ఐటీలో మేటి 'టీహబ్‌'!

* తెలంగాణ ప్రభుత్వ యత్నాలకు ప్రశంస
* మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడి
* భవిష్యత్తులో అంకుర రంగాన్ని శాసించబోయేది భారతీయులేనని వ్యాఖ్య

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన ‘అంకుర కేంద్రం’- టీహబ్‌తో కలసి పనిచేస్తామని ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వెల్లడించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన ఈ తెలుగు తేజం డిసెంబరు 28న హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని టీ-హబ్‌ కేంద్రాన్ని సందర్శించారు. తెలంగాణ ఐటీ శాఖ ఈ కేంద్రంలో చేసిన ఏర్పాట్లను చూసి ప్రశంసించారు. ఈ సందర్భంగా అక్కడున్న స్టార్టప్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ''ఆలోచనలతో వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అంకుర కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. టీహబ్‌తో కలసి మా ప్రేరక సంస్థల (యాక్సిలరేటర్స్‌) ద్వారా ఔత్సాహికుల విజయగాథల్లో మైక్రోసాఫ్ట్‌ కూడా భాగం కావాలనుకుంటోంది. మీ ఔత్సాహిక కలల నుంచి స్ఫూర్తి పొందాలనే ఇక్కడికి వచ్చాను. మీ మెదడులో మొలచిన ఆలోచనాకుంరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారనివ్వకండి. ఆ ఆలోచనకు నీరుపోస్తూ ఆచరణలో ముందుకు సాగే సత్తాను సాధించుకోండి. అది నిరంతరం కొనసాగే సంస్కృతిని అలవర్చుకోండి. అలాంటి పని సంస్కృతిలో ఎంతగా జీవిస్తే మీ వ్యాపారం అంత సుస్థిరంగా ఎదుగుతుంది. అంకుర రంగంలో భారతీయుల ప్రతిభ అనూహ్యంగా వెలుగుతోంది. భారతీయులు ఈ రంగాన్ని శాసించబోతున్నారు'' అని సత్య నాదెళ్ల ప్రోత్సహించారు. అందరికీ అంతర్జాల సౌకర్యం కల్పించడానికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆలోచిస్తున్న ‘వైట్‌స్పేస్‌ టెక్నాలజీ’ గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికీ అంతర్జాల సదుపాయం అందుబాటులో రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. ఇందుకోసం స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మైక్రోసాఫ్ట్‌ ప్రోత్సహిస్తుందన్నారు.
మా తరగతులను డిజిటలైజ్‌ చేయండి
సత్య నాదెళ్లకు స్వాగతం పలికిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘సత్య నాదెళ్లతో సమావేశం ఎంతో ఫలవంతంగా జరిగింది. మైక్రోసాఫ్ట్‌తో కలసి సాగడానికి ఉన్న అనేక అవకాశాలను గుర్తించాం. వాళ్లు కూడా తమ సంస్థల ద్వారా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంకుర వాతావరణాన్ని మరింత వృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్‌ సాయం తీసుకుంటున్నాం. సత్య నాదెళ్ల కూడా ఆ అంశంపైనే ఆసక్తికనబరిచారు. మైక్రోసాఫ్ట్‌ మానసపుత్రికైన వైట్‌స్పేస్‌ టెక్నాలజీపైనా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికీ అంతర్జాల అనుసంధానంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం. ఈ సాంకేతికతలో స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకొచ్చి మైక్రోసాఫ్ట్‌తో కలిసి నడవాలని ఆయన కోరుకుంటున్నారు. అనేక చిన్న, మధ్యతరహా సంస్థల వ్యాపారాభివృద్ధికి దోహదం చేసే ‘క్లౌడ్‌’ సాంకేతికత గురించీ మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలోని విద్యార్థులకు అత్యుత్తమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంలోని అన్ని బడుల్లో తరగతి గదులను డిజిటలైజ్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సాయం కోరుతున్నాం’’ అన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీహబ్‌ సీఈవో జయ్‌ కృష్ణన్‌, సీఓఓ శ్రీనివాస్‌ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు.
Posted on 29- 12 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning