విదేశీ విద్యకు తొలి సన్నాహాలు

డిసెంబర్‌ నెల ముగుస్తోంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలూ, పరీక్షలకు సిద్ధమవడం, ఇతర దేశాల్లో ఉన్నత చదువులకు ప్రయత్నాలు వంటి ముఖ్య నిర్ణయాలన్నీ తీసుకునే సమయమిది. కెరియర్‌కు కీలకమైన విదేశీవిద్యకు ప్రణాళిక వేసుకునేవారు ప్రాథమికంగా కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. వాటిని తెలుసుకుందాం!
మనదేశ విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక పీజీ చదువుల కోసం విదేశీ బాట పడుతుంటారు. ఈ ఆలోచన ఉన్నవారు మొదట ఆలోచించాల్సిన విషయాలు:
* ఎక్కడికి వెళ్లాలి?
* నాకు అర్హత ఉందా?
* ప్రవేశాలు ఎప్పుడుంటాయి?
* మొదలుపెట్టాల్సిన ప్రక్రియ (ప్రాసెస్‌) ఎప్పుడు?
* రాయాల్సిన పరీక్షలు ఏవి?
చదవదల్చిన (ప్ర)దేశాన్ని నిర్ణయించుకోవడంలో ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోటం మంచిది.
* ఏ విద్యాసంస్థ?: ఏ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలి, దాని చదవడం ద్వారా లభించే ఫలితాలు వంటి అంశాలపై విద్యార్థికి స్పష్టత ఉండాలి. అవకాశాలు, కెరియర్‌ భవిష్యత్తు, కోర్సు లభ్యత ఆధారంగా ప్రదేశాన్ని నిర్ణయించుకోవచ్చు.
* ఆర్థిక స్తోమత: విదేశాల్లో చదవాలని కోరుకుంటున్నపుడు ముందుగా ఆర్థిక స్తోమతును చూసుకోవాలి. అది సరైన నిర్ణయం తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఇంత పెద్ద మొత్తం వెచ్చించేముందు ఏది విద్య, కెరియర్‌ లక్ష్యాలకు మేలు చేస్తుందో, ఎంతవరకూ ఖర్చుపెట్టగలరో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ అంచనా వేసుకోవాలి. దాన్ని మదుపుగా భావిస్తే... దానికంటే ఎక్కువ మొత్తం తిరిగి పొందేలా ఆ మదుపు ఉండాలి.
* వలస నిబంధనలు, స్థిరపడే మార్గాలు: ఆస్ట్రేలియా, కెనడా వంటి చాలా దేశాలు విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసుకున్న తరువాత స్థిరపడే అవకాశాలను కల్పిస్తున్నాయి. విద్యాభ్యాసం చేయాల్సిన దేశాన్ని ఎంచుకోవడంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇదొకటి.
* అత్యధికులు ఎంచుకునే దేశాలు: మన విద్యార్థుల ఎంపికకు సంబంధించిన దేశాల ప్రాధాన్యక్రమంలో వరుసగా యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్‌లు ఉంటాయి.
అర్హత గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రవేశానికి కావాల్సిన మార్కుల శాతం, టెస్ట్‌ స్కోర్లు వంటివి తెలుసుకోవాలి. కేవలం పర్సంటేజీనే ప్రామాణికం కాదు. కానీ, 60 శాతానికిపైగా మార్కుల శాతం ఉంటే అది ప్రవేశానికి తోడ్పడుతుంది.
ఏ దేశం? ఏ విధంగా?
యు.ఎస్‌.ఎ.: ఇక్కడి విశ్వవిద్యాలయాలు రెండు సీజన్లలో ప్రవేశాలను కల్పిస్తాయి. అవి: ఫాల్‌ (సెప్టెంబర్‌), స్ప్రింగ్‌ (జనవరి). చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు సమ్మర్‌ (మే) ప్రవేశాలను కూడా కల్పిస్తున్నాయి. ఫాల్‌ పెద్దమొత్తంలో ప్రవేశాలను కల్పిస్తుంది. అన్ని విశ్వవిద్యాలయాలూ, కోర్సులూ దీనికి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా విద్యా సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి, విద్యార్థులు కూడా దీనికే మొగ్గు చూపిస్తారు.
యు.కె.: యూఎస్‌ఏలాగానే యూకే కూడా ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలను ఫాల్‌లోనే కల్పిస్తుంది. అన్ని విశ్వవిద్యాలయాలూ ఈ సీజన్లో ప్రవేశాల ప్రక్రియను సాగిస్తాయి. ఇక్కడ జనవరిలో జరిగే స్ప్రింగ్‌ ప్రవేశాలు కూడా ఉన్నాయి.
ఆస్ట్రేలియా/ న్యూజీలాండ్‌: ఈ దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రవేశాలను జులైలో కల్పిస్తారు. ఫిబ్రవరి/ మార్చిల్లో కూడా ప్రవేశాలుంటాయి. యూఎస్‌ఏలో ఫాల్‌ సీజన్లో ఎలా పెద్దమొత్తంలో ప్రవేశాలుంటాయో, అలా ఇవి జులైలో కల్పిస్తాయి. ఈ దేశాలకు ప్రయత్నించేవారు ముందస్తుగా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. వారి కోర్సు మే దగ్గర్లో పూర్తవుతుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి కొంచెం సమయం మాత్రమే మిగులుతుంది.
తుది గడువులు ఎప్పుడు?
దరఖాస్తులు స్వీకరించటానికి తుది గడువులు ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కోలా ఉంటాయి. విశ్వవిద్యాలయ నిబంధనలూ, విధానాలపై ఇవి ఆధారపడి ఉంటాయి.
అంతర్జాతీయ విద్యార్థులకు టాప్‌ ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాల దరఖాస్తు తుది గడువులు సాధారణంగా కింది విధంగా ఉంటాయి. అవి:
ఫాల్‌: డిసెంబర్‌ 31 స్ప్రింగ్‌: ఆగస్టు 31
మరికొన్ని విశ్వవిద్యాలయాలకు..
ఫాల్‌: మార్చి 1 స్ప్రింగ్‌: అక్టోబర్‌ 1
కొన్ని తక్కువ ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాలకు..
ఫాల్‌: మే 1 స్ప్రింగ్‌: నవంబర్‌ 1
అడ్మిషన్‌కు సిద్ధమవడం నుంచి వీసా వరకు 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముంది. కొన్నిసార్లు దీనికంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అలాగే కొందరి విషయంలో ఇంతకన్నా త్వరగానూ పూర్తవవచ్చు.
దేశాలూ... టెస్టులూ
భారత్‌ వంటి దేశాల నుంచి విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాలకు వెళ్ళే విద్యార్థులు రాయాల్సిన టెస్టులు.
యూఎస్‌ఏ: జీఆర్‌ఈ/ జీమ్యాట్‌, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈ
యూకే: టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌
ఆస్ట్రేలియా: ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌/పీటీఈ
కెనడా: ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ
న్యూజీలాండ్‌: ఐఈఎల్‌టీఎస్‌
* టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ అంతర్జాతీయ విద్యార్థులందరికీ అవసరమైన ఇంగ్లిష్‌ ప్రావీణ్యాన్ని అంచనా వేస్తాయి.
* జీఆర్‌ఈ/ జీమ్యాట్‌లు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీలను అంచనా వేసే పరీక్షలు.
* అనేక దేశాలు, విశ్వవిద్యాలయాలను బట్టి పరీక్షలు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ, మనది ఆంగ్లం మాతృభాష కాని దేశం కాబట్టి టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈ వంటి ఇంగ్లిష్‌ పరీక్షలు మాత్రం తప్పనిసరి.
ప్రవేశాల దరఖాస్తు గడువులు
దరఖాస్తుల సంఖ్య, గత దరఖాస్తు విధానాల ఆధారంగా ఒక విశ్వవిద్యాలయానికీ మరోదానికీ తుది గడువుల్లో తేడాలుంటాయి. వివిధ శాఖల పని పూర్తవటానికి పట్టే సమయంపైనా ఇవి ఆధారపడి ఉంటాయి. చాలా విశ్వవిద్యాలయాలకు వాటిలో ఉన్న ఒక్కో శాఖకు ఒక్కో తుది గడువులున్నాయి. ఫార్మసీ, హెల్త్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ వంటి కొన్ని కోర్సులకు తుది గడువులు తొందరగా పూర్తవుతాయి. వీటిని చదవాలనుకునేవారు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చాలా విశ్వవిద్యాలయాలకు ఉపకార వేతనాలతో కూడిన ప్రవేశాలకు ప్రత్యేకమైన తుది గడువులుంటాయి. సాధారణంగా వాటిని వెబ్‌సైట్లలో పొందుపరచరు. వాటికి ముందస్తు దరఖాస్తులు చాలా ముఖ్యం.
ప్రవేశం (అడ్మిషన్‌) నుంచి వీసా వరకూ మొత్తం ప్రక్రియ జరగడానికి చాలా కాలం పడుతుంది. కొన్ని నెలల సమయం కూడా పట్టవచ్చు. కాబట్టి, విశ్వవిద్యాలయాలకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం అనేది... మొత్తం ప్రక్రియను సులభతరం చేస్తుంది. పైగా ప్రక్రియకు సంబంధించిన చివరి నిమిషపు ఒత్తిడుల నుంచీ, తిరస్కరణకు గురయ్యే ప్రమాదాల నుంచీ బయటపడవేస్తుంది.
మూడు సోపానాలు
విదేశీ విద్య కోసం విద్యార్థులు పూర్తిచేయాల్సిన సన్నాహాలను స్థూలంగా 3 మెట్లుగా చెప్పుకోవచ్చు.
1.విదేశాల్లో ఉన్నతవిద్యను చదవాలనుకున్న తరువాత జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, ట్రాన్‌స్క్రిప్ట్స్‌, రెకమండేషన్‌ లెటర్‌, ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్స్‌.. మొదలైన ప్రవేశానికి కావాల్సిన వాటి గురించి తెలుసుకోవాలి. ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడానికీ, పరీక్షలకు సన్నద్ధమవడానికీ వ్యక్తిని బట్టి సుమారు 3 నెలల సమయం పడుతుంది. కానీ, ఈ సన్నద్ధత ప్రభావం పరీక్షలూ, మార్కులపై పడకుండా చూసుకోవాలి.
2.పరీక్షలను రాయడం, విశ్వవిద్యాలయ ఎంపిక- ఇవి అకడమిక్‌ పర్సంటేజీ, టోఫెల్‌, జీఆర్‌ఈ మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలి. ఎందుకంటే దరఖాస్తు చేసిన అన్నిటిలోనూ ప్రవేశాలు రావాలనేమీ లేదు. ఒకటికి మించి ఖరారైన అడ్మిషన్లు (ఐ 20) చేతిలో ఉండడం ఎప్పుడూ మేలే. ఈ ప్రక్రియకు 2 నుంచి 4 వారాల సమయం పడుతుంది.
3.ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని నింపడం, అవసరమైన డాక్యుమెంట్లను విశ్వవిద్యాలయాలకు పంపడం చేయాలి. దరఖాస్తు నుంచి అడ్మిషన్‌ నిర్ణయం తీసుకోవడం వరకు విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌ను బట్టి 2 నుంచి 4 నెలల వ్యవధి పడుతుంది.
యూఎస్‌ఏ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో దరఖాస్తు ప్రక్రియ తొందరగా జరుగుతుంది. కొందరి విషయంలో కొన్ని వారాల సమయంలో పూర్తయిన దాఖలాలున్నాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తమ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ప్రణాళికలు వేసుకోవాలి, ప్రక్రియను మొదలుపెట్టాలి.


Posted on 21- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning