ప్రతిభకు 'కొలువు'మానం!

* ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రారంభం కానున్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌
న్యూస్‌టుడే, వరంగల్ (విద్యానగర్‌): ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో అలజడి, ఆందోళన ప్రారంభమైంది. ఇందుకు కారణం త్వరలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ప్రాంరంభం కానున్నట్లు ఇంజినీరింగ్‌ కళాశాలల యజమాన్యాలు ప్రకటించడం. ఈ పోటీ ప్రపంచంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం సాధిస్తే విద్యార్థులకు గుర్తింపుతోపాటు జీవితంలో స్థిరపడతారు. అందుకే విద్యార్థులు సరైన ప్రణాళిక, మంచి నిబద్ధతతో కృషి చేస్తే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కొలువును దక్కించుకోవడం పెద్ద కష్టమైన పని కాదని విషయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నైపుణ్యాలను పెంచుకోవాలని వారు సూచిస్తున్నారు. దేశంలో ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పలు ప్రముఖ ఐటీ కంపెనీలు ఇటివలే స్పష్టం చేశాయి. అయితే ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు విద్యార్థులు తప్పకుండా మెరుగుపర్చుకోవాలని వారు సూచించారు. జిల్లాలో సైతం ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు బీటెక్‌ పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వీరిలో వందల మందే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం సంపాదిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ సంవత్సరంలోనైనా క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుకుంటున్నారు.
సందడి ప్రారంభం కానుంది..
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా జనవరి చివరి వారం నుంచి క్యాంపస్‌ ఇంటర్వ్యూల సందడి ప్రారంభమవుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోతో పాటు అనేక ఇతరకంపెనీలు సైతం జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఇందు కోసం విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. విషయ నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా చూసేందుకు కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
లోపమెక్కడ..!
విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం బాగా ఉన్నప్పటికీ భావ వ్యక్తీకరణ విషయంలో వెనుకబడుతున్నారని పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. టెక్నికల్‌ విషయంలోనూ సమస్య ఉంటుందంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికి కూడా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సమస్య ఉంది. కొందరిలో భావ వ్యక్తీకరణ బాగున్నా, టెక్నికల్‌ నైపుణ్యాల అనుకున్న స్థాయి ఉండడం లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రధాన అవరోధం భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. స్వతహాగా గ్రామీణ విద్యార్థుల్లో ఉండే బిడియం కారణంగా ఎక్కువమంది ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతున్నట్లు వారు విశ్లేషిస్తున్నారు.
కంపెనీలు ఏం చూస్తాయి!
క్యాంపస్‌ ఎంపికల్లో ప్రధానంగా నాలుగు అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని కంపెనీలు చూస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రాత పరీక్ష..
చాలా మంది అభ్యర్థులు రాత పరీక్ష అనే సరికి ప్రస్తుతం చదువుతున్న కోర్సుకు సంబంధించిన అంశాలపై ఉంటుందని భావిస్తారు. అది సరికాదు. అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం(బేసిక్‌ నాలెడ్జ్‌)ను ఇందులో పరిశీలిస్తారు. ప్రశ్నలు సైతం సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్నీ తెలిసినవే అయినప్పటికీ సమయం తక్కువగా ఉండడం, ప్రాక్టీసు లేకపోవడంతో వెనుకబడుతుంటారు.
టెక్నికల్‌ స్కిల్స్‌..
ఈ విషయంలో అభ్యర్థి ఏదో ఒక రంగంలో పూర్తి స్థాయి పరిజ్ఞానం కలిగి ఉండాలి. అన్నింటిపై దృష్టి సారించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. వృథా ప్రయాస కూడా.
ఆలోచన విధానం..
మనం మాట్లాడే, రాసే ప్రతి విషయం మన ఆలోచన విధానం తెలియజేస్తుంది. పలు విషయాలపై మనం చెప్పే సమాధానాలు మన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ఇందులో నెగ్గాలంటే సకారాత్మక ధోరణి(పాజిటివ్‌ థింకింగ్‌)తో వ్యవహరించాలి.
మాటే మంత్రం..
బృంద చర్చ ద్వారా అభ్యర్థి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించే ఈ దశను హెచ్‌ఆర్‌ దశగా పేర్కొంటారు. సబ్జెక్టుతో ఏ మాత్రం సంబంధం లేని ఈ దశలో పరిస్థితులకనుగుణంగా విద్యార్థులు వ్యవహరించే తీరు, నాయకత్వ లక్షణాలు, బృందంతో నడుచుకునే విధానం, సమయపాలన, సమయస్ఫూర్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
* ఇందులో ప్రధానమైనది భాష. వినియోగించే భాష మృదువుగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ మార్కులు వస్తాయనుకోవడం పొరపాటు. అతిగా మాట్లాడడం, అసలే మాట్లాడకపోవడం రెండు మంచివి కావు.
* సబ్జెక్టుకన్నా సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే ముఖ్యం.
* చర్చ ప్రారంభించిన వారికి గాని, ముగించిన వారికి ప్రత్యేక మార్కులు లేవు. చర్చలో వాదన చేయడం, చేతులు విసరడం, బల్లను చరచడం లాంటివి చేయకుడదు.
* బాడీ లాంగ్వేజ్‌ ప్రధానం. పద వినియోగం విలువ తెలుసుకోవాలి.
దిక్కులు చూడొద్దు.. గోళ్లు గిల్లొద్దు
అవకాశం దక్కించు కోవడానికి మౌఖిక(ఇంటర్వ్యూ) దశ కీలకమైనది. ఫలితాన్నిచ్చే ఈ దశ నెగ్గేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇంటర్వ్యూ గదిలో వెళ్లేముందు అనుమతి తీసుకుని వెళ్లాలి.
* లోపలికి వెళ్లగానే కూర్చోకుండా, అనుమతి కోసం నిరీక్షించండి. అర నిమిషం వేచి ఉన్నా ఇంటర్వ్యూ చేసేవారి నుంచి స్పందన లేకపోతే అనుమతి అడిగి కూర్చోండి.
* మీకు సంబంధించిన ఫైళ్లు, ఫోల్డర్లు టేబుల్‌పై పెట్టొదు.ఒడిలో కాని, కుర్చీ పక్కన గాని పెట్టుకోవాలి.
* ఇంటర్వ్యూ జరిగేంత సేపు మోముపై చిరునవ్వు చెరగనీయొద్దు.
* ప్రశ్న పూర్తయిన తర్వాతే సమాధానం చెప్పాలి. అంతేగాని ప్రశ్న అడుగుతుండగానే తొందరపడి సమాధానం ఇవ్వొద్దు.
* కష్టతరమైన ప్రశ్న అయితే దిక్కులు చూడకుండా సమయం అడిగి ఆలోచించుకోవాలి.
* సమాధానం ఏదో ఒకటి చెప్పడం గాని, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడంగాని, అబద్ధం చెప్పడం గాని, నాన్చడంగాని తగదు.
* ఆలోచించే పమయంలో మేనరిజమ్స్‌ బయటపడకూడదు. కాళ్లు కదపడం, గోళ్లు గిల్లడం, వేళ్లు కదిపించడం లాంటివి తగవు.దుస్తుల్లో హుందాతనం ఉండాలి
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్‌కోడ్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అమ్మాయిలైతే హుందాగా కన్పించేలా దుస్తులు వేసుకోవాలి. అబ్బాయిలు చింపిరిగా కాకుండా జుత్తు దగ్గరగా కట్‌ చేసుకొని షేవ్‌ చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చిన రీతిలో ఫ్యాషన్‌ దుస్తులు ధరించి ఇంటర్వ్యూకు హాజరుకావద్దు.
ప్రతిభే గిటురాయి..:
- డాక్టర్‌ వై.మనోహర్‌, డైరెక్టర్‌, కిట్స్‌ కళాశాల
కంపెనీలన్నీ విద్యార్థుల ఎంపికలో సరైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తాయి. అందుకే విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలతో ఎంపిక అధికారులను ఆకట్టుకోవాలి. ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆ కంపెనీ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. పాఠ్యంశాలపై పట్టుతో పాటు టెక్నికల్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. మంచి ప్రతిభ ఉంటే పోటీ ఎంతున్నప్పటికీ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు తప్పక రాణిస్తారు. ఇందుకు విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
ప్రాథమిక విషయాలను విస్మరించొద్దు..:
- డాక్టర్‌ టి.సుమతి ఉమ మహేశ్వరి, ప్రిన్సిపల్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల, కేయూ
క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొనే చాలా మంది విద్యార్థులకు ప్రాథమిక విషయాలపై కూడా అవగాహన లేకుండా ఉంటున్నారు.ఇది సరైన పద్ధతి కాదు. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు చురుకుదనం, చొరవ ప్రదర్శించాలి. నాయకత్వ లక్షణాలు, బృందంలో కలిసి పనిచేసే విధానాన్నిఅలవర్చుకోవాలి. విజేతగా నిలవాలనే తపన ప్రతి విద్యార్థిలో ఉండాలి.
Posted on 28- 1 - 2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning