కొలువులు వదిలి... సంస్థలుగా మలిచి...

* అనుభవాల మూటతో స్వదేశానికి.. ఎదిగి వచ్చారు
* సొంత వెంచర్లపైనే ఎన్ఆర్ఐల ఆసక్తి

విదేశాలకు వెళ్లడమే గొప్పగా భావిస్తాం.. ఎవరైనా వెళ్లి అక్కడ స్థిరపడిన వారుంటే పదిసార్లు వారిగురించే మాట్లాడుకుంటాం.. ప్రవాస భారతీయులు అనగానే మనకు అంత ఆరాధన..గౌరవం. అయితే డాలర్లలో సంపాదన.. సౌకర్యవంతమైన జీవితం.. వీటన్నింటినీ వదులుకుని విదేశాల నుంచి మనవాళ్లు తిరిగి వస్తున్నారు. పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా.. కొత్తగా వెళ్లేవారు వెళుతుండగా.. విదేశీ మోజు తీరగానే సొంతగడ్డపై వాలిపోతున్న వారూ ఉన్నారు. అలా వచ్చిన వారంతా ఇక్కడ ఏం చేస్తున్నారనేది ఆసక్తికరం.

విదేశాల్లో ఆర్థిక సంక్షోభ వేళ మనవారు ఎక్కువగా స్వదేశీ బాట పట్టారు. సంక్షోభాలే అవకాశాలను సృష్టిస్తాయి అన్నట్లుగా అప్పటి మాంద్యం ఒక రకంగా మనకు మేలే చేసింది అంటున్నారు ఆర్థికరంగ నిపుణులు. విదేశాల్లో ఏళ్ల తరబడి కొలువులు చేసి తిరిగి రాగానే మళ్లీ మరో కొలువులో చేరకుండా సొంతంగా అవకాశాలను సృష్టించుకోవడం ఇటీవల బాగా పెరిగింది. సామాజిక ప్రయోజనం ఉండే యోచన మొదలు.. వ్యాపార ఆలోచన వరకు విదేశీ అనుభవాలను స్వదేశంలో గుమ్మరిస్తున్నారు. నగరవాసులు ఇదివరకెప్పుడు చూడని వినూత్న ఆలోచనలను పరిచయం చేస్తూ ఉపాధికి బాటలు పరుచుకుంటున్నారు. ఇలాంటి కొందరు ఔత్సాహికుల్ని 'ఈనాడు' పలకరించగా.. కొత్త ప్రయత్నంలో విజయం సాధించినవారు కొందరైతే.. అనుభవాలను మూటకట్టుకుని తిరిగి కొలువుల్లో చేరుతున్న వారు ఇంకొందరున్నారు. ఆలోచన ఉంటే చాలు పెట్టుబడి పెట్టేందుకు పలువురు ముందుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండటంతో ఇంకా విదేశాల్లో ఏముంది అంటున్నారు. తిరిగి వచ్చాక కొన్నాళ్లు విశాంత్రి తీసుకుని ఆలోచించే తత్వం కొందరిదైతే.. అక్కడి నుంచే సన్నద్ధత మొదలెట్టిన వేగం మరికొందరిది. తామేం చేయాలనుకుంటున్న విషయాన్ని అంతర్జాలంలో పెట్టి..చర్చలు కొనసాగించి.. కలిసి వచ్చేవారితో కలిసి సొంతంగా ఎదిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. భారతీయులు, చైనీయులు ఈ విషయంలో ముందుంటే.. అందులో తెలుగువారు ఇంకా ముందున్నారు. భారత విదేశీ వ్యవహారాల పరిశోధన సంస్థ అయిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ సర్వే ప్రకారం..26 ఏళ్ల నుంచి 30ఏళ్ల వారు.. సొంత సంస్థల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్నారు. రూ.2.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కొత్త వెంచర్లపై పెట్టుబడి పెట్టేందుకు ధైర్యం చేస్తున్నారు.
వెంటనే ఫలితాలు ఆశించొద్దు
నేను మెకానికల్ ఇంజినీర్ని. 99లో అమెరికా వెళ్లాను. దాదాపు 12 ఏళ్లు పనిచేశాను. మా అమ్మానాన్న, అత్తమామ అందరూ హైదరాబాద్‌లో ఉండటం..మా పిల్లలు వారికి చేరువ కాలేకపోవడంతో 2011లో నగరానికి వచ్చేశాను. ఇక్కడి వచ్చాక చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించే కార్యకలాపాలు లేకపోవడం గమనించాను. యూఎస్‌లో ఈతరహా ఉన్న అనుభవంతో నేనే కిడీహౌ పిల్లల మ్యూజియం ప్రారంభించాను. దీనికి మంచి ఆదరణ లభించింది. ఇక్కడి ప్రజలు కొత్తవి కావాలనుకుంటున్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనువైన వేదిక ఉంది. ఎక్కువ మంది వెంటనే ఆదాయం వచ్చేయాలనుకుంటున్నారు. అంకితభావం ఉంటే దీర్ఘకాలంలో ఫలితాలు ఉంటాయి. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ ప్రారంభంలో రాబడి ఇవ్వలేదు. దృక్పథం మారితే వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినా విజయాలు సాధిస్తారు.

- నిరంజన్ వాసిరెడ్డి, కిడీహౌ పిల్లల మ్యూజియం
24 గంటల్లో రెండో అభిప్రాయం
వరంగల్ ఎన్ఐటీ నుంచి చదువు పూర్తిచేసి విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 16ఏళ్లు పనిచేశాను. 2010లో నగరానికి వచ్చి సొంతంగా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు 'ఎక్స్‌పర్ట్ నేషన్' స్ఫురించింది. మా ఇంట్లో అందరూ వైద్యులే. అనారోగ్యంతో బాధపడుతున్నవారూ ఉన్నారు. వారిని ఆస్పత్రిలో చూపిస్తే శస్త్రచికిత్స చేయాలన్నారు.రోగికి అనస్తీషియా ఇవ్వడం క్షేమం కాదని ఇంట్లోని వైద్యులు రెండో అభిప్రాయంగా చెప్పారు.డాక్టర్లున్న ఇంట్లో ఇది సాధ్యమే. మిగతా వారి పరిస్థితేంటి? అంతర్జాలం వినియోగించుకుని ఇంటి నుంచే వైద్యులనుంచి 24 గంటల్లోనే రెండో అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంటే? ఓసారి నేను ఢిల్లీలో వైద్యుల వద్దకు వెళితే పరీక్షలకు రాశారు. అప్పటికే వాటిని చేయించాను. ఆ నివేదికలు వెంటలేకపోవడంతో మరోసారి తప్పలేదు. ఈఇబ్బంది లేకుండా ఉచితంగానే మా వెబ్‌సైట్లో వైద్య నివేదికలను అప్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు.
- వసంత గుళ్లపల్లి, సహ వ్యవస్థాపకురాలు, ఎక్స్‌పర్ట్ నేషన్
అధ్యయనం చేశాక అడుగిడితేనే
నేను కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసేందుకు 1993లో యూఎస్ఏ వెళ్లాను. పదేళ్లపాటు ఉద్యోగం చేశాను. 2005లో ఇండియాకు వచ్చాను. ఓ సంస్థను ప్రారంభించి టెలికం రంగంలో సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రాజెక్టులు చేశాను. నేను చదివిన రంగంలోనే కొనసాగడం.. దీర్ఘకాల అనుభవం ఉండడంతో శ్రమ తెలిసేది కాదు. కొత్తగా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు సౌరవిద్యుత్తులో వృద్ధికి అవకాశం ఉందనిపించింది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరంగా కొరత ఉంది. గ్రామాల్లో రైతులు నీరున్నా కరెంట్ లేక పండించలేకపోతున్నారు. రైతులతో పాటు గృహావసరాల్లోనూ సౌరశక్తికి ఆదరణ పెరిగే వీలుండటంతో ఈ రంగంలో అడుగుపెట్టాను. విదేశాల్లో సంపాదించిన సొమ్ము, కుటుంబ సభ్యుల మద్దతుతో తొలి వెంచర్ ప్రారంభించాను. ఒకదాని వెంట మరోటి. విదేశాల నుంచి వచ్చేస్తూ ఏదైనా ప్రారంభించాలని అనుకున్నప్పుడు అధ్యయనం చేస్తే మంచిది.
- ఇంద్రసేన్, వ్యవస్థాపకులు, ఫోర్ సోలార్
భాగస్వామ్యంలో చేయడం మంచిది
భీమవరంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. మాస్టర్స్ చేసేందుకు 1999లో అమెరికా వెళ్లాను. 2007 వరకు అక్కడే ఓ సంస్థలో పని చేశాను. భారత్‌కు వచ్చాక 2008 వరకు ఉద్యోగం చేశాను. సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనతో ఈవెనింగ్ అవర్ పేరుతో గ్రంథాలయాన్ని మొదలెట్టాను. రాత్రి వరకు అందుబాటులో ఉండేలా.. వారానికో రచయితతో సంభాషించే అవకాశం వంటి కాన్సెప్ట్‌తో ప్రారంభించాను. ట్రాఫిక్, తదితర కారణాల వల్ల పాఠకులకు వీలుగా పూర్తిస్థాయిలో దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులే దీని బాధ్యతలు చూసుకుంటున్నారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకునే వారు భాగస్వాములను చేర్చుకుంటే మంచిది. వారి పాత్ర ఉండటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించే వీలుంటుంది. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ప్రారంభించే సంస్థలకు హైదరాబాద్‌లో నిధుల సమస్యే లేదు. కొత్త ఆలోచనతో రావొచ్చు.
- ప్రియాంక, వ్యవస్థాపకురాలు, ఈవినింగ్అవర్
రెండు పడవలపై కాళ్లు పెట్టొద్దు.
యూఎస్‌కు 1999లో వెళ్లాను. ఐటీ సేవల కంపెనీని మరుసటి ఏడాదే ప్రారంభించాను. ఆ అనుభవంతో 2004లో హైదరాబాద్ ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించాను. మూడేళ్ల అనంతరం ఇండియాకు రావాలనుకున్నాను. ఆఫ్‌షోర్ సేవలందిస్తున్న హైదరాబాద్ కంపెనీని వృద్ధిలోకి తెచ్చే బాధ్యతను స్వదేశానికి రాగానే చేపట్టాను.బిజినెస్ టూ బిజినెస్ సర్వీస్ చేస్తూ వచ్చాను. ఈకామర్స్ రావడంతో భారత్‌లో బీ టూ సీ చేయాలనే ఆలోచన మొదలైంది. ఏం చేయాలో స్పష్టత లేదు. పరిచయాలు పెరుగుతాయని సదస్సులకు వెళ్లేవాడిని. వాటి వివరాలు ముందుగా తెలిసేవి కావు. వీటిని పోర్టల్‌లో అందుబాటులోకి తేవచ్చనే ఆలోచనతో మేరా ఈవెంట్స్ ప్రారంభించాను. వాటిపైన క్లిక్ చేయగానే టిక్కెట్ పొందే అవకాశం కల్పించాం. 2009లో ప్రారంభించి నాలుగేళ్లలోనే ఎదిగాం. చాలామంది రెండు పడవలపై కాలు పెడుతున్నారు. కొత్త సమస్యలకు పరిష్కారమిచ్చేలా సంస్థలు రాగలిగితేనే ఆదరణ.
- చెన్నపనాయుడు దారపనేని, మేరా ఈవెంట్స్‌ డాట్‌కామ్
ఐదేళ్లలోనే ఇంటిపై ధ్యాస
* ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన అధ్యయనంలో విదేశాలకు వెళ్లిన వారిలో 20 నుంచి 50 శాతం మంది వచ్చిన ఐదేళ్లలోనే స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పదేళ్లు దాటగానే తిరిగి వెళ్లిపోవాలని బలంగా కోరుకుంటున్నారు.
* విదేశాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకుని కొత్త దృక్పథంతో.. అక్కడి అనుభవాన్ని నూతన వెంచర్ల ప్రారంభంలో రంగరించి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్నారు.
* సొంత సంస్థల ఏర్పాటుతో వ్యక్తిగతంగా తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడంతో పాటు అభివృద్ధి చెందడానికి దోహదం ఉంటుందని వారు ఆశిస్తున్నారు.
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning