ కాకపోయిఉంటే ఏం చేసేవారు?
ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తూ ఉండేవాడిని.
గూగుల్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా గూగుల్‌ మనుష్యులందరి సమస్యలను పరిష్కరించే ఉత్పత్తులను తయారుచేస్తుంటుందన్న నమ్మకం ఉంది. ఆ లక్షణమే నన్ను గూగుల్‌కు దగ్గర చేసింది.
మీకు ఎన్ని స్మార్ట్‌ఫోన్లున్నాయి?
20 నుంచి 30
మొదటిసారిగా ఫోన్‌ ఎప్పుడు కొన్నారు?
1995లో ఫోన్‌ తొలిసారిగా కొన్నా. స్మార్ట్‌ఫోన్‌ కొన్నది మాత్రం 2006లో.
ఈ తరం యువత గురించి మీ అభిప్రాయం ఏమిటి?
ప్రమాదాలను ఎదుర్కొనేందుకు, ముప్పులను స్వీకరించేందుకు ఈ తరం యువత అంతగా భయపడటం లేదు.
Posted on 18- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning