వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో 'అంకురా'లకు వెన్నుదన్ను

* 'హెల్త్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌'ను ప్రారంభించనున్న టీ-హబ్‌
ఈనాడు - హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు కృషి చేస్తున్న టి-హబ్‌, వైద్య సాంకేతిక విభాగంలోని స్టార్టప్‌లకు కూడా చేయూత నివ్వనుంది. దీని కోసం ‘హెల్త్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌’ను ఆవిష్కరించబోతోంది. టి-హబ్‌ సీఈఓ జయ్‌ కృష్ణన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని ‘టి-హబ్‌ హెల్త్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌’ పేరుతో వ్యవహరిస్తారు. అగ్రశ్రేణి ఔషధ కంపెనీ అయిన మెర్క్‌, మైక్రోసాఫ్ట్‌ వెంచర్స్‌ ఇందులో భాగం పంచుకుంటాయి. వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు హెల్త్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌లో భాగస్వామి అయితే, ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఇవ్వటం దగ్గర నుంచి ఆయా రంగాలకు చెందిన నిపుణుల నుంచి సలహాలు, సహాయ సహకారాలు అందించే ఏర్పాటు చేస్తారు. అంతేగాక వెంచర్‌ కేపిటల్‌ సంస్థల నుంచి పెట్టుబడి నిధులు లభించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. మన దేశంలో స్టార్టప్‌ సంస్కృతిని విస్తరించాల్సి ఉందని, ఇందులో భాగంలో దేశంలోనే తొలిసారిగా హెల్త్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు టి-హబ్‌ సీఈఓ జయ్‌ కృష్ణన్‌ ఫిబ్రవరి 10న జరిగిన 'బయోఏషియా- 2016' స్టార్టప్‌ షోకేస్‌ కార్యక్రమంలో వెల్లడించారు.
ఎల్‌వీపీఈఓ డాక్టర్‌కు బయో-ఏషియా ఇన్నోవేషన్‌ అవార్డు
బయోఏషియా 2016 ఇన్నోవేషన్‌ అవార్డు ఎల్‌వీపీఈఐ ఇనిస్టిట్యూట్‌ డాక్టర్‌ ప్రేమనందిని సద్గుణంను వరించింది. దీని కింద రూ.60,000 గ్రాంటు లభిస్తుంది. బయోఏషియా 2016 స్టార్టప్‌ షోకేస్‌ కార్యక్రమానికి పానలిస్టులుగా ఇజ్రాయెల్‌కు చెందిన వైస్‌మాన్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌, నోబల్‌ బహుమతి గ్రహీత అదా యోనథ్‌, విపిన్‌ ఆంటోనీ, టై-హైదరాబాద్‌ అధ్యక్షుడు సురేష్‌ చల్లా, బయోఏషియా సీఈఓ శక్తి నాగప్పన్‌, హైసియా అధ్యక్షుడు రమేష్‌ లోగనాథన్‌ వ్యవహరించారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన స్టార్టప్‌ సంస్థల నుంచి 150 వరకూ ప్రతిపాదనలు ఈ సందర్భంగా లభించాయి. వీటిని ప్రత్యేక జ్యూరీ పరిశీలించింది.
50 దేశాల భాగస్వామ్యం
మూడు రోజుల పాటు జరిగిన బయోఏషియా 2016లో 50 దేశాలకు చెందిన దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో నిస్ణాతులైన 110 మంది ప్రసంగాలు చేశారు. రూ.1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో ఫార్మా, జీవ శాస్త్రాలు, బయోటెక్‌, వైద్య ఆరోగ్య విభాగాలతో పాటు 3డీ ప్రింటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా వంటి ఐటీ ఆధారిత అంశాలపైన కూడా చర్చలు, సంప్రదింపులు జరిగాయి. ఫెర్రింగ్‌ ఫార్మా, తెలంగాణా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదురటం, దాని ప్రకారం ఇక్కడ ఫార్మా యూనిట్‌ నెలకొల్పేందుకు ఫెర్రింగ్‌ ఫార్మా సిద్ధపడటం బయోఏషియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ అంచనాల కంటే అధికంగా బయోఏషియా సదస్సు విజయవంతం అయినట్లు బయోఏషియా 2016 సీఈఓ శక్తి నాగప్పన్‌ అన్నారు. వచ్చే ఏడాది ఈ సదస్సును ఇంకా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Posted on 11-02-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning