మెలకువలకు వైవా పదును

సాంకేతిక విద్యాభ్యాసం చివరి సంవత్సరంలో నిర్వహించే ‘సమగ్ర మౌఖిక పరీక్ష’ (వైవా) ప్రాధాన్యం విద్యార్థులు తెలుసుకోవాలి. దీనికి తగిన విధంగా సంసిద్ధమై ప్రతిభ చూపితే అది భవితకు మేలు చేస్తుంది!
సాంకేతిక సబ్జెక్టుల. మౌలికాంశాల జ్ఞానంపై విద్యార్థులకున్న జ్ఞానంపట్ల పరిశ్రమా, నిపుణులూ అసంతృప్తి వెలిబుచ్చటం సాధారణమైంది. నాలుగు సంవత్సరాల కాలంలో చదివిన నాలుగు పదులకు పైగా సబ్జెక్టులను గుర్తుంచుకోవడం కొంత కష్టమే ఐనా విద్యార్థులకు ఇది చాలా అవసరం. ఈ దిశలో దిద్దుబాటు చర్యగా నాలుగో సంవత్సరం రెండో సెమిస్టరులో జె.ఎన్‌.టి.యు. పరిధిలో ‘సమగ్ర మౌఖిక పరీక్ష’ను బి.టెక్‌లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు.
ఈ పరీక్ష సంగతులేమిటి?
బీటెక్‌లో చదివిన అన్ని సబ్జెక్టుల్లో గరిష్ఠంగా 100 మార్కులకు ఆయా విభాగాలు మౌఖికంగా పరీక్ష నిర్వహించి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తాయి. మొదటి సంవత్సరపు సబ్జెక్టులన్నీ పునశ్చరణ చేసుకుని అధ్యాపకుల కమిటీ ముందు ఇంటర్వ్యూ రూపంలో ఈ పరీక్షను తీసుకోవాలి. మౌఖిక పరీక్ష ప్రతి విద్యార్థికీ తప్పనిసరి.
ఉత్తీర్ణతకు ఇతర సబ్జెక్టుల మాదిరే కనీసం నలభై మార్కులు తెచ్చుకోవాలి. అంతర్గత మార్కులు ఉండవు. లాబొరేటరీ సబ్జెక్టుల తరహాలో మొత్తం 100 మార్కులకూ విశ్వవిద్యాలయం తరఫున కళాశాలలోనే మూల్యాంకనం జరుగుతుంది. విభాగాధిపతి అధ్యక్షునిగా వ్యవహరించే ఈ కమిటీలో కనీసం ముగ్గురు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సభ్యులుగా ఉంటారు. కొన్ని సందర్భాలలో ముగ్గురికన్నా ఎక్కువమంది కూడా ఉండవచ్చు. అంటే ఈ కమిటీ కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూ బోర్డును తలపించేలా ఉంటుందన్న మాట.
విశ్వవిద్యాలయం తరఫున జరిపే పరీక్ష కాబట్టి విద్యార్థులకు తమ మార్కులను వెంటనే తెలుసుకునే అవకాశం ఉండదు. ఫలితాలు వెల్లడించినప్పుడే అవి తెలుస్తాయి.
ఐతే ఈ మౌఖిక పరీక్ష ఎలా నిర్వహించాలి అన్న విషయంలో విశ్వవిద్యాలయం స్పష్టత ఇవ్వకపోవడంవల్ల కొన్ని సందిగ్ధతలకు ఆస్కారం ఏర్పడింది.
* ఎన్ని సబ్జెక్టుల్లో ఈ మౌఖిక పరీక్షకు తయారవ్వాలి?
* ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది?
* 100 మార్కులను ఏ ప్రాతిపదిక విధంగా విభజిస్తారు.
ఈ సందేహాల దృష్ట్యా ప్రధానంగా రెండు విధాల పరిస్థితుల్లో విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. సాధారణంగా తమ శాఖకు సంబంధించిన ముఖ్యమైన మౌలికమైన సబ్జెక్టులు మాత్రమే ఇచ్చే అవకాశాలు ఎక్కువ.
1. సబ్జెక్టులు ఏవి అన్నది విభాగం నిర్దేశించని సందర్భం
కొన్ని కళాశాలల్లో నచ్చిన కొన్ని సబ్జెక్టుల్లో మౌఖిక పరీక్షకు తయారవ్వమని చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో విద్యార్థులు కొంత సందిగ్ధానికి లోనయ్యే అవకాశం ఉంది. ఐదే పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
బి.టెక్‌లో చదివిన సాంకేతిక సబ్జెక్టులను పట్టికగా తయారుచేసుకుని వాటిని పరస్పర సంబంధాల ఆధారంగా విడివిడి పట్టికలుగా తయారు చేసుకోవాలి.
ఉదాహరణకు ఈసీఈ శాఖలో కమ్యూనికేషన్స్‌ అనే సబ్జెక్టును తీసుకుందాం. ఇందులో అనలాగ్‌ కమ్యూనికేషన్‌ రంగంలో అభిరుచి ఉండి ఆ రంగంలో కెరీర్‌ను మలచుకోవాలనుకునే విద్యార్థి ఇ.డి.సి. ఎస్‌ అండ్‌ ఎస్‌, ఇ.ఎం.టి.ఎల్‌. అనలాగ్‌ కమ్యూనికేషన్స్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, రాడార్‌ ఇంజినీరింగ్‌ అనే సబ్జెక్టుల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటితోపాటు కంట్రోల్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ సబ్జెక్టులు కూడా చదివితే మంచిది.
అలాగని మిగతా సబ్జెక్టులు చదవనక్కరలేదని అర్థం కాదు. నిజానికి అన్ని సబ్జెక్టులలోనూ కనీస ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు ఇవ్వగల సామర్థ్యం కోసం పాటుపడాలి. వీలైనన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు ఇవ్వగలిగిన రీతిలో తయారుకావాలి.
అంతర్జాలంలో, ఇతర మార్గాల్లో లభ్యమయ్యే వివిధ కంపెనీల ఇంటర్వ్యూ ప్రశ్నలను సేకరించాలి. వాటిని క్రోడీకరించి, అవసరమైతే సహ విద్యార్థుల, అధ్యాపకుల సహకారంతో వాటికి నాణ్యమైన క్లుప్తమైన సమాధానాలు తయారుచేసుకుని సిద్ధమవ్వాలి. అప్పుడు కళాశాల నిర్వహించే మౌఖిక పరీక్షలోనే కాదు; ఉద్యోగ నియామకాల్లో జరిగే రాత పరీక్షలూ, ఇంటర్వ్యూలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు.
ఐతే తమ కళాశాలలో మౌఖిక పరీక్షల ప్రక్రియ ఎలా ఉంటుందో రెండో/ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే తెలుసుకుంటే ముందునుంచే పటిష్ఠమైన ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వవచ్చు. సబ్జెక్టుల పట్టికలో సమతుల్యత పాటించాలి. ప్రతి మౌలిక సబ్జెక్టులతోపాటు కొన్ని అదనపు సబ్జెక్టులను కూడా చేర్చుకోవడం మంచిది.
అవకాశం ఉంటే కొందరు విద్యార్థులు చిన్న బృందాలుగా ఏర్పడి బాధ్యతలను పంచుకోవచ్చు. ప్రశ్నోత్తరాలను సేకరించుకుని పరస్పర చర్చల ద్వారా నాణ్యమైన సమాధానాల నోట్సు తయారుచేసుకోవచ్చు. ఇదెంతో మేలు చేకూరుస్తుంది. విద్యార్థులను బృందాలుగా చేసే బాధ్యత విభాగం తీసుకుంటే ఇంకా మంచిది.
2. సబ్జెక్టుల పట్టికను ప్రకటించినప్పుడు
ఈ సందర్భంలో విద్యార్థుల బాధ్యత కొంతమేరకు తగ్గడమే కాకుండా తయారవ్వడం కూడా సులువౌతుంది. ఇందులో రెండు విధాలకు ఆస్కారం ఉంది. మొదటిది సబ్జెక్టులు మాత్రమే ప్రకటించినప్పుడు విద్యార్థుల పని ఇంచుమించు పైన చెప్పిన మార్గంలోనే ఉంటుంది. కాకపోతే సబ్జెక్టుల విషయంలో స్పష్టత ఉంటుంది. ఇక రెండోది సబ్జెక్టులతోపాటు ప్రశ్నలనిధి కూడా ఇచ్చి ఉంటే జవాబులు తయారుచేసుకోవడం. సమాధానాలను మననం, పునశ్చరణ చేసుకుని సిద్ధమవ్వాలి. మిగతా ప్రక్రియ పైన సూచించిన విధంగానే చేసుకోవాలి.
వైవా లో ప్రశ్నలు మౌలిక అంశాలపై విద్యార్థికి ఉన్న పట్టును పరీక్షించడానికి ఉంటాయి. జవాబులు కూడా మౌలిక సూత్రాలను ప్రముఖంగా పేర్కొనేలా ఉండాలి. చిన్నచిన్న వాక్యాల్లో సమాధానాలు చేసుకుంటే తయారవడం తేలికవుతుంది; పరీక్ష సమయంలో తడబాటు లేకుండా సమాధానాలివ్వటానికి వీలవుతుంది.
జవాబుల తయారీ ఎలా?
సేకరించిన ప్రశ్నలకు సమాధానాలు ఏ రీతిన తయారుచేసుకుంటే మంచిదో చూద్దాం. ఒక ప్రశ్నకు సమాధానం కేవలం ముక్తసరిగా కాకుండా కాస్త వివరణతో కూడినదిగా ఉండాలి. ఐతే నిర్వచనాలు అడిగే ప్రశ్నలకు మినహాయింపు ఉండవచ్చు. వీలైతే ఉదాహరణలను చేర్చుకోవచ్చు. ఇతర ప్రశ్నలకు కొంత పూర్వ పీఠికతో కూడిన సమాధానాలు సిద్ధం చేసుకుంటే మంచిది.
సాధారణంగా ప్రశ్నలు మౌలిక అంశాలపై విద్యార్థికి ఉన్న పట్టును పరీక్షించడానికి ఉంటాయి. జవాబులు కూడా మౌలిక సూత్రాలను ప్రముఖంగా పేర్కొనేలా ఉండాలి. చిన్నచిన్న వాక్యాల్లో సమాధానాలుతయారుచేసుకుంటే తయారవడం తేలికవుతుంది; పరీక్ష సమయంలో తడబాటు లేకుండా సమాధానాలివ్వగలరు. తయారుచేసుకున్న సమాధానాలను అధ్యాపకులకు చూపించి వాటి నాణ్యతకు వారి ఆమోదముద్ర వేయించుకోవడం మంచిది.
మౌఖిక పరీక్ష సమయంలో అడిగితే కానీ వివరణలు ఇవ్వకపోవడం మంచిది. ఇచ్చే జవాబు స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి. వివరణ అడిగేవిధంగా ప్రశ్నకు సమాధానం ఇచ్చే చాతుర్యాన్ని అభ్యాసం చేసుకుంటే మంచిది. దీనివల్ల ఇంటర్వ్యూ చేసేవారికి ఆసక్తి కలగడమే కాక విద్యార్థిపై సదభిప్రాయం ఏర్పడుతుంది.
ఏయే ప్రయోజనాలు?
1. విద్యార్థులు సాంకేతిక సబ్జెక్టుల్లో మెలకువలకు పదును పెట్టుకునే అవకాశం ఉంది.
2. తగినంత సమయం వినియోగించి అన్ని సబ్జెక్టులూ చదవడం వల్ల సబ్జెక్టుల పరస్పర ఆధారాలపై మంచి పట్టు సాధించవచ్చు.
3. ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల ప్రవేశపరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో చక్కటి ప్రతిభను ప్రదర్శించవచ్చు.
4. విస్పష్టమైన భావ ప్రకటనా సామర్థ్యం పెంపొందించుకోవచ్చు.
5. మౌలికాంశాల అంతర్భాగాలైన వివిధ సూత్రాలను ఎలా అన్వయింపచెయ్యాలో అవగాహనకు వస్తుంది.
6. సాంకేతికంగా, బాడీ లాంగ్వేజ్‌వంటి వ్యక్తిత్వ సంబంధిత అంశాల్లో ఏవైనా లోపాలుంటే అధ్యాపకుల సహాయ సహకారాలతో సరిదిద్దుకోవచ్చు.
7. ఇంటర్వ్యూలకు ఉపయోగపడేవిధంగా ప్రశ్నల నిధి తయారుచేసుకోవచ్చు.
8. అన్ని ముఖ్యమైన సబ్జెక్టుల్లో ఉపయుక్తమయ్యే విషయ పరిజ్ఞానంతో కళాశాల నుంచి ఉద్యోగ ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో అడుగు వేయగలరు.
9. స్వశక్తితో, స్వీయ ప్రతిభతో ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించవచ్చు.
ఇన్ని ఉపయోగాలున్న ఈ సమగ్ర మౌఖిక పరీక్షను విద్యార్థులు మార్కులకోసం మాత్రమే కాకుండా తమకు ఉద్యోగాలను తెచ్చిపెట్టే ముఖ్యమైన సాధనంగా ఉపయోగించుకోవాలి. భావప్రకటన, ఆత్మవిశ్వాసం, భాషా పటిమ, విషయ పరిజ్ఞానం పెంపొందించే ఆయుధంగా, తమ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా దీన్ని గుర్తించాలి.
Posted on 19- 1 - 2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning